శరద్ పవార్ నివాసంలోఎనిమిది పార్టీల నేతలు భేటీ
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ నివాసంలో మంగళవారం ఎనిమిది పార్టీల నేతలు భేటీ అయ్యారు. సాయంత్రం 4 గంటలకు మొదలైన ఈ సమావేశంలో రెండున్నర గంటలపాటు దేశంలోని రాజకీయ పరిణామాలపై చర్చ జరిపారు. రైతుల నిరసన, ఆర్థిక పతనం, సాధారణ పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెట్రోల్ ధరల పెంపు సహా పలు అంశాలపై చర్చించారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా, ఎన్‌సీ నేత […]
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ నివాసంలో మంగళవారం ఎనిమిది పార్టీల నేతలు భేటీ అయ్యారు. సాయంత్రం 4 గంటలకు మొదలైన ఈ సమావేశంలో రెండున్నర గంటలపాటు దేశంలోని రాజకీయ పరిణామాలపై చర్చ జరిపారు. రైతుల నిరసన, ఆర్థిక పతనం, సాధారణ పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెట్రోల్ ధరల పెంపు సహా పలు అంశాలపై చర్చించారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా, ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా, ఆప్ నేత సుశీల్ గుప్తా, ఆర్‌ఎల్డీ నేత జయంత్ చౌదరి, ఎస్‌పీ నేత ఘనశ్యామ్ తివారీ, సీపీఐ నేత బినోయ్ విశ్వం, సీపీఎం నేత నీలోత్పాల్ బసులు సహా పలువురు నేతలు ఇందులో పాల్గొన్నారు. రాజకీయేతర ప్రముఖులు జావేద్ అక్తర్, రిటైర్డ్ జస్టిస్ ఏపీ షా, మాజీ దౌత్యవేత్త కేసీ సింగ్‌లూ హాజరయ్యారు. రెండు వారాల వ్యవధిలోనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో శరద్ పవార్ రెండుసార్లు భేటీ కావడం, తర్వాత కాంగ్రెస్ మినహా విపక్ష పార్టీల నేతలు సమావేశం కావడంతో రాజకీయవర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2024లో బీజేపీని బీట్ చేయడానికి థర్డ్ ఫ్రంట్ వ్యూహంలో భాగంగా ఈ సమావేశం జరుగుతున్నట్టు చర్చ జరిగింది. కానీ, అలాంటిదేమీ లేదని భేటీలో పాల్గొన్న నేతలు కొట్టిపారేశారు. అయినప్పటకీ ప్రత్యామ్నాయం అవసరమన్న సంకేతాలను నర్మగర్భంగా ఇచ్చారు.
కాంగ్రెస్‌ను బాయ్‌కాట్ చేయలేదు
సమావేశానంతరం ఎన్‌సీపీ నేత మజీద్ మెమన్ మాట్లాడుతూ ఈ సమావేశాన్ని శరద్ పవార్ నిర్వహించలేదని, కేవలం ఆయన నివాసంలో మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్సేతర విపక్షాలు మిషన్ 2024కు సిద్ధమవుతున్నాయని వాదనలు వచ్చాయని, అవన్నీ అవాస్తవాలని తెలిపారు. కాంగ్రెస్‌ను ఆహ్వానించలేదన్నదీ అబద్ధమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు మీనశ్ తివారీ, కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, శత్రుజ్ఞ సిన్హాలను ఆహ్వానించామని, కానీ, వారు హాజరవ్వలేదని అన్నారు. యశ్వంత్ సిన్హా 2018లో స్థాపించిన రాష్ట్రీయ మంచ్ ఈ సమావేశాన్ని నిర్వహించిందని వివరించారు. దేశ ప్రయోజనాలను కాంక్షించే ప్రతి ఒక్కరూ ఇందులో భాగమవ్వచ్చని పేర్కొన్నారు.