లాయర్ల హత్య కేసు.. ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు

దిశ, తెలంగాణ బ్యూరో : న్యాయవాదుల జంట హత్యలను సుమోటోగా తీసుకున్న హైకోర్టు ప్రభుత్వానికి, పోలీసు శాఖకు నోటీసులు జారీ చేసింది. నిర్దిష్ట కాలపరిమితిలోగా కేసు దర్యాప్తు పూర్తికావాలని, సంఘటనా స్థలంలోని అన్ని ఆధారాలనూ పకడ్బందీగా సేకరించి భద్రపర్చాలని ఆదేశించింది. న్యాయవాదుల హత్య దిగ్భ్రాంతి కలిగించిందని, ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఈ హత్యలు జరిగాయని చీఫ్ జస్టిస్ హిమ కోహ్లి నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ఈ కేసు దర్యాప్తులో వ్యవహరించాలని స్పష్టం […]

Update: 2021-02-18 11:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : న్యాయవాదుల జంట హత్యలను సుమోటోగా తీసుకున్న హైకోర్టు ప్రభుత్వానికి, పోలీసు శాఖకు నోటీసులు జారీ చేసింది. నిర్దిష్ట కాలపరిమితిలోగా కేసు దర్యాప్తు పూర్తికావాలని, సంఘటనా స్థలంలోని అన్ని ఆధారాలనూ పకడ్బందీగా సేకరించి భద్రపర్చాలని ఆదేశించింది. న్యాయవాదుల హత్య దిగ్భ్రాంతి కలిగించిందని, ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఈ హత్యలు జరిగాయని చీఫ్ జస్టిస్ హిమ కోహ్లి నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ఈ కేసు దర్యాప్తులో వ్యవహరించాలని స్పష్టం చేసింది.

హత్య కేసులో నిందితులను పట్టుకోవడమే కాకుండా మార్చి ఒకటి కల్లా స్పష్టమైన నివేదికను కోర్టుకు సమర్పించాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. హత్య జరిగిన వెంటనే పోలీసు శాఖ అప్రమత్తమైందని, హంతకులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ వివరించారు. నడి రోడ్డుపై పట్టపగలు ఈ సంఘటన జరగడం గర్హనీయమని, ఇప్పుడు ప్రజలంతా ప్రభుత్వంవైపే చూస్తున్నారని బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వంమీద, న్యాయవ్యవస్థమీద నమ్మకం కలగాలంటే తప్పనిసరిగా ఈ కేసులో అన్ని ఆధారాలనూ సేకరించాలని స్పష్టం చేసింది. హత్య జరిగిన సమయంలో రెండు ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయని, ప్రయాణికులను గుర్తించి వారిని కూడా సాక్షులుగా పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్ వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో కొన్ని క్లిప్పులు ప్రసారమవుతున్నాయని, వాటిని వెరిఫై చేసి అవసరమైతే వాటిని కూడా సాక్ష్యాలుగా భద్రపరచాలని పేర్కొంది.

గూండా రాజ్‌ని తలపిస్తోంది

న్యాయవాదులను అతి భయానకంగా హత్య చేయడాన్ని చూస్తే వెనకటి గూండారాజ్ పరిస్థితికి వెళ్తున్న అభిప్రాయం కలుగుతోందని భారత బార్ కౌన్సిల్ వ్యాఖ్యానించింది. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి లిఖితపూర్వక విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న భారత బార్ కౌన్సిల్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లికి లేఖ రాసింది. రాష్ట్ర పోలీసు వ్యవస్థ నిష్పాక్షికంగా, స్వతంత్ర దర్యాప్తు చేస్తుందనే నమ్మకం లేదని, జ్యుడిషియల్ విచారణ జరిపించాల్సిందిగా హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరాలని కౌన్సిల్ తీర్మానం చేసిందని ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించడంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు మిశ్రా పేర్కొన్నారు. సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా డీజీపీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసు జారీ చేసింది.

Tags:    

Similar News