విద్యార్థుల‌తో వెట్టి చాకిరి.. ఐన‌వోలు బీసీ గురుకులంలో దారుణం (వీడియో)

కుటుంబానికి దూరంగా ఎక్కడో దూరంగా హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులను సొంత బిడ్డలా చూడాల్సిన వార్డెన్ వారితో వెట్టి చాకిరి చేయిస్తూ.. వారి బాల్యాన్ని హరిస్తున్నారు.

Update: 2023-04-10 14:59 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: కుటుంబానికి దూరంగా ఎక్కడో దూరంగా హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులను సొంత బిడ్డలా చూడాల్సిన వార్డెన్ వారితో వెట్టి చాకిరి చేయిస్తూ.. వారి బాల్యాన్ని హరిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు వారు.. ఆటలపాటలతో చదువుకుంటూ కాలం గడిపేవారు. ఎలాంటి భారాలు లేకుండా గడిచిపోయే బాల్యం వారిది. అటు వంటి చిన్నారులతో హస్టల్‌ అధికారులు మోయలేని భారాలు మోపిస్తున్నారు. చిన్నపిల్లలు అని చూడకుండా ఐన‌వోలు జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్‌ బాలుర గురుకులం విద్యార్థుల‌ను ఉపాధ్యాయులు ప‌ని మ‌నుషులుగా మార్చేశారు. ఒకరోజు కాదు రెండు రోజులుగా నెల‌లుగా సాగుతున్నట్లుగా విద్యార్థుల ద్వారా దిశకు తెలిసింది. హాస్టల్‌లో చేయ‌రాని, చేయ‌కూడ‌ని ఎన్నో ప‌నుల‌ను విద్యార్థుల చేత చేయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు దిశ‌కు చిక్కాయి.

వండేది విద్యార్థులే.. ఊడ్చేది విద్యార్థులే..!

ఐన‌వోలు మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలుర గురుకులంలో దారుణ సంఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. వరంగల్ జిల్లా వ‌ర్ధన్నపేట మండ‌లంలోని ఉప్పరపల్లి క్రాస్ వద్ద ఐన‌వోలు మండ‌ల జ్యోతి బాఫూలే బాలుర గురుకులం కొన‌సాగుతోంది. నిర్వహ‌ణ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకు విద్యార్థుల చేత వెట్టి చాకిరి చేయిస్తున్నట్లు వార్డెన్ శ్వేత, వైస్ ప్రిన్సిపల్ అశోక్‌లు వెట్టి చాకిరీ చేస్తున్నట్లు ఆరోప‌ణ‌లున్నాయి. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి రావ‌డంతో వీరి అన్యాయం బ‌య‌ట‌కు వ‌చ్చింది. విద్యార్థులతో కిచెన్ క్లీనింగ్, పూరీ తయారీతో పాటు, వివిధ పనులు చేయిస్తున్న దృశ్యాలు వీడియోల్లో స్పష్టంగా క‌నిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. గ‌దులను శుభ్రం చేయ‌డం, గిన్నెలు తోమ‌టం లాంటి ప‌నుల‌న్నీ కూడా విద్యార్థుల‌చేత చేయిస్తుండ‌టం గ‌మ‌నార్హం. కూర‌గాయ‌లు క‌ట్ చేయ‌డం, వంట చేయ‌డం, అత్యంత ప్రమాద‌క‌రంగా వేడి వేడి గంజుల‌ను సైతం విద్యార్థులచేత దించేలా చేస్తున్నారు. స్కూల్ పిల్లలతో తమ సొంత కారు, బైకులను సైతం కడిగిపిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి.

విద్యార్థుల సంఖ్య త‌క్కువేనా..?

గురుకుల పాఠ‌శాల విద్యార్థుల సంఖ్య రికార్డుల ప్రకారం 560 అని తెలుస్తుండ‌గా, గురుకులంలో ఉండేది మాత్రం అందులో సగం కంటే మించ‌ర‌ని స‌మాచారం. విద్యార్థుల సంఖ్యను ఎక్కువ‌గా చూపుతూ బిల్లులు భోంచేస్తున్నట్లుగా అత్యంత విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. హాస్టల్‌లో జ‌రుగుతున్న అక్రమాల‌పై స‌ద‌రు శాఖ ఉన్నతాధికారుల‌కు స‌మాచారం ఉన్నప్పటికీ చ‌ర్యలు తీసుకోవ‌డం లేద‌ని ఆ శాఖ ఉద్యోగుల నుంచి తెలుస్తుండ‌టం గ‌మనార్హం.

అవును ఆ వీడియో మా గురుకులానిదే: రాజేంద్రాచారి, ప్రిన్సిప‌ల్‌, ఐన‌వోలు బీసీ వెల్ఫేర్ గురుకులం

అవును ఆ వీడియోలో ఉన్నది నిజ‌మే. ప‌ని చేస్తున్నది మా హాస్టల్ విద్యార్థులే. స్పెషల్ మెను ఇచ్చేట‌ప్పుడు ఇలాంటి ప‌నులు విద్యార్థుల‌కు చెబుతుంటాం. హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్నందున, వారంద‌రికీ స‌మ‌యానికి భోజ‌నం, టిఫిన్లు అందించ‌డానికి కొన్ని సంద‌ర్భాల్లో ఇలా చేస్తుంటాం.

వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://youtube.com/shorts/uuZZoPLJFYU

Tags:    

Similar News