టీకా వేసుకునేందుకు డెడ్‌లైన్..!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బందికి ఇప్పటికే టీకాల పంపిణీ కార్యక్రమం పూర్తికాగా ప్రస్తుతం తీసుకుంటున్న ప్రైవేటు వైద్య సిబ్బందికి ఈ నెల ఐదో తేదీతో పూర్తికానుంది. ఆ తర్వాత హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బంది దాదాపు 65 శాతం మంది టీకాలు తీసుకోగా ప్రైవేటులో మాత్రం సగం మందే […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బందికి ఇప్పటికే టీకాల పంపిణీ కార్యక్రమం పూర్తికాగా ప్రస్తుతం తీసుకుంటున్న ప్రైవేటు వైద్య సిబ్బందికి ఈ నెల ఐదో తేదీతో పూర్తికానుంది. ఆ తర్వాత హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బంది దాదాపు 65 శాతం మంది టీకాలు తీసుకోగా ప్రైవేటులో మాత్రం సగం మందే తీసుకున్నారని తెలిపారు. మొత్తం 3,25,771 మంది ప్రైవేటు హెల్త్ కేర్ సిబ్బంది ఉంటే, అందులో మంగళవారం సాయంత్రం వరకు 1,65,880 మంది తీసుకున్నారని, మిగిలినవారి కోసం శుక్రవారం వరకు గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత ఇచ్చే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా పోలీసు, రెవెన్యూ, పారిశుధ్య సిబ్బంది లాంటి ఫ్రంట్ లైన్ వారియర్లకు ఈ నెల ఆరో తేదీ నుంచి టీకాల పంపిణీని ప్రారంభించాలనుకుంటున్నామని, ‘కొవిన్’లో సమస్యలు వస్తే ఈ నెల ఎనిమిది నుంచి ప్రారంచనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో వారి సంఖ్య సుమారు 1.87 లక్షలు ఉండొచ్చని, ఇందులో కనీసం పది శాతం మంది వివిధ అనారోగ్య కారణాలతో టీకాలు తీసుకోకపోవచ్చని వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. వీరికి కేవలం పది రోజుల వ్యవధిలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే హెల్త్ కేర్ సిబ్బందికి రెండో డోస్ పంపిణీ మొదలవుతుందని డైరెక్టర్ వివరించారు. అది కూడా దాదాపు ఒకటిన్నర, రెండు నెలల సమయం పట్టొచ్చని, మొదటి డోసు తీసుకున్నవారందరికీ తప్పకుండా రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుందని, లేదంటే వ్యాక్సిన్ ప్రయోజనం ఉండదని తెలిపారు.
ఎనిమిదికి చేరిన బ్రిటన్ స్ట్రెయిన్ కేసులు
రాష్ట్రంలో బ్రిటన్ రకం కరోనా వైరస్ బారినపడినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. నవంబరు నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి బ్రిటన్ నుంచి 5,361 మంది ప్రయాణికులు వచ్చారని, ఇందులో 44 మందికి పాజిటివ్ ఉన్నట్లు గుర్తించామని, వీరిలో ఎనిమిది మందికి మాత్రమే బ్రిటన్ స్ట్రెయిన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. బ్రిటన్ స్ట్రెయిన్ వచ్చిన కొత్తలో డిసెంబరు నెలలో ఇద్దరు దీని బారిన పడినట్లు నిర్ధారణ అయిందని, ఆ తర్వాత జనవరి 10వ తేదీన ఇద్దరు, జనరి 16న ముగ్గురు, జనవరి 29న ఒకరు చొప్పున బ్రిటన్ స్ట్రెయిన్ పాజిటివ్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఐదుగురు ఇప్పటికే చికిత్స పొంది క్షేమంగా ఇండ్లకు చేరుకోగా మరో ముగ్గురు ప్రస్తుతం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.