గెట్టు పంచాయితీ.. ఆ భూములతో లడాయి

కరోనా ప్రభావం సమాజంపై తీవ్రంగా పడుతోంది. వృత్తులు, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పరిశ్రమల్లో ఉత్పాదక శక్తి తగ్గింది. ఆఖరికి రైతుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. నగరాలు, పట్టణాల నుంచి ఏండ్ల తర్వాత సాగు చేసేందుకు ఊళ్లకు వెళ్లిన ఆసాములకు ముచ్చెమటలు పడుతున్నాయి. సరిహద్దు వివాదాలు చెలరేగుతున్నాయి. వీరెలాగు లేరు కదా అని పక్కనున్న భూముల పట్టాదారులు హద్దులను కలిపేసుకున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. బాట కొరకూ పంచాయితీలు తప్పడం లేదు. దిశ, న్యూస్ బ్యూరో: కరోనాతో ఉపాధి కోల్పోయిన […]

Update: 2020-08-06 20:27 GMT

కరోనా ప్రభావం సమాజంపై తీవ్రంగా పడుతోంది. వృత్తులు, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పరిశ్రమల్లో ఉత్పాదక శక్తి తగ్గింది. ఆఖరికి రైతుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. నగరాలు, పట్టణాల నుంచి ఏండ్ల తర్వాత సాగు చేసేందుకు ఊళ్లకు వెళ్లిన ఆసాములకు ముచ్చెమటలు పడుతున్నాయి. సరిహద్దు వివాదాలు చెలరేగుతున్నాయి. వీరెలాగు లేరు కదా అని పక్కనున్న భూముల పట్టాదారులు హద్దులను కలిపేసుకున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. బాట కొరకూ పంచాయితీలు తప్పడం లేదు.

దిశ, న్యూస్ బ్యూరో: కరోనాతో ఉపాధి కోల్పోయిన అనేక కుటుంబాలు పల్లె బాట పట్టాయి. అక్కడ అరకొరగా ఉన్న భూముల సాగుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో భూ తగాదాలు వారిని భయకంపితులను చేస్తున్నాయి. సరిహద్దు వివాదాలు తిప్పలు పెడుతున్నాయి. ప్రతి ఊరిలోనూ ఈ పంచాయితీలు నడుస్తున్నాయి. భూముల ధరలు విఫరీతంగా పెరగడం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఎకరా భూమి రూ.10 లక్షల నుంచి రూ.కోట్ల వరకు పలుకుతోంది. గజం కూడా వదులుకునేందుకు ఎవరూ సిద్ధపడడం లేదు. వివాదాల పరిష్కారానికి దరఖాస్తు చేసుకున్నా మోక్షం లభించడం లేదు. ల్యాండ్ సర్వే డిపార్టుమెంటు దగ్గర ఫైళ్లు పేరుకుపోతున్నాయి. ఏకంగా కమిషనర్ కు దరఖాస్తు పెట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అక్కడి నుంచి ఆర్డీకి, ఆర్డీ నుంచి ఏడీకి, ఏడీ నుంచి మండల సర్వేయర్‌కు దస్త్రాలు మారుతున్నాయి. కరోనా కాలంలో భూమిని కొలిచే పనుల వేగం తగ్గింది. దరఖాస్తు చేసుకున్న నెలల తర్వాత కానీ, సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఎడతెగని జాప్యం కారణంగా సరిహద్దు వివాదాలు మరింతగా ముదిరిపోతున్నాయి. ఖరీదైన భూములు ఉన్న ప్రాంతాల్లో పని చేసే రెవెన్యూ యంత్రాంగంపై ఏసీబీ గురి పెట్టిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు తహశీల్దార్ల వ్యవహార శైలితో రెవెన్యూ యంత్రాంగానికి ముప్పు వాటిల్లింది. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ పట్టణ ప్రాంతాలకు దగ్గరలోని గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. ప్రతి రోజు ప్రతి గ్రామంలో ఏదో ఓ చోట భూమికి సంబంధించిన వివాదంపై చర్చ జరుగుతోంది. పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడడం, అధికారులకు ఫిర్యాదులు చేయడం పరిపాటిగా మారింది.

కొన్నవారికైతే అతిపెద్ద సమస్య

పట్నంలో ఉంటూ పల్లెల్లోని భూములను కొనుగోలు చేసిన వారికైతే సమస్యలు జటిలంగా మారుతున్నాయి. ఎకరం నుంచి పదెకరాల వరకు కొనుగోలు చేసిన వారి సంఖ్య లక్షల్లోనే ఉంది. ఇన్నాళ్లుగా వారి సొంత వ్యాపారాలు, ఉద్యోగాలపై శ్రద్ధ పెట్టారు. కరోనా వ్యాప్తితో బిజినెస్ దివాళా తీసింది. కొన్న భూమిని దున్నిద్దామన్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. కొన్నప్పటి పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు. దారి, సరిహద్దు సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఎకరం భూమి కొనుగోలు చేసినా పట్టా పాసు పుస్తకంలో నాలుగైదు సర్వే నంబర్లు కనిపిస్తు న్నాయి. ఎకరం భూమి లెక్క తేల్చాలంటే ఆ సర్వే నంబర్లన్నీ కొలవాల్సిందే. చాలా ఏండ్లుగా ల్యాండ్ సర్వే ప్రక్రియ చేపట్టకపోవడంతో బై నంబర్లతో అమ్మకాలు పెద్ద ఎత్తున సాగాయి. 100 ఎకరాల సర్వే నంబరు.. ఇప్పుడు గుంటల్లోకి మారింది. దాన్ని బట్టి ఎన్ని బై నంబర్లు చోటు చేసుకున్నాయో అంచనా వేయొచ్చు.

మీకేంది? అంత ఉంది కదా?

సంపన్నవర్గానికి చెందిన మహబూబ్ నగర్ జిల్లావాసి ఒకరు చాలా ఏండ్లుగా జూబ్లీహిల్స్ లో ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయ కేంద్రం, సేంద్రియ వ్యవసాయ విధానంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కరోనా నేపధ్యంలో ఎక్కడికీ వెళ్లేందుకు అవకాశం లేకుండాపోయింది. దాంతో ఊర్లో వ్యవసాయం చేయించాలనుకున్నారు. అప్పటి దాకా పడావు పెట్టిన భూములను ఇరుగుపొరుగు ఆక్రమించుకున్నారు. ఇదేం పద్ధతిని అడిగితే, మాదేనని కొందరు, మీకు అంత భూమి ఉంది. ఏం చేసుకుంటారని ఇంకొందరు దబాయిస్తున్నారు. ఏం చేయాలో తెలియక అయోమయానికి ఆయన గురవుతున్నారు. రెండు నెలలుగా ఊరి చుట్టూ తిరుగుతునే ఉన్నారు. పరిష్కారం మాత్రం దొరకలేదు.

ఓవర్ ల్యాపింగ్

కడ్తాల, ముచ్చర్ల గ్రామాల మధ్య భూమి ఓవర్ ల్యాపింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. గతంలో మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుగా కడ్తాల, రంగారెడ్డి జిల్లాకు సరిహద్దుగా కందుకూరు మండలం ముచ్చర్ల ఉండేది. ప్రస్తుతం రెండు గ్రామాలూ రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చాయి. జిల్లా సరిహద్దు కావడంతో భూముల గెట్టు పంచాయతీలు తీవ్రంగా వేధిస్తున్నాయి. కడ్తాల రెవెన్యూ సర్వే నం.260, ముచ్చర్ల రెవెన్యూ సర్వే నం.288లో రెండు వేల ఎకరాలకు పైగా ఉన్నాయి. ఇందులో గైరాన్, పట్టా భూములు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది నగరం నుంచి ఊర్లకు వెళ్లి వ్యవసాయం మొదలుపెట్టగానే వివాదాలు షురువయ్యాయి. ముచ్చర్ల ఫార్మా సిటీ భూ సేకరణ సమయంలోనే 900 ఎకరాల వరకు ఓవర్ ల్యాప్ అయినట్లు గుర్తించారు. ప్రభుత్వ భూమి కూడా ఉండడంతో అసైన్డ్, పట్టాదారులకు పెద్ద సమస్య తలెత్తలేదు. ఇప్పుడు పట్టాదారులకు మధ్య వివాదాలు తలెత్తుండడంతో కంటి మీద కునుకు లేకుండాపోతోంది. కడ్తాల నుంచి వారి సర్వే నంబర్లు కొలిస్తే ముచ్చర్ల రెవెన్యూలోకి, ముచ్చర్ల సర్వే నంబర్లు కొలిస్తే కడ్తాల రెవెన్యూ పరిధిలోకి వస్తున్నాయి. ఈ ఓవర్ ల్యాపింగ్ తో పట్టాదారుల మధ్య శతృత్వం పెరుగుతోంది.

నాదంటే నాదే..

కడ్తాల సర్వే నం.92, ముచ్చర్ల సర్వే నం.352 ల్లో వందల ఎకరాల కొద్దీ భూములు పక్కపక్కనే ఉన్నాయి. ఇన్నేండ్లుగా ఒకరి భూమిలో నుంచి మరొకరు నడిచేవాళ్లు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు చేసుకున్నారు. పట్టాదారులు పెరిగారు. క్రయ విక్రయాలు పెద్ద ఎత్తున నడిచాయి. ఎవరి భూమిలో వాళ్లు వ్యవసాయం చేసుకుందామనుకుంటే గెట్టు పంచాయితీలు తలెత్తుతున్నాయి. కడ్తాల సర్వే నం.92 పట్టాదారులంతా ముచ్చర్ల పట్టాదార్లకు బాట విడిచేదే లేదంటూ గొడవకు దిగుతున్నారు. ముచ్చర్ల రైతులకు దారి సమస్య జటిలంగా మారింది. అమ్మేద్దామన్నా ఎవరూ కొనే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ముచ్చర్ల సర్వే నం.352 లో 12 ఎకరాలకు నగరానికి చెందిన ఒకరు కొనుగోలు చేశారు. పనులేమీ లేకపోవడంతో ఫెన్సింగ్ కోసం ప్రయత్నించాడు. కొనుగోలు చేసేటప్పుడు కడ్తాల భూముల నుంచి దారి ఉన్నట్లుగా చూపారు. అప్పటి దాకా వారి నడిచిన బాటనే అది. ఇతరులెవరో కొనుగోలు చేస్తే బాట మేమెందుకు వదులుతామని గొడవ పడుతున్నారు.

పాలోళ్లకైతే ఓకే..

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడెంలోనూ బాట సమస్య తలెత్తింది. 100 ఎకరాల ఆసామి నుంచి అనువంశికంగా ఇద్దరు కొడుకులు పంచుకున్నారు. వాళ్ల నుంచి వారి సంతానం పంచుకున్నారు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం వల్ల ఒకరి పొలం నుంచి మరొకరు నడిచేవాళ్లు. ఎలాంటి ఇబ్బంది రాలేదు. తాజాగా ఇందులో ఒకరు తన భూమిని అదే గ్రామానికి చెందిన వేరే వాళ్లకు విక్రయించారు. వాళ్లు కొందరు కలిసి ఆ భూమిని కొన్నారు. కరోనా సమయంలో భూమ్మీదికి వెళ్లగా బాటను బంద్ చేశారు. చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు. దాంతో మధ్యంలో ఉన్న భూమికి వెళ్లేందుకు మార్గమే లేదు. ఇన్నాండ్లుగా ఉన్న బాటను మూసేయడమేంటని ప్రశ్నిస్తే నక్షలో ఉందా అంటూ నిలదీస్తున్నారు. వాళ్లంతా మా పాలోళ్లు.. కనుక అడ్జస్ట్ అయ్యాం.. ఇప్పుడు మీకు బాట ఇవ్వాలంటే ఎకరం స్థలం పోతుంది.. మేం ఎందుకు వదులుకుంటామంటున్నారు. అసలే పెరిగిన భూముల ధరలతో బాట కోసమే మరో ఎకరం కొనాలంటే రూ.లక్షలు పోయాలి. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో రూ.50 లక్షల వరకు పలుకుతోంది.

Tags:    

Similar News