MROలకే సర్వాధికారాలు..!

దిశ, న్యూస్‌బ్యూరో: ఇన్నాండ్లుగా రెవెన్యూ శాఖలో అత్యంత అవినీతిపరులుగా వీఆర్వోలు.. తర్వాతి స్థానంలో తహశీల్దార్లుగా చెప్పుకున్నారు. ఐతే తెలంగాణ ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థనే పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. కానీ తర్వాతి వరుసలోనున్న తహశీల్దార్లకు మాత్రం పెద్ద పీట వేస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించినట్లు తెలిసింది. మండల స్థాయిలో వ్యవసాయ భూములకు బిగ్ బాస్ ‘తహశీల్దార్’. ప్రతి అంశంలోనూ ఆయనదే తుది నిర్ణయంగా చేయనుంది. ఏదైనా భూమి కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ, పట్టా మార్పిడి […]

Update: 2020-09-08 20:41 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ఇన్నాండ్లుగా రెవెన్యూ శాఖలో అత్యంత అవినీతిపరులుగా వీఆర్వోలు.. తర్వాతి స్థానంలో తహశీల్దార్లుగా చెప్పుకున్నారు. ఐతే తెలంగాణ ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థనే పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. కానీ తర్వాతి వరుసలోనున్న తహశీల్దార్లకు మాత్రం పెద్ద పీట వేస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించినట్లు తెలిసింది. మండల స్థాయిలో వ్యవసాయ భూములకు బిగ్ బాస్ ‘తహశీల్దార్’. ప్రతి అంశంలోనూ ఆయనదే తుది నిర్ణయంగా చేయనుంది. ఏదైనా భూమి కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ, పట్టా మార్పిడి వంటి అన్ని అంశాలను తహశీల్దార్ చేతిలోనే పెట్టనుంది. ఎవరైనా భూమిని కొనేందుకు కార్యాలయానికి వచ్చి సంబంధిత డాక్యమెంటేషన్ పూర్తి చేసి ఫీజు చెల్లిస్తే చాలు.. వెంటనే సేల్ డీడ్ చేతిలో పెట్టేస్తారు.

అప్పటికప్పుడు కొనుగోలు చేసిన వ్యక్తికి పట్టాను తహశీల్దార్ సంతకం చేసి ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు లేకుండా పట్టా పాసు పుస్తకం వచ్చేస్తుంది. ఇందులో అభ్యంతరాలకు తావు లేదు. తుది నిర్ణయం కంప్యూటర్ లోని వివరాలతో తహశీల్దార్ తీసుకుంటారని తెలిసింది. ఎవరు కొనుగోలు చేసినా.. ఏ భూమి, ఎవరి ఆధీనంలోనిది అన్న విషయాలేవీ క్షేత్ర స్థాయిలో విచారణ ఉండదు. డాక్యుమెంటేషన్ పూర్తి కాగానే రెవెన్యూ లాగిన్ లోకి వెళ్తుంది. వెంటనే సదరు భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట మారిపోతుంది. ఇప్పటి దాకా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పొందిన సేల్ డీడ్ తో మ్యుటేషన్ కు దరఖాస్తు చేసుకునేవారు. స్థానికంగా వీఆర్వో నోటీసులు జారీ చేయడమో, స్వయంగా విచారణ చేసి ప్రాథమిక రిపోర్టు ఇవ్వడం ద్వారా మ్యుటేషన్ ప్రక్రియను చేపట్టేవారు. కొత్త రెవెన్యూ చట్టంలో అలాంటి విచారణలేవీ ఉండవు. ఎవరైనా కొనుగోలు చేస్తే తహశీల్దార్ నిర్ణయం ద్వారా సదరు భూముల హక్కులు మారిపోతాయి.

అప్పీలు లేదు.. రివిజన్ లేదు

మండల స్థాయిలో తహశీల్దార్ తీసుకున్న నిర్ణయం ద్వారా అన్యాయానికి గురైన వారు డివిజన్ స్థాయిలో ఆర్డీఓకు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉన్నది. అక్కడ కూడా అన్యాయమే జరిగిందని భావిస్తే జాయింట్ కలెక్టర్(ప్రస్తుతం అదనపు కలెక్టర్) దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు. పై రెండు స్థాయిల్లో విచారణ చేసి న్యాయం జరిగేటట్లు అవకాశం ఉండేవి. ఇప్పుడేమో తహశీల్దార్ తీసుకునే నిర్ణయం ఫైనల్. అన్యాయం జరిగిందని అనిపిస్తే కోర్టుకు వెళ్లాల్సిందే. దాంతో పేదలు ఇబ్బందులకు గురి కావాల్సిందేనని భూ రెవెన్యూ రికార్డుల నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టాదారుడు చనిపోతే వారి వారసులు తహశీల్దార్ దగ్గరికి నేరుగా డెత్ సర్టిఫికేట్, వారసత్వ ధృవీకరణ పత్రాలు, పాసు పుస్తకాలను తీసుకొస్తే చాలు. వెంటనే మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఐతే వారి వారసుల్లో ఎలాంటి చిక్కులున్నా.. అందరు వారసులు రాకపోయినా గుర్తించే వ్యవస్థ లేదు. ఇప్పుడైతే స్థానికంగా వీఆర్వో విచారణ, ఆర్ఐ పరిశీలన ఉండేది. భాగ పంపకాల కోసం తహశీల్దార్ దగ్గరికే రావాలి. సంబంధిత పార్టిషన్ డీడ్ సమర్పిస్తే వెంటనే మార్పిడి చేసి పట్టాలు జారీ చేయనున్నారు. తదుపరి ఫిర్యాదులకు కోర్టులను ఆశ్రయించడం మినహా మరో మార్గం ఉండదు.

ఎలాంటి నోటీసులు ఇచ్చేది లేదు. గ్రామీణ స్థాయిలో లేదా స్థానికంగా విచారణ చేసేదేం ఉండదు. సంబంధిత వ్యక్తులు అధికారిని సంప్రదిస్తే సరిపోతుంది. దీని ద్వారా హక్కుదారులెవరైనా హాజరు కాకుంటే గుర్తించడం కష్టమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ భూములేమో తహశీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంటి స్థలాలు, ప్లాట్లు, ఇండ్లు మాత్రం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నిర్వహించనున్నారు.

పాత కేసుల సంగతి..

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 15 వేల నుంచి 20 వేల వరకు భూ సంబంధ కేసులు ఉన్నాయి. ఇంకా నంబరు కూడా అలాట్ కాని కేసులు కూడా వేలల్లోనే ఉంటాయని ఓ ప్రొఫెసర్ చెప్పారు. వాటి ప్రస్తావనేదీ కొత్త రెవెన్యూ చట్టంలో పొందుపర్చలేదని తెలిసింది. వాటిని పరిష్కరించేందుకు మార్గమేదీ చట్టంలో సూచించలేదు. వాటి కోసమే ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తారేమోనని అధికారులు అంటున్నారు. పాత కేసుల సంగతి ఎటూ తేల్చకపోతే హక్కుల కోసం ఎవరిని సంప్రదించాలో అంతుచిక్కక తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

వీఆర్వోకు ప్రత్యామ్నాయం ఉండదట

ఇప్పటికే VRO వ్యవస్థ రద్దు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకున్నది. ఐతే వారి బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. కానీ వారి స్థానంలో గానీ, ప్రత్యామ్నాయ వ్యవస్థనేదీ రూపొందించడం లేదని సమాచారం. ఆర్వోఆర్ చట్టానికి కొత్త రూపునిచ్చేటప్పుడే వీఆర్వోల ప్రధాన విధులైన రికార్డులు రాయడం, నోటీసులు జారీ చేయడం, ప్రాథమిక రిపోర్టులు తయారు చేయడం వంటి వాటికే ఆస్కారమే లేదు. ఇక వారితో పనేం లేదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు ఓ అధికారి స్పష్టం చేశారు. నేడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టే తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టంతో పాటు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాంట్లో అధికారుల పేర్ల మార్పిడి, శాఖల పేర్ల మార్పు వంటివి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం అమలు తర్వాతే ఫలితాలపై ప్రభుత్వం అధ్యయనం చేయనుంది.

Tags:    

Similar News