బిగ్ బ్రేకింగ్.. కేసీఆర్ హామీ.. టీడీపీకి రమణ రాజీనామా
దిశ, తెలంగాణ బ్యూరో: టీడీపీకి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ రాజీనామా చేశారు. శుక్రవారం ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపినట్లు తెలిసింది. మూడు వాక్యాలతోనే లేఖను ముగించారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందుకే తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా […]
దిశ, తెలంగాణ బ్యూరో: టీడీపీకి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ రాజీనామా చేశారు. శుక్రవారం ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపినట్లు తెలిసింది. మూడు వాక్యాలతోనే లేఖను ముగించారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందుకే తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. గడిచిన 30 సంవత్సరాలుగా తన ఎదుగుదలకు తోడ్పాటునందించిన చంద్రబాబునాయుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రాజీనామాకు ముందు తన అనుచరగణంతో చర్చించారు ఎల్.రమణ. గురువారం కారెక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాయబారంతో కలిశారు. ప్రగతి భవన్‌లో గంట సేపు మంతనాలు జరిపారు. 12వ తేదీన గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. గులాబీ బాస్ నుంచి రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన హామీ లభించిందని సమాచారం. అందుకే నెల రోజుల సందిగ్ధతకు తెర తీశారు. ఎమ్మెల్సీతో పాటు కీలకమైన బాధ్యతలు అప్పగించనున్నట్లు ఎల్.రమణ అనుచరుల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం.
హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ 30 వేలకు పైగా ఉన్న పద్మశాలి సామాజిక వర్గం ఓట్లను రాబట్టేందుకు ఆయనను రంగంలోకి దింపనున్నారు. ఇప్పటికే ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధి బృందం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించింది. ప్రస్తుతానికి మెజార్టీ చేనేత వర్గీయులంతా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. ఈటల రాజేందర్ మీద అభిమానాన్ని కురిపిస్తున్నట్లు పర్యటనలో స్పష్టమైంది. ఇదే క్రమంలో ఓ మంత్రి కూడా నియోజకవర్గంలోని ఆ సామాజిక వర్గ పెద్దలను పిలిపించుకొని తానున్నానని హామీ ఇచ్చినా పెద్దగా మార్పు కనిపించలేదు. ఈ క్రమంలోనే ఎల్.రమణను హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రత్యక్ష్యంగా ప్రచార బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.