అప్పే గొప్పా..
దిశ, న్యూస్ బ్యూరో : ఒక ప్రైవేటు కంపెనీ కంటే ఒక ప్రభుత్వ కార్పొరేషన్‌కు అప్పు ఇచ్చేందుకే బ్యాంకులు, రుణ సంస్థలు వేగంగా ముందుకొస్తాయి. వడ్డీ ఎక్కువిస్తామన్నా సరే.. ప్రైవేటు కంపెనీని పక్కనబెట్టి మరీ ప్రభుత్వ కంపెనీకి రుణాలు వెల్లువెత్తుతాయి. అదే నేరుగా ఒక ప్రభుత్వానికైతే బ్యాంకులు, రుణ సంస్థలు ఎంతంటే అంత రుణాలివ్వడానికి రెడీ అవుతాయి. దీనంతటికీ కారణం.. ఏ ప్రభుత్వానికైనా ప్రజలు పన్నుల రూపంలో కట్టే ఆదాయం ఖజానాకు వచ్చిపడుతుందని, ఆ నిధుల్లో నుంచి […]
దిశ, న్యూస్ బ్యూరో : ఒక ప్రైవేటు కంపెనీ కంటే ఒక ప్రభుత్వ కార్పొరేషన్‌కు అప్పు ఇచ్చేందుకే బ్యాంకులు, రుణ సంస్థలు వేగంగా ముందుకొస్తాయి. వడ్డీ ఎక్కువిస్తామన్నా సరే.. ప్రైవేటు కంపెనీని పక్కనబెట్టి మరీ ప్రభుత్వ కంపెనీకి రుణాలు వెల్లువెత్తుతాయి. అదే నేరుగా ఒక ప్రభుత్వానికైతే బ్యాంకులు, రుణ సంస్థలు ఎంతంటే అంత రుణాలివ్వడానికి రెడీ అవుతాయి. దీనంతటికీ కారణం.. ఏ ప్రభుత్వానికైనా ప్రజలు పన్నుల రూపంలో కట్టే ఆదాయం ఖజానాకు వచ్చిపడుతుందని, ఆ నిధుల్లో నుంచి తీసుకున్న అప్పునకు వడ్డీ, అసలు తిరిగి పే చేయడం పెద్ద పని కాదని రుణాలిచ్చేవారి నమ్మకం. ఇక ఆ ప్రభుత్వాల్లోనూ మన హైదరాబాద్ లాంటి మహానగరాలు రాజధానులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకైతే అప్పులు కాస్త తక్కువ వడ్డీ రేటుకే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంటాయి. తమ అసలు, వడ్డీ గ్యారంటీగా తిరిగొస్తుందనే నమ్మకంతో కంపెనీలు, బ్యాంకులు, రుణ సంస్థలు పోటీపడి మరీ రుణాలిస్తుంటాయి.
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు అప్పుల్లో భాగంగా సోమవారం తెలంగాణ ప్రభుత్వం రూ.2,000 కోట్ల బాండ్లు జారీ చేసి అప్పు చేసింది. స్టేట్ డెవలప్‌మెంట్ లోన్లు(ఎస్డీఎల్) పేరుతో చేసే ఈ అప్పులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సమీకరించి పెడుతుంది. ఇందుకోసం ఆర్బీఐ ఆయా ప్రభుత్వాల బాండ్ల వేలం నిర్వహిస్తుంది. ఈ బాండ్ల వేలం మొదట ఆర్బీఐ తాజా మానిటరీ పాలసీలో నిర్ణయించిన రెపో రేటు దగ్గర ప్రారంభమై బిడ్డర్ల మధ్య పోటీని, అప్పు తీసుకునే వారి భవిష్యత్ ఆర్థిక పరిస్థితిని బట్టి తొలుత ప్రారంభమైన దానికంటే కాస్త ఎక్కువ వడ్డీ రేటు దగ్గర ముగుస్తుంది. పోటీ పెద్దగా లేకపోతే మాత్రం.. ఉన్న కొద్ది మందే ఎక్కువ వడ్డీ రేటు డిమాండ్ చేయడం వల్ల రెపో రేటు నుంచి వడ్డీ రేటు మరీ దూరంగా వెళ్లే అవకాశముంటుంది. ఇదే రకమైన వేలాన్ని సోమవారం రాష్ట్రాల కోసం ఆర్బీఐ నిర్వహించింది. ఈ వేలంలో సహజంగానే మెట్రో నగరాలు రాజధానులుగా కలిగిన తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల బాండ్లకు తక్కువ వడ్డీ రేటుకు ఎక్కువ బిడ్లు వచ్చాయి. ఇందులో తెలంగాణ రూ.1,000 కోట్లను 8 సంవత్సరాల కాలానికి, మరో రూ.1,000 కోట్లను 10 సంవత్సరాల కాలానికి వరుసగా 7.5, 7.6 శాతం వడ్డీ రేట్లకు అంటే వాడుక భాషలో చెప్పాలంటే 65 పైసల కంటే తక్కువకు అప్పు తీసుకోగలిగింది. ఎక్కువ మంది బిడ్డర్లు ఈ బాండ్ల కోసం పోటీ పడటం వల్లే వడ్డీ రేట్లు తగ్గినట్టు ఆర్బీఐ వెల్లడించిన గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ విషయంలో క్రెడిట్ అంతా తెలంగాణ ప్రభుత్వానికి కామధేనువుగా ఆదాయమిచ్చే హైదరాబాద్ నగరానికే దక్కుతుంది తప్ప ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నగర అభివృద్ధిపై ఎలాంటి ప్రత్యేక దృష్టి పెట్టని అధికార పార్టీకి దక్కదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Telangana’s brand image come to the fore; the state’s bond offering received overwhelming response 👍 pic.twitter.com/EmJsUQK7NF
— KTR (@KTRTRS) April 14, 2020
ఇక్కడివరకు బాగానే ఉంది.. ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం సాధారణంగా జరిగే ఈ తంతును దేశంలో లాక్‌డౌన్ నడుస్తున్నందున న్యూస్ పేపర్లు తమ కవరేజీలో భాగంగా ప్రత్యేకంగా రిపోర్టు చేశాయి. దీని మీద అసలు ఆర్థిక శాఖకే సంబంధం లేని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ రెస్పాండయ్యారు. ఆ న్యూస్ పేపర్ల క్లిప్పింగులను జత చేసి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ వల్లే ఇది సాధ్యమైందని ట్వీట్ చేశారు. ఇదే అంశం ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెట్టుబడులు తేవడానికి కాకుండా కేవలం అప్పులు తెచ్చేందుకే పనికొస్తుందా అని విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఈ డబ్బులు కనీసం రాష్ట్ర ఉద్యోగులకు వచ్చే మే నెలలో సగం జీతాలివ్వడానికి పనికొస్తాయని ఆ పేపర్లు రాస్తే అదేదో గర్వించదగ్గ విషయమన్నట్టుగా బ్రాండ్ ఇమేజ్ అని మాట్లాడడం కేటీఆర్ రాజకీయ అపరిపక్వతను తెలియజేస్తోందని ప్రతిపక్షాలంటున్నాయి. అదే బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాండ్లకు బిడ్డర్ల నుంచి పెద్దగా పోటీ రాలేదు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ జతచేసిన క్లిప్పింగుల్లోనూ విలేకరులు మెన్షన్ చేశారు. దీన్ని గమనించకుండా ఏది పడితే అది ట్వీట్ చేస్తూ పక్క రాష్ట్రాలతో సంబంధాలను దెబ్బతీసేలా కేటీఆర్ ప్రవర్తించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాగా, బుధవారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సమావేశమైన అఖిలపక్షం సైతం ఈ బాండ్ల వేలం అంశంపై చర్చించింది. ఈ వేలం ద్వారా తెచ్చిన నిధులను ఏం చేయబోతున్నారో ప్రభుత్వం క్లియర్‌గా చెప్పాలని డిమాండ్ చేసింది.
Tags : telangana, state debts, rbi, bonds, ktr tweets