ఏపీకి కృష్ణా బోర్డు ‘జల’క్
దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా జలాల తరలింపులో ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు షాకిచ్చింది. కేటాయించిన కోటా కంటే ఎక్కువగా విడుదల చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం సాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బోర్డు రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయా రిజర్వాయర్ల నుంచి ఎక్కువగా నీటిని విడుదల చేసుకుంటున్నారని బోర్డు ఏపీ వైఖరిని తప్పు పట్టింది. సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి […]
దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా జలాల తరలింపులో ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు షాకిచ్చింది. కేటాయించిన కోటా కంటే ఎక్కువగా విడుదల చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం సాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బోర్డు రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయా రిజర్వాయర్ల నుంచి ఎక్కువగా నీటిని విడుదల చేసుకుంటున్నారని బోర్డు ఏపీ వైఖరిని తప్పు పట్టింది. సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ మంగళవారం లేఖను పంపింది. అంతేకాకుండా మరో రెండు టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ సర్కార్ లేఖ రాయడాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుతం డ్రా చేసుకుంటున్న నీటిని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)కు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం లేఖ రాశారు. మే నెలాఖరు వరకు చేసిన కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వాడుకున్నారని లేఖలో పేర్కొన్నారు. నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను విధిగా పాటించాలని, ఉత్తర్వులను నిర్లక్ష్యం చేయరాదని స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని హెచ్చరించారు.
ఎక్కువగా తరలిస్తున్నారు
కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాడుకుంటున్నారని ఏపీ ప్రభుత్వాన్ని బోర్డు లేఖలో నిలదీసింది. ఏపీకి సాగర్ కుడికాల్వ ద్వారా 158.255 టీఎంసీల నీటిని కేటాయించామని, కానీ ఇప్పటివరకే 158.264 టీఎంసీల నీటిని వాడుకున్నారని లేఖలో పేర్కొంది. హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 47.173 టీఎంసీల నీటిని కేటాయించామని, కానీ ఏపీ ప్రభుత్వం మంగళవారం నాటికి 48.328 టీఎంసీలను వినియోగించుకున్నారని వెల్లడించింది. తాగునీటి అవసరాల కోసం పరిస్థితులకు అనుగుణంగా నీటిని వినియోగించుకోవాల్సి వస్తుందని, దీన్ని పాటించాలని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వానికి చురకలంటించింది. ఇప్పటికే కేటాయింపులకు మించిన కృష్ణా జలాలను వాడుకున్నారని, ఇంకా కాల్వల ద్వారా నీటి విడుదల చేసుకుంటున్నారని, వెంటనే నీటి విడుదల నిలిపివేయాలని బోర్డు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.
ఈ యేడు కేటాయించిన నీటి వాటాల్లో ఏపీ 4.042 టీఎంసీలను ఎక్కువగా వాడుకుందని లెక్క తేల్చారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ లేఖలో రెండు రాష్ట్రాలకు వివరించారు. తెలంగాణ వాటాలో ఇంకా 56 టీఎంసీలను వినియోగించుకోవాల్సి ఉందని తేల్చారు. అంతకు ముందు ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో మరో రెండు టీఎంసీలను తాగునీటి అవసరాల కోసం విడుదల చేయాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అయితే ప్రస్తుతం సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి విడుదల చేసుకుంటున్న నీటి లెక్కలను చెప్పకుండానే మరో రెండు టీఎంసీలకు ఇండెంట్ ఇచ్చారు. కానీ కృష్ణా బోర్డు మాత్రం రెండు టీఎంసీల నీటిని ప్రస్తుత పరిస్థితుల్లో ఇవ్వలేమని, ముందుగా నీటి విడుదలను ఆపాలని హెచ్చరిస్తూ లేఖ పంపింది.