జూన్ 5న గోదావరి బోర్డు సమావేశం
కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా పరమేశం దిశ, న్యూస్ బ్యూరో: గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం జూన్ 5న జరగనుంది. గోదావరి పై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మిస్తోంది అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపణలు చేయడం, దానికి సమాధానం ఇవ్వాల్సిందిగా తెలంగాణకు బోర్డు లేఖ రాయడం జరిగిపోయిన నేపథ్యంలో జూన్ 5న జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్ 4వ తేదీన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరగనున్నట్లు, ఇప్పటికే రెండు రాష్ట్రాలకు […]
కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా పరమేశం
దిశ, న్యూస్ బ్యూరో:
గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం జూన్ 5న జరగనుంది. గోదావరి పై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మిస్తోంది అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపణలు చేయడం, దానికి సమాధానం ఇవ్వాల్సిందిగా తెలంగాణకు బోర్డు లేఖ రాయడం జరిగిపోయిన నేపథ్యంలో జూన్ 5న జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్ 4వ తేదీన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరగనున్నట్లు, ఇప్పటికే రెండు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం లేఖలు రాశారు. రెండు బోర్డుల సమావేశాలు వరుసగా జరుగుతుండడంతో రెండు రాష్ట్రాల సాగునీటిపారుదల శాఖల కార్యదర్శులు, ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు హాజరుకానున్నారు. ఇదే సమయంలో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్న పరమేశంను ఆ బోర్డుకు ఛైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకోవడం విశేషం.
గోదావరి బోర్డులో వాడివేడి చర్చలు తప్పవా?
పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడంతో మొదలైన వ్యవహారం చివరకు గోదావరి బోర్డు వరకు చేరుకుంది. పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణను, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తప్పు పడుతున్న తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందంటూ గోదావరి బోర్డుకు ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది. కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే తెలంగాణ ఈ ప్రాజెక్టులను నిర్మిస్తోందని, వీటికి డీపీఆర్‌లు కూడా లేవని ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఇప్పటివరకు నిర్మించిన ప్రాజెక్టుల వివరాలను ఇవ్వాలని, డీపీఆర్‌లను కూడా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గోదావరి బోర్డు లేఖ రాసింది.
కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా పరమేశం
కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జూన్ 4న జరగనున్న నేపథ్యంలో బోర్డు ఛైర్మన్‌గా ఏ పరమేశంను నియమిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. వాటర్ ఇంజినీరింగ్ సర్వీస్‌కు చెందిన ఏ.పరమేశం ప్రస్తుతం కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయనను బోర్డుకు ఛైర్మన్‌గా పదోన్నతి కల్పిస్తూ మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వివాదం తాజాగా ముసురుకున్న సమయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆయనను ఛైర్మన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.