‘గ్రేటర్’ ఎన్నికలే కొండా దంపతుల టార్గెట్..

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కొండా దంపతులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ నుంచి సుమారు 200 మంది కార్యకర్తలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. దిశ ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖ కీలకంగా వ్యవహరించారు. వైఎస్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె భర్తతో పాటు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. కానీ టీఆర్ఎస్ అధినేత […]

Update: 2020-09-11 23:27 GMT

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కొండా దంపతులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ నుంచి సుమారు 200 మంది కార్యకర్తలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు.

దిశ ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖ కీలకంగా వ్యవహరించారు. వైఎస్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె భర్తతో పాటు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. కానీ టీఆర్ఎస్ అధినేత గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవడంతో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ మహిళా నేతకు కాంగ్రెస్ పెద్దపీట వేయబోతోందా? ఇక వరంగల్ జిల్లాలో ఆ దంపతులు చక్రం తిప్పబోతున్నారా? త్వరలోనే జరగబోయే మహానగరపాలక సంస్థ ఎన్నికలనే టార్గెట్ చేసుకున్నారా? అనే విషయాలపై ఉమ్మడి జిల్లాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

గతంలో కీలక పదవులు..

కాంగ్రెస్ హయాంలో సురేఖ మంత్రిగా పనిచేశారు. ఆమె భర్త కొండా మురళీధర్ రావు ఎమ్మెల్సీగా ఉన్నారు. కార్యకర్తలు, స్థానిక నాయకులు, అనుచరుల వద్ద విశ్వాసంతో ఉంటారని పేరుంది. వైఎస్ చనిపోయాక జగన్ కోసం ఆమె మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్ కుటుంబంపై విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో కొండా దంపతులు ఒడిదొడికులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొండా దంపతులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొండా సురేఖ భారీ మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత కొండా మురళికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆ తర్వాత 2019లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ కొండా దంపతులను పక్కనబెట్టారు. దీంతో కాంగ్రెస్ తరఫున పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొండా సురేఖ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా కొండా మురళి పదవీ బాధ్యతలు చేపట్టారు.

నేతల్లో కొత్త ఉత్సాహం..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకటి అర మినహా కాంగ్రెస్ పార్టీ పెద్దగా కార్యక్రమాలు చేయడంలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదాకు అనుగుణంగా ప్రజల్లోకి వెళ్లకపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనూ కొంత నైరాశ్యం నెలకొంది. మళ్లీ కొండా దంపతులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం కన్పిస్తోంది. కేవలం వరంగల్ నగరంలోనే కాకుండా ఉమ్మడి జిల్లాలోనూ కొండా దంపతులకు అభిమానులు ఉన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలంటే అందుకు అనుగుణమైన పదవి ఉండాలనేది కొండా వర్గీయులు చెబుతున్నమాట. ఈ మేరకు కొండా దంపతులు కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

టార్గెట్ వరంగల్ తూర్పు..

వరంగల్ తూర్పులో పూర్వ వైభవం కోసం కొండా దంపతులు వ్యూహరచన చేస్తున్నారు. కొన్నినెలల్లోనే వరంగల్ మహా నగరపాలక సంస్థకు ఎన్నికలే టార్గెట్ గా కొండా దంపతులు పావులు కదుపుతున్నారు. పలువురు నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఎన్నికల లోపు పార్టీని బలోపేతం చేసి ‘గ్రేటర్‌’ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ‘కొండా’ దంపతులు మరోమారు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి ముందుకు రావడం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి..

టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సుమారు 200 మంది కార్యకర్తలు కొండా సురేఖ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం వరంగల్ నగరంలో తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం‌ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ యాకుబ్ పాషా, సుమారు 200మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని మాజీ మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వరంగల్ మేయర్ బరిలో తన కూతురు సుష్మిత లేదని తెలిపారు. పార్టీని నమ్ముకుని పని చేస్తున్న వారిని గెలిపిస్తామని చెప్పారు. వరంగల్ తూర్పులో గెలిచిన కార్పొరేటర్లంతా తమ సహకారంతోనే గెలిచారన్నారు. టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.

Tags:    

Similar News