కోమటిరెడ్డి బ్రదర్స్ ఇలాకాలో రేవంత్ పట్టు సాధించేనా..?
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమాల పురిటిగడ్డ. తెలంగాణ రైతాంగ సాయుధం పోరాటం మొదలుకుని.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాధన వరకు ఈ జిల్లాది కీలక పాత్ర. కొన్నేండ్ల పాటు కమ్యూనిస్టులకు కంచుకోటగా.. మరికొన్నేండ్లు కాంగ్రెస్‌కు పెట్టనికోటగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు జిల్లాలో టీఆర్ఎస్ శకమూ నడుస్తోంది. కమ్యూనిస్టులు దాదాపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కనుమరుగయ్యారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా క్షేత్రస్థాయిలో బలంగానే ఉంది. కానీ ఆ పార్టీ క్యాడర్ నాయకత్వ లేమితో […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమాల పురిటిగడ్డ. తెలంగాణ రైతాంగ సాయుధం పోరాటం మొదలుకుని.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాధన వరకు ఈ జిల్లాది కీలక పాత్ర. కొన్నేండ్ల పాటు కమ్యూనిస్టులకు కంచుకోటగా.. మరికొన్నేండ్లు కాంగ్రెస్‌కు పెట్టనికోటగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు జిల్లాలో టీఆర్ఎస్ శకమూ నడుస్తోంది. కమ్యూనిస్టులు దాదాపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కనుమరుగయ్యారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా క్షేత్రస్థాయిలో బలంగానే ఉంది. కానీ ఆ పార్టీ క్యాడర్ నాయకత్వ లేమితో చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్న చందంగా మారింది. అయితే కాంగ్రెస్ క్యాడర్‌నంతా ఒక్కతాటిపైకి తేవడం ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సాధ్యం అవుతుందా.. అందుకు ఉమ్మడి జిల్లాలోని వర్గపోరు సహకరిస్తుందా.. అన్న ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
ఉమ్మడి జిల్లా అంతటా వర్గపోరే..
వాస్తవానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా వర్గపోరే కన్పిస్తుంటుంది. ఓవైపు కోమటిరెడ్డి వర్గం.. మరోవైపు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గం.. ఇంకోవైపు జానారెడ్డి అనుచరగణం.. ఇలా కోదాడ మొదలుకుని.. మునుగోడు వరకు.. అటు నాగార్జునసాగర్ నుంచి ఆలేరు వరకు అంతటా ఇదే పరిస్థితి. అయితే ఇంతటి వర్గపోరుపై పట్టు సాధించడమనేది రేవంత్‌కు సాధారణ విషయమేమీ కాదు. అసలే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువంటూ నేతలు చెబుతుంటారు. మరి కొత్తగా ఎన్నికైన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టుసాధించడం అంత ఈజీ కాదనేది ఒప్పుకోవాల్సిందే.
కోమటిరెడ్డిని ఢీ కొట్టేనా..
ఉమ్మడి నల్లగొండ జిల్లా అనగానే కోమటిరెడ్డి బ్రదర్స్ గుర్తుకువస్తారు. అయితే రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇవ్వడంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదట్నుంచీ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. టీపీసీసీ చీఫ్ నియామక ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఇటు రేవంత్ రెడ్డిపైన.. అటు కాంగ్రెస్ పార్టీపైన పదునైన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికి ఒకానొకదశలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ వీడుతున్నారనే ప్రచారం లేకపోలేదు. ఒకవేళ కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే.. రేవంత్‌కు పట్టు దొరకనిస్తారా అన్న చర్చ లేకపోలేదు. మునుగోడు, ఆలేరు, నల్లగొండ, నకిరేకల్, భువనగిరి, దేవరకొండ నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి వర్గం బలంగా ఉంది. గత ఎన్నికల్లోనూ నకిరేకల్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఏకచక్రాధిపత్యంగా విజయం సాధించారు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఏ మేరకు పట్టు సాధిస్తారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అందుకు సహకరిస్తారా.. లేదా.. అన్నదాని కోసం వేచిచూడాల్సిందే.