ఖమ్మం జిల్లాలో మిల్లర్ల మాయాజాలం
దిశ, ఖమ్మం: మిల్లర్ల మాయజాలంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ధాన్యం రైతులు విలవిలాడుతున్నారు. అమ్మకానికి తరలించిన మొత్త ధాన్యంలో 10శాతం మేర తరుగు పెడుతూ నిలువు దోపిడీకి తెరలేపారు. తిలాపాపం తలా ఇంత అన్నట్లుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ఆడుతున్న మార్కెట్ గేమ్‌లో రైతులు చిత్తవుతున్నారు. మిల్లర్ల ఆగడాలకు సివిల్ సప్లైశాఖ అధికారులు తమకు తోచిన విధంగా సహకారం అందజేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం రైతులకు ఊరిలోనే మార్కెట్ సౌకర్యం కల్పించడం ఏమో […]
దిశ, ఖమ్మం: మిల్లర్ల మాయజాలంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ధాన్యం రైతులు విలవిలాడుతున్నారు. అమ్మకానికి తరలించిన మొత్త ధాన్యంలో 10శాతం మేర తరుగు పెడుతూ నిలువు దోపిడీకి తెరలేపారు. తిలాపాపం తలా ఇంత అన్నట్లుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ఆడుతున్న మార్కెట్ గేమ్‌లో రైతులు చిత్తవుతున్నారు. మిల్లర్ల ఆగడాలకు సివిల్ సప్లైశాఖ అధికారులు తమకు తోచిన విధంగా సహకారం అందజేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం రైతులకు ఊరిలోనే మార్కెట్ సౌకర్యం కల్పించడం ఏమో గాని.. మిల్లర్ల జేబులు నింపే కార్యక్రమమే నడుస్తోందన్న విమర్శలు రైతాంగం నుంచి వినిపిస్తున్నాయి. రైతులు ఆరుగాలం పండించిన ధాన్యానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఒక్కలెక్క….మిల్లర్లు దిగుమతి చేసుకునేందుకు మరోలెక్క సాగుతుండటమే నిదర్శనం.
నిబంధనల ప్రకారం.. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ సంచిలో 41.200 కిలోలను తూకం వేస్తున్నారు. మట్టిపెళ్లలు, తాలు, గన్నీ సంచి బరువును పరిగణలోకి తీసుకుంటున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు 40కిలోలకే లెక్కకడుతున్నారు. అంటే ప్రతీ బస్తాపై 1200 గ్రాములను అదనంగా తూకం వేస్తున్నారు. ఇలా క్వింటాకు కొనుగోలు కేంద్రంలోనే దాదాపు 3కేజీల వరకు అదనంగా తూకం వేస్తున్నారు. అయితే ధాన్యంలో ఎక్కువగా తాలు ఉందని పేర్కొంటూ కొనుగోలుకు కొర్రీలు పెడుతుండటం విశేషం. మొత్తం సరుకులో 10శాతం తరుగు తీసేసేందుకు అంగీకరిస్తేనే కొనుగోలు చేయడం జరుగుతుందని తెగేసి చెబుతుండటం గమనార్హం.
కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్లలేక రైతులు దిక్కతోచని స్థితిలో మిల్లర్ల షరతులకు అంగీకరించి అమ్ముకుంటున్నారనే చెప్పాలి. అంటే ఉదాహరణకు ఒక రైతుకు 30క్వింటాళ్ల ధాన్యం తూగితే కేవలం 27క్వింటాళ్లుగానే పరిగణిస్తున్నారు. ఇదేంటని కొంతమంది రైతులు ప్రశ్నిస్తే తాలు ధాన్యం తీసుకుని మేము నష్టపోవాలా.? అంటూ ఎదురుప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం నిలువుదోపిడీలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మిల్లర్లకు సాధ్యమైనంత మేరకు సహకరిస్తుండటం విశేషం. పర్యవేక్షించాల్సిన సివిల్ సప్లై ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్ల అడుగులకు మడుగులు వత్తుతూ దోపిడీకి సహకరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. మిల్లర్ల దోపిడీపై ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ప్రయోజనం లేకపోవడం గమనార్హం.
Tags: millers, trouble for farmers, Khammam district, grain, market, weighing, gunny bags