ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్.. యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన కేసీఆర్.. వారిపై వేటు.!

దిశ, తెలంగాణ బ్యూరో : వడ్ల కొనుగోలు అంశంపై పార్లమెంటు శీతాకాల సమావేశాలను బహిష్కరించిన ఎంపీలంతా దాదాపు నాలుగైదు రోజులుగా సైలెంట్‌గానే ఉన్నారు. పార్టీ అధినేతతో భేటీ కాలేదు. పార్టీ నాయకత్వం కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టింది. క్రాస్ ఓటింగ్ ఊహాగానాల నేపథ్యంలో ఏ మేరకు జరిగిందనే దానిని నిశితంగా పరిశీలిస్తున్నది. ఊహించిన విధంగా ఆరు సీట్లను గెలుచుకుంటామనే ధీమాతోనే ఉన్నది. అయినా సొంత పార్టీ ఓట్లు ప్రత్యర్థికి పడినట్లు తేలితే సీరియస్‌గానే వ్యవహరించాలనుకుంటున్నది. ఉద్దేశపూర్వకంగానే […]

Update: 2021-12-12 20:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వడ్ల కొనుగోలు అంశంపై పార్లమెంటు శీతాకాల సమావేశాలను బహిష్కరించిన ఎంపీలంతా దాదాపు నాలుగైదు రోజులుగా సైలెంట్‌గానే ఉన్నారు. పార్టీ అధినేతతో భేటీ కాలేదు. పార్టీ నాయకత్వం కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టింది. క్రాస్ ఓటింగ్ ఊహాగానాల నేపథ్యంలో ఏ మేరకు జరిగిందనే దానిని నిశితంగా పరిశీలిస్తున్నది. ఊహించిన విధంగా ఆరు సీట్లను గెలుచుకుంటామనే ధీమాతోనే ఉన్నది. అయినా సొంత పార్టీ ఓట్లు ప్రత్యర్థికి పడినట్లు తేలితే సీరియస్‌గానే వ్యవహరించాలనుకుంటున్నది. ఉద్దేశపూర్వకంగానే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినవారిపై అవసరమైతే ఉద్వాసన వేటు వేయాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం.

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరుగనున్న నేపథ్యంలో ఫలితాల తర్వాతనే తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టనున్నది. వీలైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిపి జాయింట్ మీటింగ్‌ను నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే అది ఏ స్థాయిలో ఉన్నదో ఫలితాల తర్వాతనే ఒక అంచనాకు రానున్నారు. పార్టీకి సొంతంగా ఉన్న సంఖ్యలో ఓట్లు పడాల్సిందేనని, ఒక్కటి తక్కువైనా అది ఎవరిదో వీలైన పద్ధతుల్లో ఆరా తీసి చర్యలు తీసుకోక తప్పదని ఒక మంత్రి తన సన్నిహితులతో ఇటీవల వ్యాఖ్యానించారు. పార్టీ అగ్ర నాయకత్వం కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు వివరించారు.

అవసరమైతే గెంటివేత..

ఖమ్మం జిల్లాలో పార్టీకి చెందిన నేతలే అధికారిక అభ్యర్థిని కాదని ప్రత్యర్థికి ఓటు వేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అక్కడ పార్టీకి సొంతంగా ఉన్న ఓట్లకంటే తక్కువగా పోలైనట్లు తేలితే తదుపరి చర్యలు తప్పవనే సంకేతాలు పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో సైతం క్రాస్ ఓటింగ్ ఏ మేరకు జరిగిందనే దానిపై లెక్కలు వేస్తున్నారు. అయితే ఫలితాల తర్వాత దానిపై మరింత స్పష్టత వస్తుందని, అప్పుడే పార్టీపరంగా క్రమశిక్షణా చర్యలపై నిర్ణయం తీసుకోవచ్చనే వాదనా వినిపిస్తున్నది. ఉద్దేశపూర్వకంగానే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలితే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల తీవ్రతకు అనుగుణంగా హెచ్చరించడం మొదలు బహిష్కరించడం వరకు నిర్ణయం ఉండొచ్చని సమాచారం.

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత పార్టీ నాయకత్వం ఒకింత సీరియస్‌గానే ఉన్నది. పార్టీని బలోపేతం చేసుకుంటున్న సమయంలో క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై సీరియస్‌గానే వ్యవహరించాలనుకుంటున్నది. ఇప్పటి నుంచే పరిస్థితిని చక్కదిద్దకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి అది చేయిదాటిపోయే పరిస్థితి ఉంటుందన్నది పార్టీ భావన. ఈ విషయాన్ని పార్టీ శ్రేణుల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులతో జాయింట్ మీటింగ్ నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్లు తెలంగాణ భవన్ వర్గాల సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత నిర్దిష్టంగా తేదీపై స్పష్టత రానున్నది.

మరోవైపు పార్టీ నాయత్వం పట్ల అసంతృప్తితో ఉన్న కొద్దిమంది క్రాస్ ఓటింగ్‌కు భయపడలేదని రెండు జిల్లాల్లో చర్చ జరుగుతున్నది. క్యాంపులు, రిసార్టులు, తాయిలాలతోనూ పెద్దగా ప్రభావితం కాలేదని కూడా అనుకుంటున్నారు. పార్టీ నాయకత్వం సీరియస్‌గా ఉందన్న విషయం కూడా వారికి చేరింది. పార్టీ తనంతట తానుగా తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ బహిష్కరిస్తే ఆ పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగానే పనిచేయవచ్చు అని అభిప్రాయపడుతూ, ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, ఫలితాలు రాకుండా తొందరపాటు చర్యలు వద్దనే ధోరణి రెండు వైపులా కనిపిస్తున్నది. దాదాపు వారం రోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఈ నెల 14న వెలువడే ఫలితాల తర్వాత ఎలాంటి యాక్టివిటీస్ చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది.

 

Tags:    

Similar News