హుజురాబాద్ కోసమే దళిత బంధు.. బాంబు పేల్చిన కేసీఆర్

“హుజురాబాద్‌లో ఎలక్షన్ ఉందని దళిత బంధు పెట్టారంటూ విమర్శలు వస్తున్నయి. ఎన్నికల కోసమే పెట్టారని అంటున్నరు. ఎన్నికలుంటే పెట్టమా మరి! ఎందుకు పెట్టం? టీఆర్ఎస్ ఏమన్నా సన్నాసుల మఠమా? డెఫినెట్‌గా ఇది రాజకీయ పార్టే. కచ్చితంగా స్కీం పెడితే రాజకీయ లాభం కోరుకుంటం. వంద శాతం అంతే. అధికారంలో ఉన్నం కాబట్టి పెడతం. ఈ స్కీమ్‌ను ఏడనో ఒక చోట పెట్టాల్సిందే. రైతుబంధు లాగనే ఇప్పుడు హుజురాబాద్‌లోనే దళితబంధును పెడుతున్నం” –తెలంగాణ భవన్‌లో కౌశిక్ రెడ్డి చేరిక […]

Update: 2021-07-21 21:27 GMT

“హుజురాబాద్‌లో ఎలక్షన్ ఉందని దళిత బంధు పెట్టారంటూ విమర్శలు వస్తున్నయి. ఎన్నికల కోసమే పెట్టారని అంటున్నరు. ఎన్నికలుంటే పెట్టమా మరి! ఎందుకు పెట్టం? టీఆర్ఎస్ ఏమన్నా సన్నాసుల మఠమా? డెఫినెట్‌గా ఇది రాజకీయ పార్టే. కచ్చితంగా స్కీం పెడితే రాజకీయ లాభం కోరుకుంటం. వంద శాతం అంతే. అధికారంలో ఉన్నం కాబట్టి పెడతం. ఈ స్కీమ్‌ను ఏడనో ఒక చోట పెట్టాల్సిందే. రైతుబంధు లాగనే ఇప్పుడు హుజురాబాద్‌లోనే దళితబంధును పెడుతున్నం”
–తెలంగాణ భవన్‌లో కౌశిక్ రెడ్డి చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ తన ప్రసంగం, జూలై 21, 2021

దిశ, తెలంగాణ బ్యూరో : దళితబంధు పథకాన్ని ఎందుకు తీసుకొస్తున్నారో సీఎం కేసీఆర్​ క్లారిటీ ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీగా వంద శాతం లాభం కోరుకుంటామన్నారు. అధికారంలో ఉన్నందునే ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఏదో ఒక చోట ఈ పథకాన్ని లాంచ్​ చేయాలి కాబట్టి దానికి హుజురాబాద్‌ను ఎంచుకున్నామన్నారు. ఆ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో బుధవారం మాట్లాడుతూ దళితబంధు విషయంలో పై కామెంట్స్ చేశారు. ‘ఏమీ చేయనోడు లాభం జరగాలని కోరుకున్నప్పుడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టి లాభం జరగాలని ఎందుకు కోరుకోకూడదు?’ అని వ్యాఖ్యానించారు.

వంకర టింకర కామెంట్లు చేసెటోళ్లు ఎలా ఉన్నా ఒక పార్టీగా రాజకీయ లాభం కోసమే ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ఎన్నో విధాలుగా ఆలోచన చేసి దీన్ని ఖరారు చేశామని, కొద్దిమందికి దీన్ని చూసి బీపీ పెరుగుతున్నదన్నారు. ఓట్లకు ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉందని, కానీ ఆ ఓట్ల కోసమేనంటూ దళిత బంధు విషయంలో విమర్శిస్తున్నారని, అధికారంలో ఉన్నందుకు దాన్ని తీసుకొస్తున్నామని, అలాంటప్పుడు రాజకీయ లాభం కోరుకోకుండా ఎందుకు ఉంటామని ఎదురు ప్రశ్నించారు. దళిత బంధు ద్వారా వచ్చే పది లక్షల రూపాయలకు లబ్ధిదారులు ఓనర్‌లు అవుతారన్నారు. ఈ పథకం ద్వారా జన్మలో మళ్లీ పేదరికంలోకి వెళ్లే అవకాశమే లేదని, ఆ విధంగా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు దళితులు పేదరికంతో పాటు సామాజిక వివక్షను కూడా ఎదుర్కొంటున్నారని, దాన్ని దృష్టిలో పెట్టుకునే దళిత బంధు పథకాన్ని తీసుకురావాలనుకున్నామని, చాలా మంది దళిత మేధావులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు. ఈ పథకం ద్వారా ప్రతీ లబ్ధిదారునికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుందని, వారు ఆర్థికంగా ఎదగడానికి, జీవితంలో మళ్ళీ పేదరికంలోకి వెళ్ళకుండా పకడ్బందీ ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు.

లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు

లబ్ధిదారులందరికీ స్మార్ట్ కార్డు ఉంటుందని, చిప్‌తో పాటు బార్ కోడ్ కూడా ఉంటుందని, ఆ నగదు సాయాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారో పర్యవేక్షణ ఉంటుందన్నారు. పాడి పశువుల లాంటివి కొనుక్కోడానికి తక్షణం ఉపయోగపడుతుందని, ఈఎంఐలు, వడ్డీలు కట్టాల్సిన అవసరం ఉండదన్నారు. అనుకోని తీరులో ఆ లబ్ధిదారుల కుటుంబానికి వైద్య అవసరాలు ఏర్పడితే రక్షణ కోసం ఉన్న ప్రత్యేక నిధి నుంచి సాయం తీసుకోవచ్చునని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా ఉంటుందని చెప్పారు.

కౌశిక్ రెడ్డికి ఉజ్వల భవిష్యత్

రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కాక తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఉజ్వలమైన పాత్ర పోషిస్తారని అన్నారు. యువకుడిగా ఆయనకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయని, ఆయనతోపాటు చాలా మంది సైన్యంగానే వచ్చి చేరారన్నారు. రాష్ట్ర సాధన కోసం పనిచేసినవారు వృద్ధులయ్యారని, ఇక తెలంగాణ భవిష్యత్ అంతా యువతపైనే ఉందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. దళిత బంధు విజయవంతానికి అందరూ సమున్నత పాత్ర పోషించాలని కోరారు.

Tags:    

Similar News