Telangana Unlock : తెలంగాణలో ఇకపై అన్‌లాక్?
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది. లాక్‌డౌన్‌ను ఎత్తివేసి కొన్ని ఆంక్షలతో అన్‌లాక్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌కు ముందు అమలైన నైట్ కర్ఫ్యూను యధాతథంగా కొనసాగించేలా నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. లాక్‌డౌన్‌ను గత నెల 12వ తేదీ నుంచి అమలు చేసినందువల్ల రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని, కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ భావించిన నేపథ్యంలో క్రమంగా […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది. లాక్‌డౌన్‌ను ఎత్తివేసి కొన్ని ఆంక్షలతో అన్‌లాక్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌కు ముందు అమలైన నైట్ కర్ఫ్యూను యధాతథంగా కొనసాగించేలా నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. లాక్‌డౌన్‌ను గత నెల 12వ తేదీ నుంచి అమలు చేసినందువల్ల రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని, కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ భావించిన నేపథ్యంలో క్రమంగా పరిమిత ఆంక్షలతో అన్‌లాక్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పటికే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సమర్పించిన నివేదికతో పాటు ఆర్థిక శాఖ అధికారుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత లాక్‌డౌన్‌పై తదుపరి నిర్ణయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి తోడు లాక్‌డౌన్‌ను కొనసాగించడం ద్వారా ప్రజలు పడే ఇబ్బందులను మంత్రులు, ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని కూడా సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు థర్డ్ వేవ్ రావచ్చన్న అంచనాలతో ఇప్పటి నుంచే ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఏ విధంగా సన్నద్ధం కావాలి, తదితర అంశాలను కూడా కేబినెట్ చర్చించనున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు మొదలయ్యే కేబినెట్ సమావేశంలో కరోనా కట్టడి, లాక్‌డౌన్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాలతో పాటు రైతుబంధు, వ్యవసాయం, సాగునీరు, వానాకాలం సీజన్ సాగు, ఎరువులు-విత్తనాల లభ్యత, కల్తీ వితన్నాలను అరికట్టడం తదితరాలపై చర్చ జరగనుంది. రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో మంగళవారం ఏక కాలంలో తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల ప్రారంభోత్సవ ప్రక్రియను మరుసటి రోజు (జోన్ 9వ తేదీ)కి ప్రభుత్వం వాయిదా వేసింది. మంత్రుల చేతుల మీదుగా వీటిని ప్రారంభించాలని తొలుత భావించినా వారంతా కేబినెట్ సమావేశానికి హాజరవుతున్నందున ఒక రోజు వాయిదా వేసేలా నిర్ణయం తీసుకున్నది.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో పురోగతి, ఇకపైన చేపట్టాల్సిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర అంశాల మీద కూడా సమీక్ష జరిగే అవకాశమున్నదని ప్రభుత్వ వర్గాల సమాచారం. వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైనందున రైతుబంధు పేరుతో ఇచ్చే పంట పెట్టుబడి సాయం, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర అంశాలపై కూడా కేబినెట్ చర్చించే అవకాశమున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
మంత్రుల ప్రారంభోత్సవాలు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నటిక్ సెంటర్లను మంగళవారం ఎక్కడికక్కడ మంత్రులు ఏక కాలంలో 19 జిల్లాల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి గతంలో నిర్ణయించినప్పటికీ కేబినెట్ సమావేశం ఉన్న కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. మంత్రులంతా కేబినెట్ భేటీలో పాల్గొనాల్సిన అవసరం దృష్ట్యా బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ మంత్రులు అందుబాటులో లేనట్లయితే ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.