వారిపై కేసీఆర్‌లో బలపడిన అనుమానాలు
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రగతిభవన్ వర్గాలపై సీఎం కేసీఆర్‌కు అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అధికారిక నివాసం నుంచి పక్కాగా లీకులు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. రహస్యంగా దాచాలనుకున్న విషయాలన్నీ బహిర్గతమవుతున్నట్లు సీఎం అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్‌కు సంబంధించిన అంతర్గత విషయాలన్నీ కేంద్రం చేతిలో ఉన్నాయి. అసలు దాచిపెట్టిన రహస్యాలు ఎలా లీక్ అయ్యాయనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు నీటిపారుదల ప్రాజెక్టులపై అటు కేంద్రంతో పాటు జలశక్తి, కేఈఆర్ఎంబీ, జీఆర్ఎంబీ వివరాలు అడుగుతూనే […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రగతిభవన్ వర్గాలపై సీఎం కేసీఆర్‌కు అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అధికారిక నివాసం నుంచి పక్కాగా లీకులు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. రహస్యంగా దాచాలనుకున్న విషయాలన్నీ బహిర్గతమవుతున్నట్లు సీఎం అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్‌కు సంబంధించిన అంతర్గత విషయాలన్నీ కేంద్రం చేతిలో ఉన్నాయి. అసలు దాచిపెట్టిన రహస్యాలు ఎలా లీక్ అయ్యాయనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు నీటిపారుదల ప్రాజెక్టులపై అటు కేంద్రంతో పాటు జలశక్తి, కేఈఆర్ఎంబీ, జీఆర్ఎంబీ వివరాలు అడుగుతూనే ఉంది. డీపీఆర్‌లు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూనే ఉంది. కేంద్రం కూడా దీనిపై చాలాసార్లు సీఎంకు అధికారికంగా లేఖలు పంపింది. అపెక్స్ కౌన్సిల్ భేటీలో కూడా డీపీఆర్‌లు ఇవ్వాలని పేర్కొంది. కానీ రాష్ట్రం నుంచి మాత్రం డీపీఆర్‌లు సమర్పించడం లేదు. అవసరమైతే అవన్నీ పాత ప్రాజెక్టులంటూ కొట్టిపారేస్తుందే కానీ డీపీఆర్‌లు మాత్రం సమర్పించలేదు. ఒకదశలో డీపీఆర్‌లు ఇవ్వమంటూ తెగేసి చెప్పింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్‌గా చెప్పుకుంది. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలయ్యాయంటూ మెలిక పెట్టింది. ఇలా ప్రతి ప్రాజెక్టు డీపీఆర్‌లను దాచి పెట్టుతూనే ఉంది. కొద్ది రోజుల కిందట వరకు డీపీఆర్‌లు బయటకు వెళ్లలేదని రాష్ట్ర ప్రభుత్వం ధీమాతోనే ఉంది.
కాగా డీపీఆర్‌లు ఇస్తే చాలా అంశాలు బహిర్గతమవుతాయి. ప్రాజెక్టుల అంచనాల నుంచి బిల్లుల చెల్లింపుల వరకు ప్రతి ఒక్కటీ వివరించాల్సిందే. అందుకే ప్రభుత్వాలు ప్రాజెక్టుల డీపీఆర్‌లను దాచి పెడుతూ ఉంటాయి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక డీపీఆర్ బయటకు ఇస్తేనే చాలా సమస్యలు వచ్చయి. అది కచ్చితమైన డీపీఆర్ కాదంటూ ఆరోపణలు వచ్చాయి. అది అసలు డీపీఆర్ కాదని ప్రభుత్వం నుంచే చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. రాష్ట్ర బడ్జెట్‌తో పాటు నిధులన్నీ సాగునీటి ప్రాజెక్టులకే వెచ్చిస్తున్నారు. దీంతో డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం బయటకు ఇవ్వడం లేదు.
ఇప్పుడెలా మరి..?
వాస్తవంగా కేంద్రం పదే పదే లేఖలు రాసింది. డీపీఆర్ ఇవ్వాలంటూ పట్టుబట్టింది. కాళేశ్వరం థర్డ్ టీఎంసీపై వివరాలు లేవంటూనే సమగ్రమైన నివేదికలు ఇవ్వాలని పేర్కొంది. అయితే మూడో టీఎంసీ నిర్మాణ పనులు దాదాపు 60 శాతం పూర్తయినట్లు తెలుస్తుందంటూ కేంద్రం గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తూ లేఖ పంపింది. కానీ ప్రభుత్వం నుంచి సమాధానం ఇవ్వలేదు. దీంతో కాళేశ్వరం డీపీఆర్‌లు కేంద్రం దగ్గర ఉన్నట్టుగా అనుమానాలు ఉన్నాయి. కానీ కేంద్రం నుంచి రాసిన తాజా లేఖతో కాళేశ్వరం డీపీఆర్ మొత్తం కేంద్రం చేతుల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాళేశ్వరంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్రం చేతుల్లో పెట్టుకుందని తెలుస్తోంది. గతంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కూడా ఈ వివరాలన్నీ కేంంద్రానికి సమర్పించినట్లు గుసగుసలు వినిపించాయి.
ప్రస్తుతం ప్రాజెక్టుల డీపీఆర్‌లు కేంద్రం దగ్గర ఉన్నాయని అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేతలు చెప్పుతున్నారు. ప్రభుత్వం రహస్యంగా దాచిపెట్టిన డీపీఆర్‌లు కేంద్రం చేతికి చిక్కాయి. దీనిలో చాలా లోపాలు, అక్రమాలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైస్ ఎస్కలేషన్‌తో పాటు ఇసుక దందా, నిర్మాణాల్లో వైఫల్యాల వంటి అంశాలన్నీ కేంద్రం గుర్తించినట్లు చెప్పుతున్నారు. ఇవన్నీ డీపీఆర్‌లు కేంద్రం చేతికి చిక్కడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని భావిస్తున్నారు. తాజాగా కేంద్ర మంతి గజేంద్ర షెకావత్… సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో చాలా అంశాలు వెల్లడించారు. దీని ప్రకారం కూడా డీపీఆర్‌లు కేంద్రం దగ్గర ఉన్నట్లు స్పష్టమవుతోంది. చాలా విషయాలను పాయింట్ టూ పాయింట్ అడిగిన తీరును చూస్తే అదే వెల్లడవుతోంది.
బయటకు ఇచ్చెందెవ్వరు..?
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం… సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వర్గాలపై అనుమానాలు మొదలయ్యాయి. తన దగ్గరే ఉంటూ నమ్మక ద్రోహానికి పాల్పడిందెవ్వరనే అంశంపై నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. వాస్తవంగా చాలా ప్రాధాన్యత సంతరించుకున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు కేంద్రానికి ఎలా చిక్కాయనేది అంతు చిక్కని అంశమే. ప్రగతి భవన్‌కు ఎవరైనా వెళ్లడమే అత్యంత కష్టం. అలాంటిది ప్రగతి భవన్లో దాచి పెట్టుకున్న డీపీఆర్‌లు ఇప్పుడు కేంద్రానికి వెళ్లాయి. అంతేకాకుండా చాలా సెక్యూరిటీ అంశాలను దాటుకుని ఈ డీపీఆర్‌లు బయటకు వెళ్లాయి. అది కూడా కేంద్రంతో కొంత వివాదం మొదలైన నేపథ్యంలోనే డీపీఆర్‌లను చేతుల్లో పెట్టుకున్నారు. కేంద్రం ప్రాజెక్టుల డీపీఆర్‌లను చేతుల్లో పెట్టుకుందని సీఎం కేసీఆర్‌కు కూడా బలమైన అనుమానాలు ఉన్నాయి. దీనిపై కేంద్రం ఏదోవిధంగా చర్యలు తీసుకునేందుకు పూనుకుంటుందని కూడా అనుమానిస్తున్నారు. అయితే చాలా బలమైన వ్యవస్థను దాటుకుని డీపీఆర్‌లు ఎలా వెళ్లాయో ఇంకా తేలడం లేదు. అయితే చాలా మేరకు కొంతమంది ఉన్నతాధికారులను అనుమానించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
మన దగ్గరి వారేనా..!
ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ టీం ఉంటోంది. సీనియర్ ఐఏఎస్‌లు, ముందు నుంచీ తనకు అండగా నిలిచిన అధికారులకు ప్రగతిభవన్‌లో స్థానం కల్పించారు. కొంతమంది సెంట్రల్ సర్వీసుల్లో ఉన్నా వారిని డిప్యూటేషన్పైనో, అక్కడ రాజీనామా చేయించో ప్రత్యేకమైన పద్దతుల్లో వారిని కొనసాగిస్తున్నారు. అయితే ఇంత నమ్మకంగా ఉన్నా డీపీఆర్‌ల విషయంలో నమ్మకద్రోహం చేసి కేంద్రానికి సహాకరించిదెవ్వరనే అంశం ఇంకా తేలడం లేదు. ఇది సీఎంకు కూడా తలనొప్పి వ్యవహారమే. అయితే కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన అధికారులపైనే కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతో ఒకరిద్దరు సీనియర్ అధికారులపై అనుమానాలు ఉండటంతో… కొద్దిరోజులుగా వారిని కీలక అంశాల్లో దూరంగా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన ఓ అధికారిపై రాష్ట్ర అధికారులు కూడా ఫిర్యాదులు చేశారు. కొన్ని సందర్భాల్లో ప్రగతిభవన్‌లో సీఎం తరహాలో పెత్తనం సాగిస్తున్నారంటూ విమర్శలు చేశారు. అయితే కేంద్రంతో ఇంకా సత్సంబంధాలు ఉండటంతో ప్రాజెక్టుల డీపీఆర్‌లన్నీ ఆయన ద్వారానే కేంద్రానికి వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు. ఈ అంశం సీఎం కేసీఆర్‌కు కూడా చేరడంతో… కొంతకాలంగా సదరు అధికారిపై కస్సుబుస్సులాడుతున్నారని సమాచారం. అయితే ఇంకా క్లారిటీ రాకపోవడంతోనే సీఎం వేచి చూస్తున్నట్లు అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. కానీ అత్యంత రహస్యంగా ఉంచి, డిజిటిల్ కీలతో దాచి పెట్టుతున్న ఈ డీపీఆర్‌లు కేంద్రానికి వెళ్లడం సీఎం కేసీఆర్‌కు అగ్ని పరీక్షే. ఈ అంశంపై ప్రగతిభవన్‌లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాల్సిందేనంటున్నారు.