హుజురాబాద్ టికెట్ కోసం మంతనాలు.. కాంగ్రెస్‌లో ఎవరికి?

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్​గా రేవంత్​రెడ్డి నియామకంతో కాంగ్రెస్​లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్​ సీనియర్లను పట్టించుకోకుండా ఉన్న హుజురాబాద్​ కాంగ్రెస్​ నేత కౌశిక్​రెడ్డి రెండు రోజుల్లోనే రూటు మార్చారు. ఒకవైపు రేవంత్​రెడ్డి ముందున్న పెద్ద టాస్క్​ రాబోయే హుజురాబాద్​ ఉపఎన్నికలే అంటూ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో అక్కడ కాంగ్రెస్​ నుంచి ఎవరిని బరిలోకి దింపుతారనేది చర్చగా మారింది. కౌశిక్​ స్థానం పదిలమేనా..? ఇటీవల పరిణామాల్లో కౌశిక్​రెడ్డి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా […]

Update: 2021-06-28 02:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్​గా రేవంత్​రెడ్డి నియామకంతో కాంగ్రెస్​లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్​ సీనియర్లను పట్టించుకోకుండా ఉన్న హుజురాబాద్​ కాంగ్రెస్​ నేత కౌశిక్​రెడ్డి రెండు రోజుల్లోనే రూటు మార్చారు. ఒకవైపు రేవంత్​రెడ్డి ముందున్న పెద్ద టాస్క్​ రాబోయే హుజురాబాద్​ ఉపఎన్నికలే అంటూ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో అక్కడ కాంగ్రెస్​ నుంచి ఎవరిని బరిలోకి దింపుతారనేది చర్చగా మారింది.

కౌశిక్​ స్థానం పదిలమేనా..?

ఇటీవల పరిణామాల్లో కౌశిక్​రెడ్డి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. ప్రధానంగా ఎంపీ రేవంత్​రెడ్డి ముందుగా ఈటల రాజేందర్​ భూ వ్యవహారంలో ఆయనకు అండగా ఉన్నట్లు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అంతేకాకుండా దేవరయాంజల్​ భూముల అంశంపై ఉద్యమించారు. అదే సమయంలో హుజురాబాద్​ నేత కౌశిక్​రెడ్డి పార్టీ ఆదేశాలను కాదని వ్యక్తిగతంగా ఈటలను టార్గెట్​ చేశారు. ఓవైపు కాంగ్రెస్​ పార్టీ ఈటలను వెనకేసుకొస్తుంటే కౌశిక్​ మాత్రం వ్యతిరేకించారు. దీనిపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ కూడా పార్టీకి లేఖ రాశారు. ఈటల వ్యవహారంలో అసలు పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలంటూ నిలదీశారు. కానీ అప్పటి టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ సమీప బంధువు కావడంతో కౌశిక్​రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో టీఆర్​ఎస్​తో కౌశిక్​ అంటకాగుతున్నాడనే ఆరోపణలు సైతం వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ మంత్రి కేటీఆర్​తో ఓ కార్యక్రమంలో కౌశిక్​ పెట్టిన గుసగుసలు బలంగా మారాయి. కౌశిక్​ వెనకుండి టీఆర్​ఎస్​ ఈటలపై విమర్శలు చేయిస్తుందనే విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే కౌశిక్​రెడ్డి కూడా దీనిపై స్పందించిన తీరు తక్కువే.

తాజాగా రూట్​ ఛేంజ్​

మొన్నటి వరకు ఒకవిధంగా ఉత్తమ్​ అండతో పార్టీలోని సీనియర్లను కౌశిక్​ పరిగణలోకి తీసుకోలేదని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా రేవంత్​రెడ్డి పగ్గాలు ఇవ్వడం, సీనియర్ల నోటికి తాళాలు వేసి, రేవంత్​ నిర్ణయాలే కీలకమని ఏఐసీసీ సంకేతాలివ్వడంతో నేతలు రూట్​ మారుస్తున్నారు. ఇదేరూట్​లో కౌశిక్​రెడ్డి కూడా చేరారు. సోమవారం ఉదయం రేవంత్​రెడ్డి ఇంటికి చేరుకుని అభినందనలు తెలిపారు. అనంతరం హుజురాబాద్​ నియోజకవర్గం రాజకీయ పరిణామాలను చర్చించారు. తాను పోటీకి సిద్ధమంటూ సంకేతాలిచ్చారు.

టికెట్ ఎవరికి?

మరోవైపు కౌశిక్​రెడ్డి అంశంలో రేవంత్​రెడ్డి కూడా కొంత సీరియస్​గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు హుజురాబాద్​ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అదెలా ఉన్నా.. ఇప్పుడు ఆయన్ను హుజురాబాద్​ నుంచి పోటీ చేస్తే టీఆర్​ఎస్​లో లోపాయికారికంగా ఒప్పందాలు చేసుకుంటారంటూ పార్టీ నేతలు రేవంత్​కు సమాచారమందిస్తున్నారు. దీనికి బలమైన కారణాలు కూడా చూపిస్తున్నారు. ప్రస్తుతం చాలా క్లిష్టమైన సమయంలో పీసీసీ పీఠంపై కూర్చున్న రేవంత్​రెడ్డికి ముందు హుజురాబాద్​ టాస్కే కీలకంగా మారుతోంది. ఇలాంటి సమయంలో కౌశిక్​రెడ్డికి టికెట్​ ఇవ్వరని, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ను అక్కడి నుంచి పోటీకి దింపే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కౌశిక్​రెడ్డి మాత్రం రేవంత్​ను కలిసి తాను పార్టీ విధేయుడినే అంటూ నమ్మకం కల్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో హుజురాబాద్​కు ఉప ఎన్నికలు వస్తే… రేవంత్​రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు పార్టీలో హాట్​ టాపిక్​.

Tags:    

Similar News