జెట్​స్పీడ్‌తో కాళేశ్వరం పూర్తి.. దక్షిణ తెలంగాణ ఇంకా ఏడారే..

దిశ, తెలంగాణ బ్యూరో : స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగగా మారింది. సాగు విస్తీర్ణం రెట్టింపు అయింది. దీనంతటికీ ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ ప్రభుత్వం చూపిస్తోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదనేది మరో వాదన. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా.. సాగు మాత్రం పెరిగింది. 2014లో 80 లక్షల ఎకరాలు ఉన్న సాగు ఇప్పుడు 1.40 కోట్ల ఎకరాలకు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును జెట్​ స్పీడ్‌తో పూర్తి చేసిన […]

Update: 2021-05-31 14:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగగా మారింది. సాగు విస్తీర్ణం రెట్టింపు అయింది. దీనంతటికీ ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ ప్రభుత్వం చూపిస్తోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదనేది మరో వాదన. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా.. సాగు మాత్రం పెరిగింది. 2014లో 80 లక్షల ఎకరాలు ఉన్న సాగు ఇప్పుడు 1.40 కోట్ల ఎకరాలకు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును జెట్​ స్పీడ్‌తో పూర్తి చేసిన ప్రభుత్వం ఈ క్రెడిట్​మొత్తం దానిపైనే వేస్తోంది. మరోవైపు ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టును వరప్రదాయినిగా చూపిస్తుంటే.. అటు దక్షిణ తెలంగాణను మాత్రం ఎండబెట్టిందనే అపవాదును ప్రభుత్వం మూటగట్టుకుంటోంది. దక్షిణ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయడం లేదని, ఏండ్ల కింద మొదలుపెట్టినా ఇంకా భూ సేకరణలోనే కాలం వెళ్లదీస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటోంది.

సాగు పెరిగింది ఇలా..!

ప్రాజెక్టుల పరిస్థితులు ఎలా ఉన్నా.. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం మాత్రం పెరిగింది. ఇదంతా కాళేశ్వరంతోనే సాధ్యమైందని ప్రభుత్వం పదేపదే చెప్పుతూనే ఉంది. దేశానికే ఈ ప్రాజెక్టును రోల్​మోడల్‌గా చూపిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి కూడా ఈ ప్రాజెక్టును చూసేందుకు వస్తున్నారు. ఇలాంటి ఘనత దక్కించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో కొత్త ఆయకట్టు లేదనే విమర్శలను పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ప్రాజెక్టులు కారణం కాదనే ప్రచారం కూడా ఉంది. విస్తారంగా వర్షాలు కురువడం, మిషన్​కాకతీయతో చెరువుల మరమ్మత్తులు తీయడంతో భూగర్భ జలాలు పెరిగాయి. అదేవిధంగా పాత కాల్వల నుంచే చెరువులు, కుంటలను నింపడంతో వాటి ఆయకట్టు పెరిగిందంటున్నారు. దీనికి తోడుగా నిరంతర విద్యుత్ కూడా వ్యవసాయ రంగానికి ఇస్తుండటంతో రైతులు బోర్లు, బావుల నుంచి నీటిని పొలాలకు మళ్లిస్తున్నారు. ఈ కారణాలతోనే సాగు విస్తీర్ణం పెరిగిందని స్పష్టం చేస్తున్నారు.

మిషన్​ కాకతీయతో ఫలితం..

రాష్ట్రంలో ప్రస్తుతం భూగర్భ జలాలు పెరిగి, సాగు విస్తీర్ణం పెరిగిందంటే దానికి ప్రధాన కారణం మిషన్​ కాకతీయ ఒక్కటే అని చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం చెరువుల సంఖ్య 46,571గా తేలింది. వీటిలో 38,451 చెరువులు కాగా మిగతావి కుంటలు ఉన్నాయి. వీటిలో గొలుసుకట్టు చెరువులు 5వేలు. మొత్తం చెరువులు, కుంటల కింద ఉన్న ఆయకట్టు 25,92,437 ఎకరాలు. మిషన్ కాకతీయ పథకం కారణంగా నీటి నిల్వ పెరుగడంతో భూగర్భ జలాలు పెరిగి ఈ ఆయకట్టు సాగులోకి వచ్చింది.

ఈ ఏడాది ఎత్తిపోసింది 33 టీఎంసీలే..

లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లు అందడం లేదు. అతిపెద్ద ప్రాజెక్టు.. సర్కారు భారీ విజయంగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 2020 మే వరకు (2019 జూన్ నుంచి 2020 మే వరకు) 60 టీఎంసీల నీళ్లను ఎత్తిపోస్తే ఇప్పడు ఈ సీజన్ (2020 జూన్​ నుంచి 2021 మే వరకు) కేవలం 33 టీఎంసీలు ఎత్తిపోశారు. ఈ సీజన్‌లో కేవలం 53 రోజులు మాత్రమే మోటార్లను నడిపించారు. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ విఫల చరిత్రను దిద్దుకుంది. ఏటా 225 టీఎంసీలు ఎత్తి పోసి 40 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామనే టార్గెట్‌ను​ చేరడం లేదు. చేరే అవకాశాలు కూడా లేవనే అంటున్నారు. ఈ ఏడాది జనవరి 17న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు మొదలుపెట్టి 17 మోటార్లలో 7 మోటార్ల ద్వారా మార్చి 9 వరకు కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ నుంచి 33 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఆపేశారు.

అయితే ఒక కొత్త ప్రాజెక్టును డిజైన్ చేస్తే ప్రతిపాదనల సమయంలో కొత్త ఆయకట్టును లెక్కేస్తారు. అంటే ఇప్పటికే ఉన్న చెరువులు, కుంటల కింద ఆయకట్టును పరిగణలోకి తీసుకోరు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో మాత్రం కొత్త రీతిలో లెక్కలేశారు. చెరువులు, కుంటల పరిధిలోని ఆయకట్టును కూడా లెక్కించారు. ఏటా 225 టీఎంసీలు ఎత్తిపోసి కొత్తగా 18.25 లక్షల ఎకరాలు, ఇంకో 18.83 లక్షల ఎకరాల పాత ఆయకట్టుకు నీళ్లివ్వనున్నట్లు చెప్పుతున్నా.. కొత్త ఆయకట్టులో ఒక్క ఎకరాకు కూడా నీరు అందడం లేదు. కాళేశ్వరం కింద కొత్తగా 12.71 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని ప్రభుత్వం ప్రతిసారీ చెప్పుతున్నా కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయింది.

కాళేశ్వరంతో పాటు దాని పరిధిలోని మిడ్​మానేరు, లోయర్ మానేరు డ్యాం, అటు మల్లన్నసాగర్ వరకు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పెండింగ్​రిజర్వాయర్లు పూర్తికాకపోవడం, ఉన్న ప్రాజెక్టుల్లో నీళ్లు తగ్గడం, కాళేశ్వరం నుంచి ఎత్తిపోయడం లేకపోవడంతో ఒక్క ఎకరా కూడా తడవలేదు. రాష్ట్రానికే తలమానికం అని చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేవలం 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లలోని భూములకు కూడా సాగునీరు ఇవ్వలేదు.

కాళేశ్వరం వల్లే రాష్ట్రంలో పంటల సాగు పెరిగిందని సర్కార్ చెప్తున్న మాటలకు.. వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని నీటిపారుదల నిపుణులు చెప్పుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి, నల్లగొండ, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మేడ్చల్ జిల్లాల్లో కొత్తగా 18.25 లక్షల ఎకరాలు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, వరదకాలువ ప్రాజెక్టుల కింద 18.80 లక్షల ఎకరాల స్థిరీకరణ చేయాల్సి ఉండగా.. ఈ ప్రాజెక్టు నుంచి కొత్త ఆయకట్టుకు ఇప్పటి వరకూ నీరందించలేదు.

దక్షిణ తెలంగాణ అష్టకష్టాలు..

ఉత్తర తెలంగాణకు కాళేశ్వరాన్ని చూపిస్తున్నా.. దక్షిణ తెలంగాణ మాత్రం అన్యాయానికి గురవుతుందనే అపవాదు ఉంది. ఉమ్మడి మహబూబ్​నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రభుత్వం రూ.35 వేల కోట్ల వ్యయంతో 2015 జూన్ 11న పాలమూరు–రంగారెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి 60 రోజుల పాటు వరద నీటిని లిప్ట్ చేసి, ఎగువ ప్రాంతాలకు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయితే మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 1100 గ్రామాలకు, హైదరాబాద్‌కు తాగునీరు అందుతుందని ప్రకటించారు. రెండేండ్లలో పూర్తి చేస్తామని చెప్పినా.. ఇప్పటికీ 40 శాతం కూడా పనులు కాలేదు. ఇంకా భూ సేకరణ కంప్లీట్ కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఇక ఎన్నో ఏళ్లుగా ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న నల్లగొండ జిల్లా ప్రజల కోసం రూ.6,190 కోట్ల వ్యయంతో 2015 జూన్ 12న డిండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుండగా.. ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. అటు కల్వకుర్తి కూడా పెండింగ్‌లోనే పడింది.

అటు ఆర్డీఎస్ రైతులకు జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ ఉద్యమనేతగా 2002 జూలై 23న కేసీఆర్ ఐదురోజులపాటు పాదయాత్ర చేపట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి నీళ్లు అందిస్తామని ప్రకటించారు. మొదటి టర్మ్‌లో పట్టించుకోలేదు. ఎట్టకేలకు 2018 జనవరి 8న తుమ్మిళ్లలో రూ.783 కోట్లతో చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మొదటిదశ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ ఆర్డీఎస్ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలే కనిపించడం లేదు.

రీ డిజైనింగ్‌తో మరింత ఆలస్యం..

రాష్ట్ర విభజనకు ముందు నదీ జలాల్లో తెలంగాణ వాటాను వాడుకోలేకపోయామని, గోదావరి, కృష్ణా నదుల్లో మన వాటా 1,250 టీఎంసీలతో పాటు మరో 150 టీఎంసీలకు పైగా మిగులు జలాల్లో వాటా ఉందని, ఈ నీటిని వాడుకోవడానికి కావాల్సిన ప్రాజెక్టుల నిర్మాణం కాలేదంటూ ఉద్యమం నుంచి చెప్పిన టీఆర్‌ఎస్.. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేసింది. దక్షిణ తెలంగాణకు పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లివ్వాలని, అటు ప్రాణహిత ప్రాజెక్టు, చనాఖా కొరాట ప్రాజెక్టుల ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు, సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు సాగునీరు ఇవ్వడంతో పాటుగా నిర్మాణంలో ఉన్న తుపాకులగూడెం బ్యారేజీ (సమ్మక్క బరాజ్), దేవాదుల రీడిజైన్‌ను చేపట్టారు.

అయితే తుమ్మడిహట్టి నుంచి నిర్మించాల్సిన కాళేశ్వరం, జూరాల నుంచి నీటిని తీసుకునే విధంగా ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను రీ డిజైనింగ్​చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును రీ డిజైనింగ్​చేసిన ప్రభుత్వం కేవలం మూడేండ్ల వ్యవధిలోనే తుది దశకు చేర్చింది. కానీ పాలమూరు రంగారెడ్డిని మాత్రం వదిలేసింది. జూరాల నుంచి నీటిని తీసుకుంటే రూ. 30 వేల కోట్లతో 120 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉండగా.. రాజకీయ కారణాలతో డిజైన్​ మార్చి శ్రీశైలానికి లింక్ పెట్టి రూ. 60 వేల కోట్లతో 60 టీఎంసీలకే పరిమితం చేశారనే విమర్శలు సైతం ఉన్నాయి.

రాష్ట్రంలో మొత్తం కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరందించడంలో ప్రధాన భూమిక కాళేశ్వరం ప్రాజెక్టు.. ఆ తర్వాత పాలమూరు–రంగారెడ్డిదే. కానీ కాళేశ్వరం 80 శాతం పూర్తి అయినా ఎకరా తడవడం లేదు. అటు పాలమూరు–రంగారెడ్డి బాలరిష్టాలు దాటడం లేదు. అయినా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులు పనులు ముందుకు పడటం లేదు. మరోవైపు శ్రీరాంసాగర్ పునరుజ్జీవ ప్రాజెక్టు ప్రతీ ఏడాది బడ్జెట్‌లో నిధులకే పరిమితమవుతోంది. కాళేశ్వరం నుండి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఇప్పటికే ఉన్న వరదకాల్వను బలోపేతం చేసి దానిని జలాశయంగా మార్చి మొత్తం శ్రీరాంసాగర్‌ ఆయకట్టును, ఆరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఈ పథకానికి రూపకల్పన చేశారు. కానీ ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఉమ్మడి పాలనలో తెలంగాణలో ప్రారంభించి వదిలేసిన 23 భారీ ప్రాజెక్టులు, 13 మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పినా.. ఒక్కటి కూడా పూర్తి కాలేదు.

డిజైన్లలో తప్పులు జరిగాయి : రంగారెడ్డి, నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్​

రాష్ట్రంలో రెండు ప్రధాన ప్రాజెక్టుల రీ డిజైన్లలోనే తప్పులు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టును వాస్తవానికి తుమ్మడిహట్టి దగ్గర నిర్మాణం చేస్తే అక్కడ నుంచి నీటిని బీడు భూములకు తరలించుకునే అవకాశం ఉండేది. అటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి నీటిని తీసుకోవాల్సింది పోయి శ్రీశైలం బ్యాక్ వాటర్‌కు లింక్​పెట్డడంతో వినియోగించుకునే సామర్థ్యం తగ్గింది. అటు కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్తగా సాగులోకి వచ్చింది ఏమీ లేదు. పాత ఆయకట్టునే చూసుకోవాల్సి వస్తోంది. ఈసారి ఎత్తిపోసింది కూడా తక్కువే. వర్షాలు పడటం, భూగర్భ జలాలు పెరుగడంతో సాగు విస్తీర్ణం పెరుగుతుందనేది గమనించాలి.

కమీషన్ల కోసం పని చేస్తున్నట్లు తేలుతోంది : చల్లా వంశీచంద్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలనుకోవడం కంటే ఎక్కడి నుంచి కమీషన్లు ఎక్కువ వస్తాయనే ధ్యాసతోనే ప్రభుత్వం ఉంది. అందుకే అటు పుష్కలంగా నీళ్లు ఉన్న గోదావరిని వినియోగించుకోకుండా ఉన్నాం. ఇటు వాటా ఉన్నా కూడా కృష్ణా నీళ్లను వాడుకోలేకపోతున్నాం. తక్కువ హక్కు ఉన్న ఏపీ ప్రాజెక్టులను స్పీడ్‌గా చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం నత్తనడకన పనులు సాగుతున్నాయి. ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్న ధ్యాస కంటే ముడుపుల మీదనే ఎక్కువ ధ్యాస ఉంది. కమీషన్ల కోసమే పని చేస్తున్నారు. అందుకే రైతులకు ఈ దుస్థితి వచ్చింది. అటు గోదావరి, ఇటు కృష్ణా నీళ్లను వాడుకోలేక పోతున్నాం. కానీ లక్షల కోట్లు మాత్రం ఖర్చు చేస్తూనే ఉన్నారు. అవి కాంట్రాక్టర్లకు.. అక్కడి నుంచి ప్రభుత్వానికి కమీషన్ల రూపంలో వస్తున్నాయి.

 

Tags:    

Similar News