టీడీపీలో మరో వికెట్ డౌన్… ముఖ్యనేత ఔట్?
దిశ, ఏపీ బ్యూరో: జ్యోతుల నెహ్రూ గురించి ఉభయగోదావరి జిల్లాలో తెలియనివారు ఉండరు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీలు మారినా ఆయన రాజకీయం మాత్రం ఎప్పుడూ సెపరేటుగానే ఉంటుంది. అయితే నెహ్రూ టీడీపీకి గుడ్‌బై చెప్పబోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. త్వరలోనే ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జ్యోతుల నెహ్రూ రాజకీయ విషయానికి వస్తే.. టీడీపీ, పీఆర్పీ, వైసీపీలలో కీలకంగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ […]
దిశ, ఏపీ బ్యూరో: జ్యోతుల నెహ్రూ గురించి ఉభయగోదావరి జిల్లాలో తెలియనివారు ఉండరు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీలు మారినా ఆయన రాజకీయం మాత్రం ఎప్పుడూ సెపరేటుగానే ఉంటుంది. అయితే నెహ్రూ టీడీపీకి గుడ్‌బై చెప్పబోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. త్వరలోనే ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జ్యోతుల నెహ్రూ రాజకీయ విషయానికి వస్తే.. టీడీపీ, పీఆర్పీ, వైసీపీలలో కీలకంగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో అన్నీ తానై వ్యవహరించారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేతగా వ్యవహరించారు. జగన్ పక్కనే కూర్చునేవారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016లో వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడ్డారు. అయితే చివరకు ఆయన తనయుడు జ్యోతుల నవీన్‌ను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠంపై కూర్చెబెట్టగలిగారు. అనంతరం 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఓటమి తర్వాత రాజకీయాల్లో దూకుడు తగ్గించారు. అంతేకాదు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. అంతేకాదు టీడీపీ ఉపాధ్యక్షుడు పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూనే ఉన్నారు. అధికార పార్టీపై టీడీపీ నేతలు విమర్శల దాడి చేస్తున్నా ఆయన నోరుమెదపడం లేదు.
అయితే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనను ఖండించిన తర్వాత మళ్లీ తెరపైకి రావడం లేదు. దీంతో టీడీపీకి గుడ్‌బై చెప్పాలనే యోచనలో జ్యోతుల నెహ్రూ ఉన్నారంటూ జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. వైసీపీలో చేరే అవకాశం లేకపోవడంతో.. జనసేన పార్టీలో చేరతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక తనయుడు జ్యోతుల నవీన్ టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున కాకినాడ లోక్‌సభ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నెహ్రూ పార్టీ మారితే ఆ ప్రభావం తనయుడి రాజకీయ జీవితంపై పడే అవకాశం ఉంది. దీంతో జనసేనలో చేరతారా? లేక కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం తటస్థంగా ఉంటారా? అన్నది తెలియాలంటే మరికొన్నిరోజులు వేచిచూడాల్సిందే.