మతం కాపాడింది.. మమ్మల్ని!

దిశ, వెబ్‌డెస్క్: ఈశాన్య ఢిల్లీలోని హింసాత్మక ఘటనల్లో రాళ్లు రువ్వడం, దుకాణాలు, వాహనాలు, ఇళ్లను తగులబెట్టడమే కాదు.. అనుమానం వచ్చిన ప్రతివ్యక్తిపై మూక దాడులు జరిగాయి. విధ్వంసాన్ని ఫొటో.. వీడియో తీస్తున్నట్టు సందేహం వచ్చినా సామాన్యులా? పాత్రికేయులా? అనే తేడా లేకుండా మూకలు చితకబాదాయి. రెండు, మూడు రోజులుగా ఈ ఘర్షణలను కవర్ చేస్తూ ఎదుర్కొన్న భయానక పరిస్థితులను, ఆందోళనకర విషయాలను కొందరు పాత్రికేయులు పంచుకున్నారు. దేశరాజధానిలో తాము ఇంతటి హింసను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఢిల్లీలోని […]

Update: 2020-02-26 02:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈశాన్య ఢిల్లీలోని హింసాత్మక ఘటనల్లో రాళ్లు రువ్వడం, దుకాణాలు, వాహనాలు, ఇళ్లను తగులబెట్టడమే కాదు.. అనుమానం వచ్చిన ప్రతివ్యక్తిపై మూక దాడులు జరిగాయి. విధ్వంసాన్ని ఫొటో.. వీడియో తీస్తున్నట్టు సందేహం వచ్చినా సామాన్యులా? పాత్రికేయులా? అనే తేడా లేకుండా మూకలు చితకబాదాయి. రెండు, మూడు రోజులుగా ఈ ఘర్షణలను కవర్ చేస్తూ ఎదుర్కొన్న భయానక పరిస్థితులను, ఆందోళనకర విషయాలను కొందరు పాత్రికేయులు పంచుకున్నారు. దేశరాజధానిలో తాము ఇంతటి హింసను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఢిల్లీలోని దిల్ కనుమరుగైందని వాపోయారు. ఆ భయానక పరిస్థితుల నుంచి తమ మతమే బయటపడేసిందని తెలిపారు.

రుద్రాక్ష కాపాడింది..

పాత్రికేయులు సౌరభ్ శుక్లా(ఎన్‌డీటీవీ), అరవింద్, రుంఝున్ శర్మ(సీఎన్ఎన్ న్యూస్ 18)లు ఈశాన్య ఢిల్లీలోని ఘర్షణలను కవర్ చేశారు. కరవాల్‌‌నగర్, గోకుల్‌పురిలో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో మీడియా సంస్థ కెమెరాలతో కాకుండా మొబైల్ ఫోన్లతో చిత్రాలు, వీడియోలు తీయాలని నిర్ణయించుకున్నారు. శుక్లా తాను ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని వివరిస్తూ ‘రాళ్లు, సీసా బాటిళ్లు, కర్రలను పట్టుకుని తిరుగుతున్న గుంపులు నిమిషాల్లోనే పెద్ద మూకగా మారుతున్నారు. ఇళ్లను, వాహనాలను తగలబెడుతున్నారు. మతపరమైన స్థలాలను ధ్వంసం చేస్తున్నారు. వారు మద్యాన్ని పుచ్చుకునే ఉన్నట్టున్నారు. పోలీసులు మాత్రం కనిపించలేర’ని తెలిపారు. ‘అప్పుడే సీలంపూర్‌లోని మతపరమైన కట్టడాన్ని ధ్వంసం చేస్తున్నారనే వార్త అందడంతో అక్కడికి బయల్దేరాం. దాదాపు 200 మంది అక్కడ ఆ కట్టడాన్ని ధ్వంసం చేయడంలో మునిగిపోయారు. అక్కడే కొంతమంది పోలీసులున్నారు గానీ, ఏమీ చేయట్లేదు. పక్కకి చూడగా.. 50 మీటర్ల దూరంలో అరవింద్‌ను ఓ 60 మంది చితకబాదుతున్నారు. అరవింద్ నేలపై పడి నోటిలో నుంచి నెత్తురు కక్కుతున్నాడు. మూడు పళ్లు ఊడిపోయాయి. వెంటనే పరుగెత్తికెళ్లి.. అతన్ని రక్షించే ప్రయత్నం చేశా. నాపైనా కర్రదెబ్బలుపడ్డాయి. అరవింద్ విదేశీ మీడియా ఏజెన్సీకి సంబంధించినవాడని చెప్పే ప్రయత్నం చేశా.. నా ఐడీ కార్డుపై ఉన్న ఇంటి పేరు ‘శుక్లా’ను ఒకతను చూశాడు. నేను బ్రాహ్మిణ్ అని ఇతరులకు చెప్పాడు. వెంటనే నా మతాన్ని నిరూపించుకునేందుకు రుద్రాక్షను చూపించాను. మనది ఒకే వర్గమైనప్పుడు ఈ వీడియోలు ఎందుకు తీస్తున్నావంటూ దూషిస్తూ నన్ను కొట్టారు. మమ్మల్ని వదిలిపెట్టాల్సిందిగా చేతులు జోడించి మేం ముగ్గురం వారిని వేడుకున్నాం. మా ఫోన్లు తీసుకుని ఫొటోలన్నీ తొలగించారు. మళ్లీ కనిపిస్తే చంపేస్తామని బెదిరించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ హెచ్చరించార’ని శుక్లా వివరించారు.

‘నువ్ జేఎన్‌యూ నుంచా?’

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ విలేకరి ఈ అల్లర్లను కవర్ చేయడానికి కరవాల్‌నగర్ చేరుకున్నాడు. రోడ్డుపై కొన్ని బేకరీ ఐటెమ్‌లు తగులబెడుతుంటే.. ఆ బేకరికి వెళ్లి వివరాలు సేకరిస్తుండగా.. బెదిరింపులు మొదలయ్యాయని శివ్ నారాయణ్ రాజ్‌పురోహిత్ తెలిపారు. ‘మధ్యాహ్నం సమయం సుమారు ఒకటవుతుంది. బేకరి వివరాలడుగుతుండగా నలభయ్యోపడిలో ఉన్న ఓ వ్యక్తి నేరుగా నా దగ్గరకొచ్చి ‘‘నువు ఎవరు? ఇక్కడేం చేస్తున్నావు?’’ అని అడిగాడు. జర్నలిస్టునని సమాధానం చెప్పాను. నా నోట్ బుక్ అడిగి తీసుకుని తరచిచూశాడు. కొన్ని ఫోన్ నెంబర్లు మినహా అనుమానాస్పద విషయాలేమీ లేవు అందులో. నా వైపు తిరిగి నువ్వు ఇక్కడి నుంచి రిపోర్టు చేయవద్దు అని ఆర్డర్ వేశాడు. నా నోట్‌బుక్‌ను ఆ మంటల్లోకి విసిరేశాడు. ఇంతలోనే ఓ యాభై మంది నా చుట్టూ మూగారు. ఫోన్ తీసుకున్నారు. అందులోనూ ఏమీ లేదు. కానీ, నా ఫొటోలు వీడియోలన్నీ డిలీట్ చేసి తిరిగిచ్చేశారు. ‘‘నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్? నువ్ జేఎన్‌యూ నుంచా? అని ప్రశ్నించారు. ఏ సమాధానానికి ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటానో నాకు తెలుసు. అక్కడి నుంచి 200 మీటర్ల దూరంలోని నా బైక్ దగ్గరకు వెళ్లగానే కర్రలు, రాడ్లు పట్టుకుని వస్తున్న మరో గుంపు నన్ను చుట్టేసింది. ఇక్కడి ఫొటోలు చిత్రిస్తున్నానని అందులో ఒకడు ఆరోపించాడు. ఇంకోడు ఫోన్ ఇవ్వమని అడిగాడు. ఇప్పుడే ఫొటోలు, వీడియోలన్నీ డిలీట్ చేశారని వెంటనే చెప్పా. వాడు నా వెనక్కి చేరి రాడ్‌తో తొడలపై రెండు దెబ్బలు వేశాడు. అంతలోనే ‘‘నీకు నీ ప్రాణం ముఖ్యమా? ఫోనా?’’ అని ఒకడు అరిచాడు. ఫోన్ వదిలిపెట్టగానే నవ్వుకుంటూ ఆ గుంపు మిగిలిన మూకలలో కలిసిపోయింది. తేరుకునేలోగానే ఇంకొందరు రౌండప్ చేశారు. 50 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి నా కళ్లద్దాలు తీసి కాళ్ల కింద నలిపేశాడు. మా వర్గం ప్రాబల్యమున్న ఈ ప్రాంతం నుంచి రిపోర్టింగ్ చేస్తావా? అంటూ రెండు చెంపదెబ్బలు కొట్టాడు. నా ప్రెస్ కార్డును చూస్తూ .. శివ్ నారాయణ్ రాజ్‌పురోహిత్.. ఓహో.. ఈ మతస్తుడివై బతికిపోయావ్ అని ఆ మూక అన్నది. కానీ, అంతటితోనే సంతుష్టిచెందలేదు. ఆ మతస్తుడేనని నిరూపించాలని తాపత్రయపడుతూ ఓ నినాదమివ్వాలని బెదిరించింది. అనంతరం బతుకుపోరా అని విడిచిపెట్టింది. ఇంకో మూక వస్తున్నది వెంటనే వెళ్లిపో అంటూ గుంపులో నుంచి ఓ గొంతు వినిపించింది. తొందరగా వెళ్లు.. లేదంటే వాళ్లు నిన్ను వదలరు.. అని హెచ్చిరించిందా గొంతు. అప్పుడు తెలిసొచ్చింది సెకన్ విలువ ఎంతటిదో! బండి కీ తీసి వెంటనే బయటపడ్డా..’ అని శివ నారాయణ్ శుక్లా వివరించారు. హింసాత్మక అల్లర్లను కవర్ చేయడానికి వెళ్లిన పాత్రికేయులు ఎదుర్కొన్న అతిభయానక పరిస్థితులను ఈ అనుభవాలు వివరిస్తున్నాయి.

Tags:    

Similar News