గజియాబాద్‌లో జర్నలిస్టు తలలో బుల్లెట్లు

లక్నో : ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్ పట్టణం గజియాబాద్‌లో సోమవారం రాత్రి ఓ జర్నలిస్టును దారుణంగా హత్య చేశారు. తన ఇంటికి సమీపంలోనే బైక్‌ను అడ్డుకుని కారు చాటుకు తీసుకెళ్లి తలలోకి బుల్లెట్లు దింపారు. దీంతో జర్నలిస్టు విక్రమ్ జోషి అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. రోడ్డుపైనే పడి ఉన్న తండ్రి మృతదేహంపై పడి కూతురు అరుస్తూ, ఏడుస్తూ సహాయం కోసం అర్థించిన దృశ్యం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. తన మేనకోడలిని కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారంటూ విక్రమ్ జోషి పోలీసులకు […]

Update: 2020-07-22 08:01 GMT

లక్నో : ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్ పట్టణం గజియాబాద్‌లో సోమవారం రాత్రి ఓ జర్నలిస్టును దారుణంగా హత్య చేశారు. తన ఇంటికి సమీపంలోనే బైక్‌ను అడ్డుకుని కారు చాటుకు తీసుకెళ్లి తలలోకి బుల్లెట్లు దింపారు. దీంతో జర్నలిస్టు విక్రమ్ జోషి అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. రోడ్డుపైనే పడి ఉన్న తండ్రి మృతదేహంపై పడి కూతురు అరుస్తూ, ఏడుస్తూ సహాయం కోసం అర్థించిన దృశ్యం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. తన మేనకోడలిని కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారంటూ విక్రమ్ జోషి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.

సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో విక్రమ్ జోషి తన ఇద్దరు కూతుళ్లతో బైక్‌ పై ప్రయాణిస్తుండగా కొందరు దుండగులు అతన్ని అడ్డగించారు. బైక్ కిందపడగానే ఇద్దరు కూతుళ్లు భయంతో పక్కకు పరిగెత్తారు. కాగా, అతన్ని స్పాట్‌లోనే పట్టుకుని కారు చాటుకు తీసుకెళ్లిన దుండగులు తుపాకీతో పాయింట్ బ్లాక్‌లో కాల్పులు జరిపారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారవ్వగా.. కింద పడిపోయిన విక్రమ్‌ దగ్గరికి ఒక కూతురు పరుగెత్తికొచ్చి సహాయం కోసం అభ్యర్థించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేశామని, మరొకడు పరారీలో ఉన్నాడని తెలిపారు. ప్రధాన నిందితులు రవి, చోటుల నుంచి ఆయుధాన్నీ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసుల అలసత్వంవల్లే విక్రమ్ జోషి ప్రాణాలర్పించుకోవాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఓ మూక అతని బంధువును వేధిస్తున్నారని.. ఘటన జరిగిన నాలుగు రోజుల ముందే ఫిర్యాదు చేయగా, పోలీసులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ దారణం చోటుకుందని వారు తెలిపారు.

ఈ ఘటనపై ప్రతిపక్షాలు యోగి సర్కారు పై విమర్శనాస్త్రాలు సంధించాయి. వేధింపులు అడ్డుకోవాలని ఫిర్యాదు చేయడం వల్లే జర్నలిస్టు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, పాలకులు రామరాజ్యాన్ని హామీనిచ్చి గూండా రాజ్యాన్ని అందించారని రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ ఘటనలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందింస్తూ.. జర్నలిస్టు తన మేనకోడలిని వేధించారని ఫిర్యాదు చేసినందుకే హత్యకు గురయ్యారని, దేశమంతా ఒకరకమైన భయానక వాతావరణాన్ని కల్పించారని ట్వీట్ చేశారు.

నిరసనకు దిగిన గొంతులను అణచివేస్తున్నారని, ఇందులో మీడియాకూ మినహాయింపులేకపోవడం షాకింగ్‌గా ఉన్నదని తెలిపారు. మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, రాష్ట్రంలోని ఆటవిక పాలనను ఇవి ఎత్తిచూపెడుతున్నాయని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. ఢిల్లీ సమీపంలోని ఎన్‌సీఆర్ రీజియన్‌లో ఉండే గజియాబాద్‌లోనే ఇలా ఉంటే, రాష్ట్రవ్యాప్త పరిస్థితులను అర్థం చేసుకోవచ్చునని.. ఆటవిక పాలన అమలులో ఉండగా సాధారణ పౌరుడు ఎలా ధైర్యంగా ఉండగలడని ప్రశ్నిస్తూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News