జేసీ దారెటు..?

          ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి కీలక నేత. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో అయినా.. ఏదైనా విషయాన్ని సూటిగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో అయినా ఆయనకు ఆయనే సాటి. సొంత పార్టీపైనే విమర్శలు చేయగల ధైర్యం ఆయన సొంతం. పార్టీ అధినేతపై విమర్శలు గుప్పించి మచ్చిక చేసుకోవాలన్నా.. ప్రత్యర్థిపై తీవ్ర విమర్శలు సెటైరికల్‌గా వేయడంలో అయినా జేసీ దివాకర్ రెడ్డిది ప్రత్యక శైలి. అలాంటి దివాకర్ రెడ్డి గతకొంతకాలంగా రాజకీయంగా […]

Update: 2020-02-11 01:03 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి కీలక నేత. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో అయినా.. ఏదైనా విషయాన్ని సూటిగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో అయినా ఆయనకు ఆయనే సాటి. సొంత పార్టీపైనే విమర్శలు చేయగల ధైర్యం ఆయన సొంతం. పార్టీ అధినేతపై విమర్శలు గుప్పించి మచ్చిక చేసుకోవాలన్నా.. ప్రత్యర్థిపై తీవ్ర విమర్శలు సెటైరికల్‌గా వేయడంలో అయినా జేసీ దివాకర్ రెడ్డిది ప్రత్యక శైలి. అలాంటి దివాకర్ రెడ్డి గతకొంతకాలంగా రాజకీయంగా గడ్డుకాలన్ని ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఆయన ప్రస్తుతం ఏం చేయబోతున్నారు?…

రాయలసీమలోని కీలక నేతల్లో జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. పార్టీ ఏదైనా, ముఖ్యమంత్రి ఎవరైనా రాయలసీమలో ప్రధానంగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఆయన చెప్పిందే వేదం, చేసిందే న్యాయం. అక్కడ జేసీకి ఎదురేలేదని పేరు. అలాంటి జేసీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన వ్యాపారాల్లోని అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మొన్నటికి మొన్న ఆయన మైన్స్ పేరిట తీసుకున్న కేటాయింపుల్లో పరిశ్రమ ప్రారంభించలేదన్న కారణంగా ఆ కాంట్రాక్టును రద్దు చేసింది. అంతటితో ఆగకుండా అక్కడి ముడి సరకు ఎలా రవాణా అయింది? ఎంత రవాణా అయింది? వంటి వాటిపై విచారణ చేస్తోంది.

రవాణా రంగంలో జేసీ ట్రావెల్స్‌కి సుదీర్ఘ అనుభవముంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల వాసులకు దివాకర్ ట్రావెల్స్ బాగా పరిచయమున్న పేరు. గతంలో ఒక యాక్సిడెంట్ కారణంగా ఆ ట్రావెల్స్‌కు ఇంకా పెద్ద పేరొచ్చిందనుకోండి అది వేరే విషయం. అలాంటి ట్రావెల్ బిజినెస్‌పై ఏపీ ప్రభుత్వం గురిపెట్టింది. అంతటితో ఆగని ఏపీ రవాణాశాఖ దివాకర్ ట్రావెల్స్‌లో కొన్ని బస్సులు ఒకే నంబర్‌తో నడుస్తున్నాయని గుర్తించారు. ఇది తీవ్రమైన నేరమని పేర్కొంటున్నారు. అలాగే లేలాండ్ కంపెనీ నుంచి స్క్రాప్ బస్సులను కొనుగోలు చేసి, ఈశాన్య రాష్ట్రాల్లో ట్రావెల్స్‌గా తిప్పుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై దర్యాప్తు ప్రారంభమైంది.

ప్రభుత్వ ఆరోపణలు నిజమని నిరూపణ అయితే జేసీ దివాకర్ రెడ్డి ఆర్థిక మూలాలపై దెబ్బపడినట్టే. మరోవైపు జేసీ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఆయనకు వ్యక్తిగతంగా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుందని ఆయన అనుయాయులు ఆందోళన చెందుతున్నారు. అయితే జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఏపీ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోబోతున్నారని మరికొందరు అంటున్నారు. ఇకపోతే గతంలో జేసీ రాజకీయం బాగా తెలిసిన వ్యక్తి అని వైఎస్సార్సీపీని ఎలా మచ్చిక చేసుకోవాలో ఆయనకు తెలుసన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా మెలిగారు. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రాజశేఖరరెడ్డి మరణానంతరం జేసీ రాజకీయ జీవితం సమాధిగా మారుతుందని అంతా భావించారు.

అందరి అంచనాలను తల్లికిందులు చేస్తూ ఆయన టీడీపీలో చేరారు. టీడీపీలో చేరడంతోనే ఆ పార్టీకి రాయలసీమలో కీలక నేతగా మారారు. రాయలసీమలో బాబు గొంతులా జేసీ పని చేశారన్న పొగడ్తలు గతంలో తరచూ వినిపించేవి. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ అధినేత జగన్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేసేవారు. సందర్భం ఏదైనా జగన్‌ను ఎద్దేవా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో రాజకీయ విమర్శలతో పాటు, వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. దీనివల్లే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో ఆయన గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

గత ఎన్నికలకు ముందుగా ఆయన రాజకీయాల్లో ఇంకా కొనసాగలేనని, తన వారసులే రాజకీయాల్లో కొనసాగుతారని చెబుతూ తన కుమారుడు పవన్ రెడ్డిని నియోజకవర్గానికి పరిచయం చేశారు. ఇక రాజకీయ జీవితం నుంచి వైదొలగుతానని అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారమే ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని నమ్మిన నేతల్లో జేసీ ఒకరు. పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభకు వెళ్లడం ఖాయమని కూడా ఆయన అనుచరులు అంచనాలు వేశారు. రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రకటించినప్పటికీ ఆయన రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. చంద్రబాబునాయుడుతో సత్సంబంధాలు నెపారు. ఏపీసీఎంపై విమర్శలు చేయడంతో పాటు ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలిగారా? లేదా? అన్న అనుమానం అందర్లోనూ కలుగుతోంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తన మనసు మార్చుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో మరోసారి సత్తాచాటాల్సిందేనా? లేక గతంలో ఆయన ఆడిన మాట ప్రకారం తన వారసులను మాత్రమే రాజకీయాల్లో కొనసాగిస్తారా? లేక ఆయనే మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా? అన్న చర్చ అనంతపురంలో ఊపందుకుంటోంది.

ఏపీలో సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన జేసీ దివాకర్ రెడ్డికి రాజకీయ సంక్షోభాలను ఎదుర్కోవడం వెన్నతోపెట్టిన విద్య అని ఆయన గురించి తెలిసిన వారు పేర్కొంటున్నారు. గతంలో జగన్‌ను ఆర్థిక నేరగాడంటూ జేసీ పలుమార్లు ఎద్దేవా చేసిన నేపథ్యంలో ఆయన ఎంత న్యాయంగా రాజకీయాలు చేశారో ప్రజలకు వెల్లడించేందుకే ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Tags:    

Similar News