జనతా గ్యారేజ్.. ఇచ్చట ఎవరికీ బిజినెస్ లేదు
దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. ఇప్పటి వరకు ఎందరో ఉద్యోగాల్ని కోల్పోయారు. ఇంకెందరో ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. అలాంటి కోవలోనే మెకానిక్ షాపులు వచ్చి చేరాయి. మెకానిక్ షాపుల యజమానుల నుంచి మొదలు పనిచేసే సిబ్బంది వరకు అందరిదీ కన్నీటి గాథే. పని చేసుకుందామని షాపు తెరిస్తే లాక్ డౌన్ కారణంగా రిపేర్లకు ఎవరూ ముందుకు రావడంలేదు. ప్రజల ఆర్థిక పరిస్థితులకు దెబ్బ పడటం కూడా వీరిని మరింత కష్టాల్లోకి […]
దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. ఇప్పటి వరకు ఎందరో ఉద్యోగాల్ని కోల్పోయారు. ఇంకెందరో ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. అలాంటి కోవలోనే మెకానిక్ షాపులు వచ్చి చేరాయి. మెకానిక్ షాపుల యజమానుల నుంచి మొదలు పనిచేసే సిబ్బంది వరకు అందరిదీ కన్నీటి గాథే. పని చేసుకుందామని షాపు తెరిస్తే లాక్ డౌన్ కారణంగా రిపేర్లకు ఎవరూ ముందుకు రావడంలేదు. ప్రజల ఆర్థిక పరిస్థితులకు దెబ్బ పడటం కూడా వీరిని మరింత కష్టాల్లోకి నెట్టాయి. దీంతో కుటుంబ పోషణ భారమై ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం షాపులకు అద్దె చెల్లించాలన్నా కూడా డబ్బులు చాలక మెకానిక్ లు సతమతమవుతున్నారు.
ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు కల్పించిన సమయంలోనే కాస్తో కూస్తో.. పని దొరికిందని, సడలింపు సమయం మధ్యాహ్నం 1 గంటల వరకు పెంచడంతో ఉన్న పని కాస్త దూరమైందని పలువురు మెకానిక్ లు చెప్పడం గమనార్హం. కరోనా లేని సమయంలో రోజుకు సగటున రూ.1500 సంపాదిస్తే ప్రస్తుతం రూ.400 నుంచి రూ.600 సంపాదించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు.
కుటుంబ పోషణ భారం
పానలు చేతపట్టి పనిచేస్తే కానీ పూట గడవని కుటుంబాలు మెకానిక్ లవి. అలాంటిది కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో షాపులు మూతపడ్డాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన సమయంలో కొంత వ్యాపారం జరిగినా ఇటీవల సడలింపు సమయాన్ని మధ్యాహ్నం ఒంటిగంట వరకు పెంచడంతో రిపేర్లకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయిందని మెకానిక్ లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సమయం తక్కువ ఉన్న సమయంలో ఏ ఏరియా పరిధిలోని షాపు ఉంటే అక్కడికి వెళ్లి ప్రజలు రిపేర్ చేయించుకున్నారు. సమయం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక వాహనాన్ని రిపేర్ చేస్తుంటే కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఆగకుండా ఇతర ఏరియాలకు వెళ్తున్నారు. తద్వారా కుటుంబ పోషణ భారమైంది. వేరే పనికి వెళ్దామన్నా కరోనా కారణంగా ఎవరూ రానివ్వడం లేదని, వెళ్తే తమకు ఎక్కడ అంటుకుంటుందోనని భయంతోరే మెకానిక్ లు ఎవరూ వెళ్లేందుకు ఇష్టపడటం లేదని వారు చెబుతున్నారు. కష్టమో.., నష్టమో.., వచ్చిన పనిని చేస్తూ కాలం వెళ్లదీస్తున్నట్లు వారు చెబుతున్నారు.
అద్దె చెల్లించేందుకూ ఇబ్బందులు
కరోనా కాలంలో రిపేర్లకు వాహనాలు రాక మెకానిక్ ల ఆదాయం భారీగా పడిపోయింది. కనీసం షాపు అద్దె చెల్లించేందుకు కూడా డబ్బులు లేని దీనస్థిని వారు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కుటుంబ పోషణకు అప్పుల్ల కూరుకుపోయినట్లు వారు చెబుతున్నారు. తమ బాధలను చూసైనా షాపు యజమానులు కాస్త చలించి లాక్ డౌన్ పూర్తయ్యే వరకు అద్దె అడగకుండా ఉంటే బాగుంటుందని వారు కోరుతున్నారు. కనీసం అద్దె తగ్గించినా తమకు కొంత స్వాంతన లభించే అవకాశముందని యజమానులను వారు వేడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యజమానులు పెద్ద మనస్సుతో కనికరిస్తే తమకు మేలు చేసినవారవుతారని మెకానిక్ లు చెబుతున్నారు.
సిబ్బందికి ఇచ్చేందుకూ డబ్బుల్లేవు..
కరోనా లేని సమయంలో మెకానిక్ షాపుల్లో పనిచేసే సిబ్బందికి పలుచోట్ల నెలకు కొంత మొత్తంలో నిర్వాహకులు వేతనాల రూపంలో అందించేవారు. మరికొన్ని ప్రాంతాల్లో రోజూవారీగా రూ.400 నుంచి రూ.600 వరకు అందించేవారు. అయితే కొవిడ్ ప్రభావంతో షాపుల్లో పనిచేసే సిబ్బంది జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి. వ్యాపారం లేక కొన్నిచోట్ల వారిని తొలగించాల్సి వచ్చింది. దీంతో సిబ్బంది జీవితాలు రోడ్డునపడాల్సి వచ్చింది. కొన్నిచోట్ల తమవద్ద సిబ్బంది ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారన్న సానుభూతితో నిర్వాహకులు రోజూ పనికి పిలిచి వచ్చిన కొంతలో ప్రతిరోజు రూ.200 వరకు చెల్లిస్తున్నారు. ఒక్కోసారి జేబులో నుంచి తీసి సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. లేదంటే లాక్ డౌన్ అనంతరం తమకు నమ్మకస్తులు దొరికే అవకాశం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదీ ఒక కారణమైతే, ఇలాంటి క్లిష్ట సమయంలో వారి జీవితాలను నిలబెట్టిన వారమవుతామని కూడా నిర్వాహకులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
షాపులు బంద్ పెట్దినా ఇబ్బందే..
లాక్ డౌన్ సమయంలో ఎలాగూ గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నామని షాపులు బంద్ చేసినా తమకు కష్టాలు తప్పవని పలువురు మెకానిక్ షాపుల నిర్వాహకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలా చేయడం ద్వారా తమకు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లు తమవద్ద కాదని ఇతర మెకానిక్ సెంటర్లను ఆశ్రయించే అవకాశముందని వారు చెబుతున్నారు. అందుకే కష్టమో.., నష్టమో.., వారికోసమైనా ఇబ్బందులు పడుతూ షాపులు తెరుస్తున్నట్లు వారు చెబుతున్నారు. షాపులు మూయడం వల్ల తమకు వచ్చిన బిజినెస్ ను కూడా చేతులారా దెబ్బతీసుకుంటున్నట్లే అని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడం వల్ల పలువురి షాపులు పూర్తిగా మూతపడినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
ఆటోమొబైల్స్ పరిస్థితీ అంతంతే..
మెకానిక్ షాపులు, ఆటో మొబైల్స్ రంగం రెండూ ఒకదానిమీద ఒకటి ఆధారపడి కొనసాగుతాయి. వాహనాలు రిపేర్లు చేయించుకునేందుకు ప్రజలు ముందుకు రాకపోతే మెకానిక్ లోతో పాటు పరోక్షంగా ఆటో మొబైల్ రంగం కూడా దెబ్బతిన్నట్లే. ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో స్పేర్ పార్ట్స్ కూడా అమ్ముడుపోక ఆటో మొబైల్ రంగాలవారు కూడా నష్టాలను చవిచూస్తున్నారు. ఆటోమొబైల్స్ కు గతంలో రోజుకు సుమారు రూ.2000 వరకు వచ్చేది. అయితే ఇప్పుడు మాత్రం తమ ఖర్చులకు మాత్రమే సరిపోతున్నట్లు వారు చెబుతున్నారు. సడలింపు సమయం పెంచడం తమను మరింత కష్టాల్లో పడేశాయని వారు ఆవేదన చెందుతున్నారు.
రూ.400 కూడా రావడంలేదు
కరోనాకు ముందు గిరాకీ మంచిగా ఉండేది. చాలా వాహనాలు రిపేర్లకు వచ్చేవి. అప్పుడు రోజుకు రూ.1000 వరకు వచ్చేవి. కరోనా కారణంగా రిపేర్లకు ఎవరూ రావడం లేదు. ప్రజలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా రిపేర్లకు ఎలా వస్తారు. లాక్ డౌన్ తో సమయం కుదించడం వల్ల గిరాకీ దెబ్బతిన్నది. రోజుకు కనీసం రూ.400 కూడా వస్తలేవు. వాటితో బతికేదెలా. కుటుంబాన్ని పోషించేదెలా.
– అనిల్, మెకానిక్ షాపు యజమాని, యూసుఫ్ గూడ
మూడు నెలలుగా అద్దె చెల్లించలేదు..
లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గింది. రిపేర్లకు వచ్చే వారు కూడా ఎవరూ రావడంలేదు. గతేడాది మార్చి నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా. గత మూడు నెలలుగా అద్దె చెల్లించేందుకు కూడా డబ్బులు లేవు. యజమానులు అద్దె చెల్లించాలని, లేదంటే ఖాళీ చేసి వెళ్లాలని సూచిస్తున్నారు. యజమానులు పరిస్థితులను అర్థం చేసుకొని అద్దె మినహాయించినా, తగ్గించినా కొంత ఉపశమనం లభిస్తుంది.
– సందీప్, బైక్ మెకానిక్, యాదగిరి నగర్
సడలింపు సమయం పెంచడంతో మరిన్ని ఇబ్బందులు
కరోనా కేసులు తగ్గాలని ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం మంచిదే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపులు ఇవ్వడం కూడా మంచిదైంది. అలా కొంత వైరస్ ను తగ్గించొచ్చు. ఆ సమయంలో బిజినెస్ కూడా మంచిగానే నడిచింది. కానీ ఎప్పుడైతే సడలింపు సమయం పెంచారో అప్పటి నుంచి ఇబ్బందులు ఎక్కువయ్యాయి. రిపేర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. లాస్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం.
– నవీన్, ఆటోమొబైల్ షాపు యజమాని, కృష్ణానగర్