టీడీపీ అధికారంలోకి రాదు: నాగబాబు
దిశ, ఏపీ బ్యూరో: ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో హల్‌చల్ చేస్తున్న జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు ఈ సారి జ్యోతిష్యుడి అవతారమెత్తారు. ట్విట్టర్ మాధ్యమంగా ఫ్యాన్ బేస్ ఎటూ చెదిరిపోకుండా వివాదాస్పద ట్వీట్లతో సోషల్ మీడియాలో నాగబాబు వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. తొలుత ప్రజారాజ్యంలో, ఇప్పుడు జనసేనలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన నాగబాబు… గాడ్సే వాదన వినలేదంటూ ట్వీట్ చేసి కలకలం రేపారు. ఆ తరువాత స్వాతంత్ర్య సమర యోధులతో పాటు, […]
దిశ, ఏపీ బ్యూరో: ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో హల్‌చల్ చేస్తున్న జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు ఈ సారి జ్యోతిష్యుడి అవతారమెత్తారు. ట్విట్టర్ మాధ్యమంగా ఫ్యాన్ బేస్ ఎటూ చెదిరిపోకుండా వివాదాస్పద ట్వీట్లతో సోషల్ మీడియాలో నాగబాబు వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. తొలుత ప్రజారాజ్యంలో, ఇప్పుడు జనసేనలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన నాగబాబు… గాడ్సే వాదన వినలేదంటూ ట్వీట్ చేసి కలకలం రేపారు.
ఆ తరువాత స్వాతంత్ర్య సమర యోధులతో పాటు, సావర్కార్, అబ్దుల్ కలాం, వాజ్ పేయిలను కరెన్సీ నోట్లపై ముద్రించాలంటూ ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌తో మీటింగ్‌పై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో విభేధించి, ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నాగబాబు.. ఇప్పుడు టీడీపీ లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 2024లో జరిగే తదుపరి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, లేదా జనసేన, లేదా బీజేపీలలో ఏదో ఒకపార్టీ అధికారంలోకి వస్తుందని జ్యోతిష్యం చెప్పారు.
దీనిని కాలమే నిర్ణయిస్తుందన్న ఆయన, టీడీపీ మాత్రం కచ్చితంగా అధికారంలోకి రాదని తేల్చి చెప్పారు. ఎందుకంటే తెలుగుదేశం హయాంలో రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. అభివృద్ధి అంతా టీవీ, పేపర్లలోనే కనిపించిందన్న ఆయన, నిజంగా టీడీపీ చేసింది చాలా తక్కువ అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏమీ చేయనందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామనే విషయాన్ని ఆ పార్టీ గుర్తించాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మేమే వస్తాం అనే భ్రమల్లోంచి బయటపడాలని సూచించారు. అలా కాకుండా కలల్లోనే జీవిస్తాం అంటే తాము చేయగలిగిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితిని మానసికశాస్త్రంలో హెల్యూజినేషన్స్ అని అంటారని, ‘ఆల్ ది బెస్ట్ ఫర్ హెల్యూజినేషన్స్..’ అని టీడీపీకి నాగబాబు శుభాకాంక్షలు కూడా చెప్పారు.