ప్రముఖ సాహితీవేత్త జలజం.. ఇక లేరు

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : తెలంగాణ ఉద్యమ నేత జలజం సత్యనారాయణ (90) గురువారం తెల్లవారుజామున మరణించారు. కొన్ని నెలలుగా అమెరికాలో ఉన్న జలజం సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. ఇక ఎంత వైద్యం చేసినా ఫలితం లేదని డాక్టర్లు చెప్పడంతో పది రోజుల క్రితం మహబూబ్ నగర్ లో ఉన్న ఇంటికి చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఉపాధ్యాయునిగా.. జలజం సత్యనారాయణ ఉపాధ్యాయునిగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని […]

Update: 2021-11-04 01:02 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : తెలంగాణ ఉద్యమ నేత జలజం సత్యనారాయణ (90) గురువారం తెల్లవారుజామున మరణించారు. కొన్ని నెలలుగా అమెరికాలో ఉన్న జలజం సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. ఇక ఎంత వైద్యం చేసినా ఫలితం లేదని డాక్టర్లు చెప్పడంతో పది రోజుల క్రితం మహబూబ్ నగర్ లో ఉన్న ఇంటికి చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఉపాధ్యాయునిగా..
జలజం సత్యనారాయణ ఉపాధ్యాయునిగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ఆరంభించారు. అనంతరం ఆయన జూనియర్, డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పని చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగి పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో ఆయన విద్య పై ఉన్న మమకారంతో మహబూబ్ నగర్ లో న్యూ విజన్ జూనియర్ కళాశాల, లిటిల్ స్కాలర్స్ పాఠశాలలను ఆరంభించారు.
తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు.

కాళోజీ, వరవరరావు తో ప్రత్యేక అనుబంధం..
ప్రముఖ సాహితీవేత్త కాళోజీ నారాయణరావు, విప్లవ రచయితల సంఘ నేత వరవరరావు తో జలగం సత్యనారాయణకు విడదీయరాని అనుబంధం ఉండేది. కాళోజీ రచించిన ప్రసిద్ధ కవితా సంపుటి నా గొడవ పుస్తకాన్ని జడ్చర్లలో ప్రత్యేక సభను ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. వరవరరావు, కాళోజీని పలుమార్లు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఆహ్వానించి అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహించారు.

సాహితీవేత్తగా..

జలజం సత్యనారాయణ సాహితీవేత్తగా రాణించి నేటి తరానికి మార్గదర్శకులుగా నిలిచారు. మొదట్లో ఆయన అనల అనే కవితా సంకలనాన్ని రచించి ఆవిష్కరింపజేశారు. ప్రముఖ హిందీ రచయిత జయ శంకర ప్రసాద్ రచించిన ‘ఆంసు’ కవితా సంకలనాన్ని తెలుగులో ‘వేదన’ పేరుతో అనువదించారు. దివంగత ప్రధాని, వాజ్ పేయి కవితా సంకలనాన్ని శిఖరం పేరుతో తెలుగులోకి అనువదించారు. కబీర్ దాస్, బిల్హణ రచనలను తెలుగులోకి అనువదించారు. ఇలా వివిధ భాషలలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖుల రచనలను తెలుగులోకి అనువాదం చేస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు సృజన, ధ్వని పత్రికలను నడిపారు.

టీఆర్ఎస్ స్టీరింగ్ కమిటీ సభ్యునిగా..
టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు అప్పట్లో కేసీఆర్ ఏర్పాటు చేసిన 42 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులలో జలజం సత్యనారాయణ ఒకరు. 1984 లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన మొదట్లో ఎన్టీ రామారావు స్వయంగా జలజం సత్యనారాయణను ఆహ్వానించి మహబూబ్ నగర్ శాసనసభ్యునిగా పోటీ చేయమని కోరారు. అప్పుడు ఉన్న కుటుంబ సమస్యల కారణంగా ఎన్టీరామారావు విజ్ఞప్తిని జలజం సున్నితంగా తిరస్కరించారు. 2005 వ సంవత్సరంలో మక్తల్ నియోజకవర్గం లో చిట్టెం నర్సిరెడ్డి హత్య తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీసీ సంఘాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ప్రముఖుల సంతాపం..
జలజం సత్యనారాయణ మరణించారని తెలియగానే పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ప్రముఖ న్యాయవాది బెక్కం జనార్దన్, సాహితీవేత్తలు లుంబిని లక్ష్మణ్ గౌడ్, రామ్మోహన్, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ బీమ్ పల్లి శ్రీకాంత్, చక్రవర్తి గౌడ్, ఆయా విద్యా సంస్థల నిర్వాహకులు రమేష్ గౌడ్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు పాపిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, మల్లేష్, తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సమాజానికి, సాహితీలోకానికి తీరనిలోటని వారు పేర్కొన్నారు. జలజం సత్యనారాయణ అంత్యక్రియలు శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరగనున్నాయి. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News