నల్లమలలో విష వాయువులు?.. ఓయూ సర్వేలో నిజమెంత..

దిశ ప్రతినిధి, నల్లగొండ : నల్లమల అటవీ ప్రాంతం మరోసారి ఉలిక్కిపడింది. యురేనియం తవ్వకాలు నల్లమల ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయనే మాట ముమ్మాటికీ వాస్తవం. నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టాలని గత 40 ఏండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు స్థానిక ప్రజలు, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు తిప్పికొడుతున్నాయి. 2019లోనూ అటవీ ప్రాంతంలోని గిరిజనులను అక్కడి నుంచి మైదాన ప్రాంతానికి తరలించి అక్కడి యురేనియం నిక్షేపాలను గుట్టుచప్పుడు కాకుండా తవ్వుకోవాలనే […]

Update: 2021-05-25 23:49 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ : నల్లమల అటవీ ప్రాంతం మరోసారి ఉలిక్కిపడింది. యురేనియం తవ్వకాలు నల్లమల ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయనే మాట ముమ్మాటికీ వాస్తవం. నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టాలని గత 40 ఏండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు స్థానిక ప్రజలు, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు తిప్పికొడుతున్నాయి. 2019లోనూ అటవీ ప్రాంతంలోని గిరిజనులను అక్కడి నుంచి మైదాన ప్రాంతానికి తరలించి అక్కడి యురేనియం నిక్షేపాలను గుట్టుచప్పుడు కాకుండా తవ్వుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి.

ప్రజల ప్రతిఘటనతో అప్పట్లో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. కానీ ఈసారి పెనుప్రమాదం ఉందనే ప్రచారంతో ప్రజల్లో అలజడిని సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతం నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని చిత్రియాల పరిసర ప్రాంతాల్లో విషపువాయువులు ఉన్నాయనే సరికొత్త ప్రచారం తెరలేచింది. ఆ విషపు వాయువులను పీల్చుకోవడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారనే నివేదికలు తాజాగా బయటకు వచ్చాయి. అయితే నిజంగా ఆ నివేదికల్లో ఉన్న వాస్తవమెంత అనేది బహిర్గతం కావాల్సి ఉంది.

అసెంబ్లీలో యురేనియంపై తీర్మానాలు చేసినా..

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిల్వలు పెద్దమొత్తంలో ఉన్నట్టు కేంద్ర అణుసంస్థ పసిగట్టింది. ఆ క్రమంలోనే యురేనియాన్ని తవ్వుకునేందుకు కొన్నేండ్లుగా సర్వేలు చేస్తోంది. అయితే సరిగ్గా 2019 సంవత్సరంలో మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతంలో భారీగా ఏరియల్ సర్వే చేశారు. పెద్ద యంత్రాలతో బోర్లు వేసి నమూనాలను సేకరించారు. ఆ సర్వేలో వచ్చిన ఫలితంగానే చందంపేట మండలం చిత్రియాల్ కేంద్రంగా తవ్వకాలు చేపట్టాలని కేంద్రం భావించింది. కానీ ఆ ప్రయత్నాలను స్థానిక గిరిజన సంఘాలు, మేధావులు, అఖిలపక్షాలు తిప్పికొట్టాయి.

యురేనియం అన్వేషణలకు వ్యతిరేకంగా ఏకంగా అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా విషవాయువుల పేరుతో కొత్త డ్రామాకు తేరలేపారనే ఆరోపణలు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. యురేనియం తవ్వకాలు స్వేచ్ఛగా చేపట్టాలంటే స్థానిక ప్రజలను అక్కడి నుంచి తరలించాల్సి ఉంది. అందులో భాగంగానే చిత్రియాల్ పరిసర గ్రామాల్లో రేడాన్, థోరాన్ వాయువులు పరిమితికి మించి ఉన్నాయనే ప్రచారానికి తెరలేపారు. దీన్ని నిజమని బలంగా చెప్పేందుకు ఓయూ నిపుణుల బృంద అధ్యయనం, ప్రఖ్యాత సైన్స్ జర్నల్ నేచర్ ప్రచురించిన కథనాలను ముందుకు తెస్తున్నారు.

ఉస్మానియా నివేదికపై అనుమానాలు..

నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంగా ఉన్న చందపేట మండలం చిత్రియాల, బుడ్డోనితండాతో సహా తొమ్మిది గ్రామాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం పలు అంశాలపై పరిశోధన చేసిందని చెబుతోంది. ఈ పరిశోధనలో తొమ్మిది గ్రామాల్లో రేడాన్, థోరాన్ వాయువులు పరిమితికి మించి ఉన్నాయని తమ అధ్యయనంలో ఈ బృందం తేల్చింది. వాస్తవానికి ఓయూ ఈ పరిశోధనను అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ అధికారుల కోరిక మేరకు 2016 నవంబరు నుంచి 2017 అక్టోబర్ వరకు సంవత్సరం పాటు జరిపింది. అంటే ఈ పరిశోధన ముగిసి దాదాపు నాలుగేండ్లు గడిచింది.

నిజంగా చిత్రియాల్, బుడ్డోనితండా పరిసర ప్రాంతాల్లో ఉస్మానియా యూనివర్సిటీ, సీబీఐటీ శాస్త్రవేత్తలు చేసిన సర్వేలో చెప్పినట్లు ప్రమాదకర స్థాయిలో నిజంగానే థోరాన్, రేడాన్ అణుధార్మిక వాయువులు ఉంటే 2017 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు నివేదిక ఇవ్వలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. వారి సర్వే నిజమైతే ఆరోగ్య శాఖకు రిపోర్ట్ ఇచ్చి ప్రజల ప్రాణాల రక్షణ కోసం తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదు. హైదరాబాద్‌లోని ఆటమిక్ మినరల్ డైరెక్టరేట్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఇక్కడి ప్రభుత్వాలకు ఎందుకు తెలియచేప్పలేదు. ప్రజల ప్రాణాల పట్ల ఆ సంస్థ ఎందుకంత బాధ్యతా రహితంగా వ్యవహరించింది అనే ప్రశ్నలు ఉత్పన్నం కావడం గమనార్హం.

పరిమితికి మించితే ఏం జరుగుతుందంటే..

వాస్తవానికి రేడాన్ వాయువు ప్రతీ ఘనపు మీటరుకు 40 బెక్యూరల్స్‌ను మించొద్దు. కానీ నల్లమలలో 94 బెక్యూరల్స్‌గా ఉన్నట్టు చెబుతున్నారు. అదే థోరాన్ వాయువు సైతం ప్రతీ ఘనపు మీటరుకు 10 బెక్యూరల్స్‌కు మించొద్దు. కానీ ఇక్కడ 124 బెక్యూరల్స్‌గా ఉన్నదని వెల్లడించారు. దీనివల్ల ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కారకాలకు ఇది కారణమవుతుందని అంటున్నారు. ఇదిలావుంటే.. థోరాన్ వాయువు మట్టితో నిర్మించిన ఇండ్లపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. నల్లమల అటవీ ప్రాంతంలో అలాంటి ఇండ్లే ఎక్కువగా ఉండడం గమనార్హం.

దీన్ని ఆసరాగా చేసుకుని నివేదికల పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందనే వాదన కూడా లేకపోలేదు. అసలే కరోనా కాలంలో ఊపిరితిత్తులపై రకరకాల వాదనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రేడాన్, థోరాన్ వాయువుల పేరుతో నల్లమల అటవీ ప్రాంత ప్రజల్లో ఆందోళన రేకెత్తించేందుకు ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

డీవైఎఫ్ఐ చేసిన సర్వేలో ఏం తేలిందంటే..

నల్లమల అటవీ ప్రాంతంలోని చిత్రియల్, బుడ్డోనితండా సహా 9 గ్రామాల్లో రేడాన్, థోరాన్ వాయువులు పరిమితికి మించి ఉన్నాయనే ఓయూ నిపుణుల కమిటీ పరిశోధనపై నిజాలు నిగ్గు తేల్చేందుకు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) తెలంగాణ కమిటీ క్షేత్రస్థాయిలో అక్కడ సందర్శించింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం. విప్లవ కుమార్, ఏ. విజయ్ కుమార్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. రవినాయక్, డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఎం. రవి నాయక్, నాయకులు నాగరాజు, ప్రతాని శ్రీను గౌస్‌లతో నిజనిర్ధారణ బృందం ఏర్పడింది.

ఈ బృందం చిత్రియాల, బుడ్డోనితండా గ్రామాల్లో ప్రజలను, ప్రజా ప్రతినిధులు, ఆర్ఎంపీ వైద్యులను కలిసి వివరాలను సేకరించింది. ప్రజల్లో ఎలాంటి రేడియోధార్మిక ఎఫెక్ట్‌లు లేవని, క్యాన్సర్ లక్షణాలు లేవని, ఊపిరితిత్తుల్లో శ్వాస కోశ ఇబ్బందులు కూడా ఉన్నట్లు మా దృష్టికి రాలేదని బృందం తెలిపింది. స్థానికంగా ఉండే 80 ఏండ్ల పైబడిన వృద్ధులు చిత్రియాలలో 100 మంది ఉంటే ఏ ఒక్కరికీ కూడా శ్వాస కోశ సమస్యలు రాలేదని పేర్కొంది. ప్రజల ఆరోగ్య సమస్యల విషయంలో ఎలాంటి అబ్‌నార్మల్ పరిస్థితులు మా దృష్టి రాలేదని బృందానికి ఆర్ఎంపీ వైద్యులు సైతం వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం సైతం వెంటనే స్పందించి అసలు వాస్తవాలను బయట పెట్టాలని, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ చేయించిన సర్వేపై రాష్ట్ర శాస్త్రవేత్తల బృందాన్ని పంపి నిగ్గుతేల్చాలని డీవైఎఫ్ఐ బృందం డిమాండ్ చేసింది.

 

Tags:    

Similar News