భారత్ డెవలప్డ్ దేశమా? డెవలపింగ్ దేశమా?

        కొన్ని దశాబ్దాలుగా భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశంగానే చదువుకుంటున్నాం. ఎప్పుడు డెవలప్డ్ దేశంగా ఆవిర్భవిస్తుందా? అనే ఆలోచనలూ, చర్చలు ఉండనే ఉన్నాయి. భారత్ డెవలపింగ్ కంట్రీ అని వినివినీ విసుగెత్తి ఇక డెవలపింగ్ కంట్రి అనే ఫిక్స్ అయినవారు బోలెడు మంది ఉన్నారు. కానీ, అందరూ డెవలప్డ్ దేశంగా మారాలని కోరుకుంటారు. ఇటీవల భారత్‌ను డెవలప్డ్ కంట్రీగా అమెరికా పేర్కొన్నాక ఈ చర్చ మరోసారి విస్తృతంగా జరుగుతున్నది. సోషల్ మీడియాలో కామెంట్లు […]

Update: 2020-02-17 07:47 GMT

కొన్ని దశాబ్దాలుగా భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశంగానే చదువుకుంటున్నాం. ఎప్పుడు డెవలప్డ్ దేశంగా ఆవిర్భవిస్తుందా? అనే ఆలోచనలూ, చర్చలు ఉండనే ఉన్నాయి. భారత్ డెవలపింగ్ కంట్రీ అని వినివినీ విసుగెత్తి ఇక డెవలపింగ్ కంట్రి అనే ఫిక్స్ అయినవారు బోలెడు మంది ఉన్నారు. కానీ, అందరూ డెవలప్డ్ దేశంగా మారాలని కోరుకుంటారు. ఇటీవల భారత్‌ను డెవలప్డ్ కంట్రీగా అమెరికా పేర్కొన్నాక ఈ చర్చ మరోసారి విస్తృతంగా జరుగుతున్నది. సోషల్ మీడియాలో కామెంట్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. అమెరికా చెబుతున్న డెవలప్డ్ కంట్రీలో ఓ మెలిక ఉన్నది. అదేంటో చూస్తేగానీ అమెరికా పేర్కొన్న డెవలప్డ్ కంట్రీ పరమార్థం ఏమిటో.. దాని ఉద్దేశ్యమేంటో అర్థమవుతుంది.

యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(యూఎస్‌టీఆర్).. ప్రపంచ దేశాలను అభివృద్ధి చెందిన, చెందుతున్న, స్వల్ప అభివృద్ధి దేశాలుగా విభజిస్తుంది. అమెరికా వాణిజ్య అవసరాల కోసం ఈ కేటగరైజేషన్ ఉంటుంది. అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి భారత్ సహా సుమారు రెండు డజన్ల దేశాలను అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి అమెరికా ఫిబ్రవరిలో షిఫ్ట్ చేసింది. అంటే యూఎస్‌టీఆర్ ప్రకారం.. భారత్ అభివృద్ధి చెందిన దేశం. ఇంతకూ ఈ డివిజన్ ఎందుకో ముందు తెలుసుకోవాలి. పేద దేశాల ఎగుమతులను టారిఫ్‌లు లేకుండా స్వీకరించి ఆయా దేశాల ఆర్థికస్థితిని మెరుగుపరిచి పేదరికం నుంచి బయటపడేందుకు ఉపకరించేందుకు ఈ వర్గీకరణ ఉన్నది.

అభివృద్ధి చెందుతున్న దేశాలైతే.. అవి ఎగుమతి చేస్తున్న కొన్ని ఉత్పత్తులకు అమెరికా ఎటువంటి దిగుమతి సుంకాలు విధించకుండా తమ దేశంలోకి అనుమతినిస్తుంది. కానీ, అభివృద్ధి చెందిన దేశాలైతే దిగుమతి సుంకాలు తప్పక విధిస్తుంది. అంటే, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చేర్చిన దేశాల ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకాలు విధించనుంది. దీంతో భారత్.. అమెరికాకు ఎగుమతి చేసే కొన్ని ఉత్పత్తులపైనా దిగుమతి సుంకాలు అమల్లోకి వస్తాయి. దీంతో మన దేశ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇండియా సహా ఆయా దేశాల అభివృద్ధికాకుండా ప్రధానంగా అమెరికా వాణిజ్య లబ్దికోసం ఆ దేశం వేసిన ఎత్తుగడే ఈ జాబితాలో దేశాల మార్పులకు కారణం. అమెరికా ప్రకటనతో మన దేశం అభివృద్ధి చెందినదన్నట్టు కాదు. ఎందుకంటే అమెరికా.. మనదేశ స్థూల జాతీయ ఆదాయమో, లేదా హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లాంటి ఇతర సామాజికాంశాలనో పరిగణనలోకి తీసుకోనేలేదు. అయితే, ఇటీవలి దశాబ్దాల్లో భారత్, చైనా వేగంగా వృద్ధి చెందుతున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అభిప్రాయంతో విబేధించేవారూ ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల పేరుతో భారత్, చైనా, బ్రెజిల్ లాంటి దేశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను నష్టపెడుతున్నాయని(చీట్ చేస్తున్నాయని) యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుసార్లు వ్యాఖ్యానించారు. అటువంటి దేశాలను అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి మార్చాలని బలంగా వాదించారు. ఈ జాబితాతో అధికంగా నష్టపోయేది మన దేశమే. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న జాబితాలోని దేశాల్లో మన దేశమే ఎక్కువ మొత్తంలో దిగుమతి సుంకాల కింద సబ్సిడీ పొందుతున్నది. దాదాపు రెండు వేల భారత్ నుంచి ఎగుమతైన ఉత్పత్తులు ఎటువంటి సుంకాలు లేకుండా అమెరికా మార్కెట్‌లోకి చేరుతున్నాయి. అందుకే గతంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్.. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేర్చొద్దని అభ్యర్థించారు కూడా.

అయితే, ఈ విషయమై కొన్ని వెబ్‌సైట్లు తప్పుదారి పట్టించేలా వార్తలు రాశాయి. భారత్ అభివృద్ధి చెందిందని, అమెరికానే సర్టిఫికేట్ ఇచ్చిందన్నట్టుగా ప్రచురించాయి. ఇటువంటి ఓ వార్తనే బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ ట్వీట్ చేశారు. ప్రస్తుత సర్కారు భారత్‌ను వేగంగా అభివృద్ధి పరిచిందని ఇంకొందరు ట్వీట్ చేశారు. కానీ, ఈ ‘అభివృద్ధి’ వెనుక అమెరికా ఉద్దేశాలు మాత్రం వేరుగా ఉన్నాయి. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు విచ్చేస్తుంటే పేదరికాన్ని కప్పిపెట్టేందుకు సర్కారు మురికివాడలను కనిపించకుండా కొన్ని చోట్ల రోడ్లకు ఇరువైపుల గోడలు కడుతున్నదని, ఇదెటువంటి అభివృద్ధి అని ఇంకొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పేదరికాన్ని కప్పిపెట్టాలనుకోవడం బానిస మనస్తతత్వమని శివసేన.. బీజేపీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News