వ్యూహం మార్చిన గులాబీ బాస్.. త్వరలోనే ఎర్రబెల్లికి చెక్..?
దిశ, తెలంగాణ బ్యూరో : రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. పదవులను చూసుకుని మురిసిపోవడం, అంతా తామై వ్యవహరించాలనే రాజకీయ దుర్భుద్ధితో వ్యవహరించే వాళ్లకు పదవులు మూన్నాళ్ల ముచ్చటగానే మారుతాయని నిరూపించిన ఘటనలు తెలుగు నాట రాజకీయాల్లో అనేకం ఉన్నాయి. ఈ విషయం అనేక మంది పొలిటికల్ జీవితాలను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఓరుగల్లు రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి ఎత్తుగడతోనే మంత్రి ముందుకెళ్తున్నారనే విమర్శలు సొంత పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి వినిపిస్తున్నాయి. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. పదవులను చూసుకుని మురిసిపోవడం, అంతా తామై వ్యవహరించాలనే రాజకీయ దుర్భుద్ధితో వ్యవహరించే వాళ్లకు పదవులు మూన్నాళ్ల ముచ్చటగానే మారుతాయని నిరూపించిన ఘటనలు తెలుగు నాట రాజకీయాల్లో అనేకం ఉన్నాయి. ఈ విషయం అనేక మంది పొలిటికల్ జీవితాలను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఓరుగల్లు రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి ఎత్తుగడతోనే మంత్రి ముందుకెళ్తున్నారనే విమర్శలు సొంత పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి వినిపిస్తున్నాయి. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు నుంచి స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదులు ఇచ్చినట్లు సమాచారం. ఇదే విషయం కేసీఆర్ దృష్టికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ జిల్లా నాడి విభిన్నంగా ఉంటుందని, ఇక్కడ బలమైన నేతకు పాలనా పగ్గాలు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ నిర్ణయాలు మంత్రి ఎర్రబెల్లికి మింగుడుపడని అంశంగా మారనున్నాయని సమాచారం. కడియంను తెరపైకి తెచ్చి.. ఎర్రబెల్లికి చెక్ పెట్టడానికి కేసీఆర్ ముందే మాస్టర్ ప్లాన్ గీసేసి ఉంటారని.. జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీకి చెందిన వరంగల్ లీడర్లతో పాటు.. కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే నేతలు వెల్లడిస్తుండటం గమనార్హం.
ఎర్రబెల్లిపై ఎమ్మెల్యేల ఫిర్యాదులు..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యవహారశైలితో తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని, అధిష్ఠానం వద్ద ఒకటి చెబుతూ.. వాస్తవంలో మాత్రం ఆయన అనుచరులకు, రాజకీయ లబ్ధికి పావులు కదుపుతున్నారంటూ జిల్లాకు చెందిన పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, కేసీఆర్‌లకు ఫిర్యాదు చేశారు. మంత్రి నిర్ణయాలు, రాజకీయ పోకడలతో తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలంటూనే.. సొంత ఎజెండాను అమలు చేస్తున్నారంటూ కేటీఆర్ ఎదుట వాపోయినట్లు సమాచారం. ఈ విషయం కేసీఆర్ దృష్టికి కూడా వెళ్లిందని, కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయంగా ఎదురుదెబ్బ తగలడానికి మంత్రి వైఖరే కారణమంటూ ఓ ఎమ్మెల్యే కేటీఆర్‌కు వివరణ లాంటి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అధిష్ఠానం ఎర్రబెల్లిపై నిఘా ఉంచినట్లు పొలిటికల్ సమాచారం.
సమర్థుడనే కడియం పేరు తెరపైకి..
టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వ తొలి దఫా పాలనలో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి పదవితో ఓ వెలుగు వెలిగారు. అవినీతి, అక్రమాలు లేని నేతగా కేసీఆర్ వద్ద కడియంకు మంచిపేరు ఉంది. అప్పగించిన శాఖను సమర్థవంతంగా నిర్వహించగల సమర్థుడని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారంట. కొంతకాలంగా జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సొంత పార్టీ వేగుల నుంచి అందిన సమాచారం, ఇంటెలిజెన్స్ నివేదిక తదితరాలను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రబెల్లిని కట్టడి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో కడియం లాంటి సీనియర్ నేత సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారంట. ఇందుకోసం ఆయన ఎమ్మెల్సీ పదవిని రెన్యూవల్ చేయడంతో పాటు మంత్రి వర్గంలోకి తీసుకుని ఓ కీలక శాఖను అప్పగించేందుకు సిద్ధపడుతున్నట్లుగా ఆ పార్టీకి చెందిన సీనియర్ ఒకరు తెలిపారు. కడియంకు ప్రభుత్వంలో ప్రాధాన్యం పెరగడం ఖాయమని తెలుస్తోంది. చాలా కాలం పాటు కడియంను ప్రభుత్వంలోని కీలక పదవులకు దూరంగా ఉంచిన కేసీఆర్ తాజాగా ఆయన ఇంట్లో భోజనానికి వెళ్లడం కూడా ఇందుకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.