కోటీశ్వరులపై కరోనా టాక్స్!
దిశ, న్యూస్‌బ్యూరో : లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం క్షీణించినందున, దీన్ని పూడ్చుకునేందుకు సంపన్నులపై కరోనా టాక్స్ విధించే ప్రతిపాదన ముందుకొచ్చింది. సంపన్నులపై పన్ను విధించడంతో పాటు సామాన్యులపై ‘సెస్’ భారం వేసే ప్రతిపాదన కూడా ఉంది. ఆదాయ పన్ను విభాగంలోని దాదాపు యాభై మంది ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్) అధికారులు దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకునేందుకు చేసిన ప్రతిపాదనల్లో ఇవి కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నందున దీని ప్రభావం కొన్నేళ్ళ […]
దిశ, న్యూస్‌బ్యూరో : లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం క్షీణించినందున, దీన్ని పూడ్చుకునేందుకు సంపన్నులపై కరోనా టాక్స్ విధించే ప్రతిపాదన ముందుకొచ్చింది. సంపన్నులపై పన్ను విధించడంతో పాటు సామాన్యులపై ‘సెస్’ భారం వేసే ప్రతిపాదన కూడా ఉంది. ఆదాయ పన్ను విభాగంలోని దాదాపు యాభై మంది ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్) అధికారులు దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకునేందుకు చేసిన ప్రతిపాదనల్లో ఇవి కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నందున దీని ప్రభావం కొన్నేళ్ళ పాటు వెంటాడుతుందని ఆ నివేదికలో వెల్లడించారు. ఆదాయాన్ని పెంచుకోడానికి కొత్త మార్గాల్ని అన్వేషించక తప్పదని వారు సమర్పించిన ‘ఫోర్స్’ (ఫిస్కల్ ఆప్షన్స్ అండ్ రెస్పాన్స్ టు కొవిడ్ ఎపిడమిక్ – FORCE) నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనల్లో కొన్ని ఏడాది కాలంలో వసూలు చేసే పన్నులు కాగా, మరికొన్ని ఆరు నెలల వ్యవధికి మాత్రమే వర్తించే పన్నులు. అనేక యూరోపియన్ దేశాల్లో ఆర్థిక వేత్తలు సంపన్నులపై పన్ను విధించడమనేదే అభ్యుదయకరమైనదిగా ఉంటుందని, దేశ సంపదను కూడబెట్టేందుకు మంచి మార్గమని ఐఆర్ఎస్ అధికారులు ఉటంకించారు. సంపన్నుల దగ్గర ఆర్జిస్తున్న ఆదాయం, చేస్తున్న ఖర్చులతో పోలిస్తే చాలా పెద్ద మొత్తంలో సంపద ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.
ప్రస్తుత బడ్జెట్ లెక్కల ప్రకారం.. కోటీశ్వరులపై పన్ను విధించడం ద్వారా గరిష్టంగా రూ. 2,700 కోట్లు మాత్రమే సమకూరుతాయని, కానీ ఇప్పుడు కుదేలైన ఆర్థిక వ్యవస్థకు అవసరమైన విధంగా వసూలు చేయక తప్పదని పేర్కొన్నారు. ప్రస్తుతం కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న సంపన్నులపై ఆదాయపు పన్ను శ్లాబ్ 30% ఉందని, దీన్ని 40 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. లేదా రూ. 5 కోట్ల నికర సంపద ఉన్నవారికి సంపద పన్నును తిరిగి ప్రవేశ పెట్టడం కూడా ఆదాయ మార్గంగా ఉంటుందని సూచించారు. దీనికి తోడు విదేశీ సంస్థలు తమ భారతీయ శాఖ కార్యాలయాలు, శాశ్వత సంస్థల నుంచి సంపాదించిన ఆదాయంపై చెల్లించే సర్‌చార్జిని రూ. కోటి నుంచి రూ.10 కోట్ల పరిధిలో ఉంటే 2 శాతం చొప్పున, రూ.10 కోట్లకు మించిన ఆదాయంపై 5 శాతం విధించాలని ప్రతిపాదించారు.
సామాన్యులపై ‘కొవిడ్ సెస్’ :
ఏదో ఒక రూపంలో పన్ను చెల్లించే ప్రతి ఒక్కరిపై కొవిడ్ రిలీఫ్ సెస్ విధించాలనే ప్రతిపాదనను కూడా ఐఆర్ఎస్ అధికారులు ఆ నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం హెల్త్, ఎడ్యుకేషన్ సెస్ 2 శాతంగా ఉంది. అదనంగా వన్‌టైమ్ పేరుతో 4 శాతం కొవిడ్ రిలీఫ్ సెస్ విధించాలని సూచించారు. వార్షికాదాయం రూ. 10 లక్షలు దాటిన వారిపై ఈ పన్ను విధించడం ద్వారా రూ.15 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా వేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఉపయోగించాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం ఆయా కంపెనీలు కరోనా పరిస్థితుల్లో నాన్-మేనేజీరియల్ సిబ్బందికి చెల్లిస్తున్నవేతనాలను కూడా సీఎస్ఆర్ కింద పరిగణించాలని సూచించారు. కరోనా వైరస్ ఉపశమనం కోసం నిధులను సమీకరించడానికి కొత్త పన్ను పొదుపు పథకాన్ని రూపొందించాలని సూచించారు. ప్రత్యేక విధానం ద్వారా పొదుపు చేసిన సొమ్మును ఐదేళ్ల పాటు సేవింగ్‌లో ఉంచి అధిక వడ్డీ వచ్చేలా చేయాలనేది వీరి భావన.
కొత్త రుణమాఫీ పథకం :
‘వివాద్ సే విశ్వాస్’ తరహాలో మరో పథకాన్ని ప్రవేశ పెట్టాలని, దీని ద్వారా పెనాల్టీతో సొమ్ముని రాబట్టుకోవచ్చని సూచించారు. దీని సేకరణ కోసం పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద జరిమానా మొత్తానికి కూడా ఇదే విధానాన్ని అనుసరించవచ్చని సూచించారు. మన దేశంలో 1985 వరకు వారసత్వ పన్ను విధానం ఉండేదని, విదేశాల్లో ఇప్పటికీ అమలవుతున్న తరహాలో ఇకపైన దాన్ని అమలులోకి తేవడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని సూచించారు. విదేశాల్లో వారసత్వ పన్ను సుమారు 55 శాతం మేర ఉంటుంది. విదేశాల్లో ఉన్న భారతీయులపై మూలధనాన్ని 10 శాతం పెంచాలని సూచించారు. ప్రస్తుతం ఇది 30 శాతంగా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జూమ్ వంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వినియోగం పెరుగుతున్నందున వీటిపై డిజిటల్ మార్గంలో పన్ను విధించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. సంపన్నులు వంటగ్యాస్‌పై సబ్సిడీ వదులుకోవాలని విజ్ఞప్తి చేసినట్లుగా కొన్ని పన్ను మినహాయింపులను వదులుకునేలా కోరాలని సూచించారు.
Tags: India, Tax Proposals, Super Rich, Corona Cess, IRS Officers, FORCE Report