మాంద్యం ఎఫెక్ట్.. పొదుపు బాటలో ఐపీఎల్
ఎంతటి ధనవంతుడైనా, వేల కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థ అయినా సరే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాలంటే పొదుపు చర్యలు పాటించాల్సిందే. లేకుంటే దివాలా తీయడం ఖాయం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ల ప్రభావం, దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యాన్ని గమనించిన ఐపీఎల్ బోర్డు కూడా పొదుపు బాట పట్టక తప్పలేదు. ప్రపంచ క్రికెట్‌లో ధనిక బోర్డుగా వెలుగొందుతున్న బీసీసీఐని.. మరింత రిచ్‌గా మార్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అన్న విషయం తెలిసిందే. పన్నెండేళ్ల కిందట ప్రారంభమైన […]
ఎంతటి ధనవంతుడైనా, వేల కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థ అయినా సరే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాలంటే పొదుపు చర్యలు పాటించాల్సిందే. లేకుంటే దివాలా తీయడం ఖాయం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ల ప్రభావం, దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యాన్ని గమనించిన ఐపీఎల్ బోర్డు కూడా పొదుపు బాట పట్టక తప్పలేదు. ప్రపంచ క్రికెట్‌లో ధనిక బోర్డుగా వెలుగొందుతున్న బీసీసీఐని.. మరింత రిచ్‌గా మార్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అన్న విషయం తెలిసిందే.
పన్నెండేళ్ల కిందట ప్రారంభమైన నాటి నుంచే ఈ లీగ్ నిర్వహణను సైతం అదే స్థాయిలో చేపట్టారు. బీసీసీఐ నుంచి ఫ్రాంచైజీల వరకు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభ వేడుకలను ఎంత అట్టహాసంగా నిర్వహిస్తారో అందరికీ విదితమే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు బాలీవుడ్ తారలకు కోట్ల రూపాయలు వెచ్చించడం తెలిసిందే. మరోవైపు స్పాన్సరర్లు కూడా బీసీసీఐకి అడిగినంత డబ్బు ఇచ్చారు. ఇక ఫ్రాంచైజీలైతే ప్రమోషన్ల కోసం ఈవెంట్లు, ఆటగాళ్ల ప్రయాణం కోసం బిజినెస్ క్లాస్ టికెట్లు, బస కోసం స్టార్ హోటళ్లు బుక్ చేసేవి. కానీ ఈ ఏడాది పరిస్థితి మొత్తం మారిపోయింది.
వేడుకలు లేవు.. ప్రైజ్‌మనీలో కోత
ఐపీఎల్ 13వ సీజన్‌ను ఎలాంటి వేడుకలు లేకుండానే ప్రారంభించాలని ఐపీఎల్ మండలి నిర్ణయించింది. ఇందుకోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని తేల్చేసింది. మరోవైపు గత సీజన్ టైటిల్ గెలిచిన జట్టుకు 20 కోట్లు, రన్నరప్‌కు రూ.10 కోట్ల ప్రైజ్ మనీని ఇచ్చింది. కానీ, ఈ ఏడాది విజేతకు రూ.10 కోట్ల, రన్నరప్‌కు రూ.6 కోట్లు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లుకు తలా రూ.4 కోట్ల 37 లక్షలు ఇవ్వాలని తీర్మానించింది. మరోవైపు బీసీసీఐ అధికారులకు ఐపీఎల్ సీజన్ సమయంలో విమానాల్లో బిజినెస్ క్లాస్ టికెట్లు ఇచ్చేవారు. కనీసం 3 గంటల ప్రయాణ సమయం ఉంటే బిజినెస్ క్లాస్ టికెట్ దక్కేది. ప్రస్తుతం కనీసం 8 గంటల ప్రయాణం అయితేనే బిజినెస్ క్లాస్ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 8 గంటల ప్రయాణ సమయం దాటే అవకాశం లేకపోవడం గమనార్హం.
ఫ్రాంచైజీల అసంతృప్తి
ఐపీఎల్ బోర్డు తీసుకున్న పొదుపు నిర్ణయాలపై పలు ఫ్రాంచైజీలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. గతంలో ఎవరైనా విదేశీ ఆటగాడు టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగితే, ఆ నష్టపరిహారాన్ని ఐపీఎల్ బోర్డు చెల్లించేది. కానీ, ఇకపై ఆ నష్టాన్ని తాము భరించబోమని బోర్డు తేల్చేయడం ఫ్రాంచైజీలకు రుచించడం లేదు. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూనే 47 వేల 500 కోట్ల రూపాయలు. నిధులకు ఏ మాత్రం కొదవలేదు. స్పాన్సరర్లు, బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా బీసీసీఐ బాగానే సంపాదిస్తోంది. అయినా సరే ఇలా పొదుపు చర్యలు చేపట్టడంపై ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆర్థిక పొదుపు చర్యలు చేపడుతున్నా కరోనాకు సంబంధించి ఏం చర్యలు చేపట్టారో ఇప్పటిదాకా బోర్డు తెలపకపోవడం గమనార్హం.
Tags: IPL, BCCI, franchisees, Prize money, Recession