మద్యం టెండర్లలో ‘మాయ’.. సగం టెండర్లు వారివే..?

దిశ ప్రతినిధి, మెదక్ : నూతన మద్యం దుకాణాల కేటాయింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశావాహుల నుండి టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గతం కంటే ఈ సారి 50 షాపులు అదనంగా పెంచారు. అయినా టెండర్లు దాఖలు చేయడానికి ఆశావాహులు ముందుకు రావడం లేదు. ఈ నెల 18వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా ఇప్పటి వరకు చాలా దుకాణాలకు టెండర్లు దాఖలు కాలేదు. దీనికి ప్రధాన కారణం రిజర్వేషన్ల అమలేనని […]

Update: 2021-11-14 07:55 GMT

దిశ ప్రతినిధి, మెదక్ : నూతన మద్యం దుకాణాల కేటాయింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశావాహుల నుండి టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గతం కంటే ఈ సారి 50 షాపులు అదనంగా పెంచారు. అయినా టెండర్లు దాఖలు చేయడానికి ఆశావాహులు ముందుకు రావడం లేదు. ఈ నెల 18వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా ఇప్పటి వరకు చాలా దుకాణాలకు టెండర్లు దాఖలు కాలేదు. దీనికి ప్రధాన కారణం రిజర్వేషన్ల అమలేనని సమాచారం. టెండర్లు దాఖలు చేసిన వారిలోనూ సగం మంది బినామీలేనని, మరికొందరు సిండికేట్‌గా మారి టెండర్లు వేసినట్టు తెలుస్తోంది.

జిల్లాలో 243 షాపులు..

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గతంలో 193 షాపులు ఉండగా ఈ సారి 50 షాపులు అదనంగా పెంచారు. దీంతో ఈసారి షాపుల సంఖ్య 243 కు చేరుకుంది. సిద్దిపేట జిల్లాలో 23 షాపులు కొత్తగా రాగా వాటితో కలిపి 93 షాపులు ఉన్నాయి. మెదక్ జిల్లాలో 38 షాపులు ఉండగా కొత్తగా 11 షాపులకు అనుమతి లభించింది. మొత్తం మెదక్ జిల్లా వ్యాప్తంగా 49 షాపులు ఉన్నాయి. ఇక సంగారెడ్డి జిల్లాలో 85 పాతవి, 16 కొత్త షాపులు కలిపి మొత్తం 101 వైన్ షాపులు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో 82 టెండర్లు దాఖలు కాగా మెదక్ జిల్లాలో 64 టెండర్లు దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇంకా చాలా దుకాణాలకు దరఖాస్తులు ప్రారంభం కాలేదని, చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని జిల్లా ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

రిజర్వేషన్ల అమలు ఇలా..

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని వైన్స్ దుకాణాలకు రిజర్వేషన్లు అమలు చేసిన విషయం తెలిసిందే. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. దీని ప్రకారం సిద్ధిపేట జిల్లాలో 93 షాపులకు గాను గౌడ కులస్తులకు 16 షాపులు, ఎస్సీలకు 9 షావులు, మిగిలిన 68 షాపులకు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మెదక్ జిల్లాలో 49 షాపులకు గాను గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 16 దుకాణాలు కేటాయించి, మిగిలిన 33 దుకాణాలను జనరల్ రిజర్వేషన్లు కేటాయించారు. సంగారెడ్డి జిల్లాలో గౌడ కులస్తులకు 9, ఎస్సీలకు 2, ఎస్టీలకు 2 షాపులు కేటాయించారు. మిగిలిన 77 షాపులకు అన్ని వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

మందకొడిగా దరఖాస్తులు..

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ పద్ధతి బాగానే ఉన్నా ఆశావాహులు ముందుకు రావడం లేదు. గతంలో కరోనా కారణంగా వైన్ షాపుల యజమానులు భారీగా నష్టపోయారు. దీనికితోడు రిజర్వేషన్ వ్యవస్థ అమలు చేయడంతో అన్ని చోట్ల దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రధాన అడ్డాల వద్ద ఉన్న షాపులు, ఆదాయం ఎక్కువగా వచ్చే చోట రిజర్వేషన్లు కేటాయించడంతోనూ చాలా మంది ఆశావాహులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అందుకే టెండర్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమై వారం రోజులు కావొస్తున్నా ఇంకా చాలా దుకాణాలకు దరఖాస్తులు ప్రారంభం కాలేదు. మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండగా ఎంత మంది దరఖాస్తు చేస్తారో చూడాలి.

దరఖాస్తు దారుల్లోనూ బినామిలే..

ఉమ్మడి మెదక్ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మంది బినామీలేనని తెలుస్తోంది. ఆదాయం ఎక్కువగా వచ్చే చోట రిజర్వేషన్ అమలు చేయడంతో చాలా మంది ఆశావాహులు రిజర్వేషన్ వర్తించే వ్యక్తి పేరు మీద టెండర్లు దాఖలు చేసినట్టు సమాచారం. ఇలా జిల్లాలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మంది వారే ఉంటారని అంచనా. దీనికితోడు మరికొందరు గతంలో లాగానే సిండికేట్‌గా మారి ఎవరికి వారు దరఖాస్తు చేస్తున్నారు. ఎవరికి షాపు వచ్చినా అందరం కలిసి దుకాణం నడుపుదామంటూ ముందే అగ్రిమెంట్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఏదేమైనా మరో మూడు రోజుల్లో ఎంత మంది టెండర్లు దాఖలు చేస్తారనేది పూర్తి స్థాయిలో తేలనుంది.

 

Tags:    

Similar News