వారి గోడును పట్టించుకోండి.. కేసీఆర్‌కు మేధావుల బహిరంగ లేఖ!
దిశ, తెలంగాణ బ్యూరో : కోవిడ్ కారణంగా ఆదాయాలు కోల్పోయినవారికి నెలకు రూ. 7500, 25 కిలోల బియ్యం లేదా గోధుమలు అందించాలని మేధావుల బృందం సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేసింది. సొంత ఊర్లకు వెళ్లిపోదలచుకున్న వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్వస్థలాలకు చేరుకునే ఏర్పాట్లు చేయాలని శనివారం కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరాం, చుక్కా రామయ్య, రమా మెల్కొటే. రామచంద్ర మూర్తిలు బహిరంగ లేఖ రాసారు. కోవిడ్ నివారణ, చికిత్సలు, ప్రజారక్షణ, బ్రతుకుదెరువుల […]
దిశ, తెలంగాణ బ్యూరో : కోవిడ్ కారణంగా ఆదాయాలు కోల్పోయినవారికి నెలకు రూ. 7500, 25 కిలోల బియ్యం లేదా గోధుమలు అందించాలని మేధావుల బృందం సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేసింది. సొంత ఊర్లకు వెళ్లిపోదలచుకున్న వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్వస్థలాలకు చేరుకునే ఏర్పాట్లు చేయాలని శనివారం కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరాం, చుక్కా రామయ్య, రమా మెల్కొటే. రామచంద్ర మూర్తిలు బహిరంగ లేఖ రాసారు. కోవిడ్ నివారణ, చికిత్సలు, ప్రజారక్షణ, బ్రతుకుదెరువుల పై భరోసా కల్పిస్తూ తగిన ఏర్పాటు చేయాలని కోరారు. కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్ధారించిన దానికంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సెకండ్ వేవ్కు రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ వేల సంఖ్యలలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయని గుర్తు చేశారు.
సెకండ్ వేవ్ రాబోతున్నదని రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఉన్నప్పటికి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. రోజురోజుకూ తీవ్రమవుతున్న కరోనా వ్యాధి నుంచి ప్రజలను రక్షించేలా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాము ప్రభుత్వానికి విన్నవిస్తున్న సూచనలన్ని ఏడాది కాలంగా అనేక సందర్బాల్లో కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకొచ్చారు. వ్యాధిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం జీవోలు జారీ చేసినప్పటికి యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉండటం శోచనీయమన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టటానికి కేవలం కర్ఫ్యూ విధించడమే కాకుండా ప్రకృతి విపత్తుల నివారణా చట్టాన్ని అనుసరిస్తూ సమగ్రమైన ప్రణాళిక చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరికి కోవిడ్ పరీక్షలు చేపట్టే విధంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలతో పాటు, కనీసం 70 శాతం ఆర్‌టీపీసీఆర్ టెస్టులను కూడా తప్పక చేయాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించాలని సూచించారు. గ్రామ స్థాయిలో పోలియో చుక్కలు అందించినట్టుగా కోవిడ్ టీకాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులత్లో కోవిడ్ టీకాలకు అధిక ధరలను వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేందుకు కావల్సిన మౌళిక సదుపాయాలు కల్పించి పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్, మందులను అందుబాటులో ఉంచాలన్నారు. వైద్యసేవల గురించి ప్రజలకు ఎప్పటికప్పడు సమాచారం అందించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ నెలకొల్పాలన్నారు. వ్యాధి పట్ల అవగాహనలు కల్పించేందుకు పౌరవేదికల, స్వచ్చంధ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రజారోగ్యాన్ని , ప్రజారక్షణనూ, సమాజ వికాస అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పందించాలని కోరుతున్నామని విన్నవించారు. రాజ్యాంగం ప్రభుత్వంపై ఉంచిన జీవించే హక్కు పరిరక్షణ కర్తవ్యమని గుర్తించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.