ఆ పార్కులో.. టైర్లే కాన్వాస్

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో.. ప్రతిరోజు కొన్ని లక్షల వాహనాలు రోడ్లపై పరుగులు పెడుతుంటాయి. మరి వాహనాలు నడిచేందుకు ఇంధనం ఎంత ముఖ్యమో.. టైర్లు కూడా అంతే ముఖ్యమన్న విషయం తెలిసిందే. అయితే కాలం చెల్లిన టైర్లను తీసేసి వాటి స్థానంలో కొత్తవి వేశాక, పాతవి ఎందుకూ పనికిరావని ఓ మూలన పడేస్తుంటారు. అలా ఒక్కో చోట కొన్ని వందల టైర్లు పోగవుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో చాలామంది ఆ టైర్లను రీయూజ్ చేస్తున్నారు. అందమైన ఫర్నిచర్‌లా, […]

Update: 2020-11-03 04:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో.. ప్రతిరోజు కొన్ని లక్షల వాహనాలు రోడ్లపై పరుగులు పెడుతుంటాయి. మరి వాహనాలు నడిచేందుకు ఇంధనం ఎంత ముఖ్యమో.. టైర్లు కూడా అంతే ముఖ్యమన్న విషయం తెలిసిందే. అయితే కాలం చెల్లిన టైర్లను తీసేసి వాటి స్థానంలో కొత్తవి వేశాక, పాతవి ఎందుకూ పనికిరావని ఓ మూలన పడేస్తుంటారు. అలా ఒక్కో చోట కొన్ని వందల టైర్లు పోగవుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో చాలామంది ఆ టైర్లను రీయూజ్ చేస్తున్నారు. అందమైన ఫర్నిచర్‌లా, మొక్కలను పెంచే పూలకుండీల్లా మార్చేస్తూ గార్డెన్‌కు, ఇంటికి సరికొత్త కళను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే.. పశ్చిమ బెంగాల్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (WBTC) కోల్‌కతాలో ప్రత్యేక టైర్ల పార్కును రూపొందించింది. ఇలాంటి పార్క్ దేశంలోనే మొదటిది కావడం విశేషం. కాగా ప్రజల కోసం ఈ పార్క్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.

మెకానిక్ షెడ్లలో, పాత ఇనుప సామాను దుకాణాల్లో కొన్ని వేల టైర్లు కనిపిస్తుంటాయి. బస్ డిపోల్లో.. పాడైన టైర్లను బాగు చేసి మళ్లీ యూజ్ చేస్తుంటారు. ఇక రీయూజ్‌కు కూడా పనికిరాని టైర్లు మాత్రం అలా పోగవుతుంటాయి. అలాంటి టైర్లను అందంగా మార్చితే ఎలా ఉంటుందనే ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే ‘టైర్ పార్క్’. అలా బెంగాళ్ బస్సు డిపోల్లోని పాత టైర్లను డబ్ల్యూటీసీ అధికారులు.. అందమైన కళాకృతులుగా మార్చేసి వాటితో ఓ పార్కును రూపొందించారు. ఈ తరహా పార్కు ఇండియాలోనే మొట్టమొదటిది కావడం విశేషం. ‘ఏ చెత్త వస్తువుపైనా వేస్ట్ అనే ట్యాగ్ లైన్ వేయొద్దు. ప్రతీదాన్ని రీయూజ్ చేయొచ్చు, కళాత్మకంగా మార్చొచ్చు. అందుకు ఆర్ట్ పనికొస్తుంది’ అనే సందేశాన్ని దీని ద్వారా ప్రజలకు ఇవ్వదలచుకున్నాం’ అని డబ్ల్యూటీసీ మేనేజింగ్ డైరెక్టర్ రజన్వీర్ కపూర్ తెలిపారు.

ఈ పార్కులో టైర్లను వినియోగించిన తీరు చూస్తే.. నిజంగా వావ్ అనాల్సిందే. టైర్లపై వేసిన బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. చిన్న పిల్లల కోసం వేసిన కార్టూన్ బొమ్మలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పార్కులో ఏర్పాటు చేసిన కేఫ్‌లో కూడా టైర్లను అందంగా మలిచిన తీరు బాగుంది. టైర్ టీ కప్పులా మారి కనువిందు చేస్తోంది. ఎందుకూ పనికిరావనుకున్న టైర్లన్నీ కూడా రిటైర్ కాకుండా.. కుర్చీలుగా, టీపాయ్‌గా, టేబుల్స్‌గా మారిపోయాయి.

Tags:    

Similar News