సాగు వ్యర్థాల నుంచి ఆదాయం

దిశ, వెబ్‌డెస్క్: సహజ వనరుల వినియోగం, ప్లాస్టిక్ వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్న కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిని జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు వినూత్నంగా ఆలోచిస్తూ పటిష్ట చర్యలు చేపడుతున్న వారిని ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ (యూఎన్ఈపీ) గుర్తిస్తోంది. వారికి ‘యంగ్ చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ పేరిట ఏటా అవార్డులిస్తోంది. 2020కి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డును విద్యుత్ మోహన్ అనే యువ ఇంటర్‌ప్రెన్యూర్ సొంతం చేసుకున్నాడు. […]

Update: 2020-12-19 03:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: సహజ వనరుల వినియోగం, ప్లాస్టిక్ వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్న కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిని జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు వినూత్నంగా ఆలోచిస్తూ పటిష్ట చర్యలు చేపడుతున్న వారిని ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ (యూఎన్ఈపీ) గుర్తిస్తోంది. వారికి ‘యంగ్ చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ పేరిట ఏటా అవార్డులిస్తోంది. 2020కి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డును విద్యుత్ మోహన్ అనే యువ ఇంటర్‌ప్రెన్యూర్ సొంతం చేసుకున్నాడు. యువతకు స్ఫూర్తి ప్రదాత, గ్లోబల్ చేంజ్ మేకర్ అయిన మోహన్.. వ్యవసాయ మిగులు వ్యర్థాలు కాల్చకుండా రైతులను ఎలా ఒప్పించాడు? ఆ వ్యర్థాలతోనూ అన్నదాతకు ఆదాయం సమకూరేందుకు అతను ఏం చేస్తున్నాడో? ఇక్కడ తెలుసుకుందాం.

1960లో వచ్చిన హరిత విప్లవం తర్వాత రైతులకు బయో ఇంజినీర్డ్ సీడ్స్ భారీగా అందుబాటులోకి వచ్చాయి. తద్వారా పంట దిగుబడి పెరగడంతో.. భారత్ ఆహార భాండాగారంగా మారింది. అయితే ఇక్కడ దిగుబడితో పాటు పంట వ్యర్థాలు కూడా పెరిగాయి. రైతులు వాటిని కాలుస్తుండటంతో వాయు కాలుష్యం పెరిగింది. అది మానవుని ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపెడుతోంది. ఆస్తమా, గుండె సంబంధిత రోగాలకు అది వాహకంగా పని చేస్తోంది. ఈ కాలుష్యం ఎఫెక్ట్ దేశరాజధాని ఢిల్లీ వరకు చేరింది. అక్కడ గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ఢిల్లీ నగర వీధుల్లో, బయట దారులన్నీ పొగ మంచుతో కమ్మేసిన పరిస్థితులను మనం చూశాం. ఈ పరిస్థితిని గమనించిన యువ ఇంజినీర్ విద్యుత్ మోహన్.. ఈ సిట్యువేషన్స్‌లో కొంతైన మార్పు తేవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలోనే వ్యవసాయ మిగులు వ్యర్థాలపై స్టడీ చేసిన మోహన్.. వ్యర్థాల నుంచి రైతులకు ఆదాయం అందేలా చేయాలని భావించాడు. అందుకు కెవిన్ కుంగ్‌తో కలిసి ‘తకచర్’ అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు. వ్యర్థాలను బహిరంగంగా కాల్చొద్దని రైతులతో ఒప్పందం కుదుర్చుకొని, వారి వద్ద నుంచి వడ్ల పొట్టు (వరి), కొబ్బరి చిప్పలు, ఇంకా ఇతర మిగులు వ్యర్థాలను సేకరించాడు. వాటిని గాలి తగలకుండా ఓ ప్రదేశంలో బర్న్ చేసి బొగ్గుగా (చార్ కోల్) మార్చాడు. అది ఎనర్జీ జనరేషన్‌కు ఉపయోగపడుతోంది. అలా వ్యర్థాలతోనూ రైతులకు ఆదాయం లభిస్తోంది. ఇప్పటి వరకు 4,500 మంది రైతుల వద్ద నుంచి 3 వేల టన్నుల వ్యర్థాలను సేకరించాడు. తనకు ఎనర్జీ (శక్తి) క్రియేషన్ పట్ల చాలా ఆసక్తి ఉందని, మిగులు వల్ల శక్తి సృష్టించబడుతూ, అది వెనుకబడిన వర్గాలకు ఆదాయాన్ని సమకూర్చడం ఆనందంగా ఉందని మోహన్ తెలిపాడు.

ప్రపంచంలో వాయు కాలుష్యం పతాక స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం వ్యవసాయ మిగులు ఉత్పత్తులు బహిరంగంగా కాల్చివేయడమేనని ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ చీఫ్ మార్క్ రాద్క వివరించారు. వ్యవసాయ సంఘాలతో ఒప్పందం కుదుర్చుకున్న ‘తకచర్’ వ్యర్థాల నుంచి బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ఓ పోర్టెబుల్ మెషిన్‌ను ఉపయోగిస్తోంది. ఈ యంత్రం మిగులును అధిక ఉష్ణోగ్రత వద్ద బర్న్ చేసి బొగ్గును కర్బన ఉద్గారంగా మార్చుతుంది. ఈ కర్బన ఉద్గారాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇలా క్లైమేట్ చేంజ్‌ను అడ్డుకుంటూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నందుకు యూఎన్ఈపీ మోహన్‌ను యంగ్ చాంపియన్‌గా సెలెక్ట్ చేసింది. యంగ్ చాంపియన్ ఆప్ ధి ఎర్త్ అవార్డు అందుకునే ఏడుగురిలో ఒకరు మోహన్. యూఎన్ఈపీ అవార్డుతో పాటు రూ.73 లక్షలు అందజేస్తుంది.

Tags:    

Similar News