ఒడిశా, బెంగాల్‌కు ముప్పు.. ఏపీలో వర్షాలు

దిశ, ఏపీ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఎంఫన్’ తుఫాను తీవ్ర తుఫానుగా మారి పయనిస్తోంది. సముద్ర ఉపరితల వాతావరణం అనుకూలించడంతో శరవేగంగా బలపడుతున్న ఎంఫన్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంవైపు దూసుకొస్తోంది. అతి తీవ్ర తుపానుగా మారిన ఎంఫన్, ప్రచండ తుఫానుగా బలపడి మే 20న తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ప్రస్తుతం వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర దిశలో పయనిస్తుందని, పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హాతియా ఐలాండ్స్ మధ్య […]

Update: 2020-05-19 11:53 GMT

దిశ, ఏపీ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఎంఫన్’ తుఫాను తీవ్ర తుఫానుగా మారి పయనిస్తోంది. సముద్ర ఉపరితల వాతావరణం అనుకూలించడంతో శరవేగంగా బలపడుతున్న ఎంఫన్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంవైపు దూసుకొస్తోంది. అతి తీవ్ర తుపానుగా మారిన ఎంఫన్, ప్రచండ తుఫానుగా బలపడి మే 20న తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ప్రస్తుతం వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర దిశలో పయనిస్తుందని, పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హాతియా ఐలాండ్స్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రంలో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికల జెండా ఎగురవేశారు. బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.

విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సెక్షన్‌ సిగ్నల్‌ నెంబర్‌ 5ను జారీచేశారు. కళింగపట్నం, భీమిలి, వాడరేవు పోర్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు అందించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా, గడిచిన 24 గంటల్లో చింతపల్లి, యర్రగొండపాలెంలో 4 సెంమీ, అచ్చెంపేట, తాడేపల్లిగూడెం, సత్తెనపల్లిలో 2 సెంమీ వర్షపాతం నమోదైంది.

అయితే ఎంఫన్ కారణంగా తీవ్రంగా గాలులు వీచే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలను వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే తుఫాను ముప్పు ఏపీకి పెద్దగా ఉండదని అంచనా వేసింది. ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో గాలుల వేగం గంటకు 190 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ తుఫాను తీరానికి దూరంగా, ఇంకా సముద్రంలోనే ఉన్నందున వర్షపాతం లోతైన వివరాలు అంచనా వేస్తున్నారు. ఏపీలో చెదురు మదురు వర్షాలతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు భారీ వర్షాలతో పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు సూచించారు. ఈ మేరకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.

మరోవైపు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్‌ దీవుల ప్రాంతానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు రోజుల్లో అండమాన్‌ సముద్రం, అండమాన్‌ దీవుల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే ఆస్కారం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.

Tags:    

Similar News