India vs New Zealand 2021: కొత్త కెప్టెన్ల తొలి సమరంలో విజేత ఎవరు..?

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో డీలా పడిపోయిన రెండు మేటి జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడనున్నాయి. టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం జైపూర్ వేదికగా తొలి టీ20 జరుగనున్నది. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇరు జట్లలో మార్పులు జరిగాయి. ఇండియా, కివీస్ రెండు కూడా కొత్త సారథులతో బరిలోకి దిగుతున్నాయి. టీమ్ ఇండియాకు అయితే కెప్టెన్ మాత్రమే కాకుండా కోచింగ్ స్టాఫ్ కూడా మారిపోయారు. పూర్తిగా యువకులతో నిండిన జట్టుతో […]

Update: 2021-11-16 08:27 GMT

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో డీలా పడిపోయిన రెండు మేటి జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడనున్నాయి. టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం జైపూర్ వేదికగా తొలి టీ20 జరుగనున్నది. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇరు జట్లలో మార్పులు జరిగాయి. ఇండియా, కివీస్ రెండు కూడా కొత్త సారథులతో బరిలోకి దిగుతున్నాయి. టీమ్ ఇండియాకు అయితే కెప్టెన్ మాత్రమే కాకుండా కోచింగ్ స్టాఫ్ కూడా మారిపోయారు. పూర్తిగా యువకులతో నిండిన జట్టుతో రోహిత్-రాహుల్ తొలి పరీక్షకు సిద్ధమవుతున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో కివీస్ చేతిలో పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు మెగా టోర్నీలో మంచి ఫామ్ కనపరిచిన కివీస్ కూడా దూకుడు మీద కనపడుతున్నది. యువకులతో నిండిన టీమ్ ఇండియా ఒకవైపు.. అనుభవంతో నిండిన న్యూజీలాండ్ మరోవైపు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య మ్యాచ్ తప్పకుండా రసవత్తరంగా సాగే అవకాశం ఉన్నది.

ఎవరెవరికి చోటు?

టీమ్ ఇండియాలో భారీ మార్పులే చోటు చేసుకోనున్నాయి. రాహుల్ ద్రవిడ్ మొదటి మ్యాచ్‌ నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించే అవకాశం ఉన్నది. టీ20 వరల్డ్ కప్ చివరి మూడు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ – కేఎల్ రాహుల్ జోడి చక్కగా రాణించారు. ఈ మ్యాచ్‌లో వీళ్లే బరిలోకి దిగే అవకాశం ఉన్నది. ఫస్ట్ డౌన్‌లో ఇషాన్ కిషన్ లేదా శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కే అవకాశం ఉన్నది. ఒకవేళ అయ్యర్‌ను నాలుగో స్థానంలో పంపాలని భావిస్తే.. మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉన్నది.

ఇక మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్‌కు తోడు అక్షర్ పటేల్ ఉండొచ్చు. అక్షర్‌ను తీసుకోకపోతే శ్రేయస్, ఇషాన్ ఇద్దరికీ చోటు దక్కే అవకాశం ఉన్నది. స్పిన్నర్ కోటాలో యజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకుంటారు. భువీ, చాహర్‌లకు తోడుగా హర్షల్ పటేల్ లేదా అవేశ్ ఖాన్ బరిలోకి దిగే అవకాశం ఉన్నది. జైపూర్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్. అంతే కాకుండా ఆ స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఇదే కావడంతో పిచ్‌పై సరైన అంచనాలు లేవు. ముగ్గురు స్నిన్నర్లు కావాలని అనుకుంటే ఆల్‌రౌండర్ కోటాలో అక్షర్‌కే అవకాశం ఉంటుంది.

కివీస్ పరిస్థితి ఏంటి?

టీ20 వరల్డ్ కప్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన న్యూజీలాండ్ జట్టు కూడా కొన్ని మార్పులతో బరిలోకి దిగుతున్నది. ఫైనల్‌లో ఆ జట్టు బ్యాటింగ్ ప్రదర్శన బాగానే ఉన్నా.. బౌలింగ్ విభాగం విఫలమైంది. ఇక ఇండియా పిచ్‌లపై అనుభవం ఉన్న బ్యాటర్లు, బౌలర్లు అందుబాటులో ఉన్నారు. కేన్ విలియమ్‌సన్, డెవాన్ కాన్వే లేకపోవడం ఆ జట్టుకు పెద్ద నష్టమే. అయితే ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. వీళ్లు రాణిస్తే భారీ స్కోర్ రావడం ఖాయమే.

ఇక భారత పిచ్‌లపై పెద్దగా అనుభవం లేని టిమ్ సిఫర్ట్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్ కష్టపడాల్సి ఉన్నది. జేమ్స్ నీషమ్ మంచి ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరుస్తున్నాడు. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌లకు ఇండియన్ పిచ్‌లు బాగా అలవాటు ఉన్నాయి. గాయపడిన లాకీ ఫెర్గూసన్ పూర్తి స్థాయిలో కోలుకోకపోతే అడమ్ మిల్నే బరిలోకి దిగే అవకాశం ఉన్నది. స్పిన్ పిచ్‌లపై ఇష్ సోథీ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఏదేమైనా ఈ మ్యాచ్ టిమ్ సౌథీ కెప్టెన్సీకి కఠిన పరీక్ష అని చెప్పుకోవచ్చు.

కాగా ఉత్తరాదిలో కాలుష్యం పెరిగిపోవడంతో రాత్రిపూట పొగ మంచు దట్టంగా అలుముకుంటున్నది. ఇప్పటికే ఢిల్లీలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు పని చేయడం లేదు. ఎన్‌సీ‌ఆర్‌కు దగ్గరగా ఉండే జైపూర్‌పై కూడా కాలుష్యం ప్రభావం చూపిస్తున్నది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సక్రమంగా జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి.

జట్ల అంచనా :

ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్/అక్షర్ పటేల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, హర్షల్ పటేల్/అవేశ్ ఖాన్

న్యూజీలాండ్ : మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, టిమ్ సిఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్ (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, జేమ్స్ నీషమ్, టిమ్ సౌథీ (కెప్టెన్), లాకీ ఫెర్గూసన్/అడమ్ మిల్నే, ఇష్ సోథి, ట్రెంట్ బౌల్ట్

హెడ్ – టు – హెడ్

ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మొత్తం టీ20లు : 17, ఇండియా – 6, న్యూజీలాండ్ – 9, టై – 2

వేదిక: సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం
సమయం: రేపు రాత్రి 7.30 గంటలు
లైవ్: స్టార్ స్టోర్స్ నెట్‌వర్క్
స్ట్రీమింగ్: డిస్నీ+హాట్‌స్టార్

Tags:    

Similar News