తగ్గేదే లే..! కొనసాగుతున్న కరోనా ఉధృతి
దిశ, వెబ్‌డెస్క్: రెండో దశలో కరోనా వైరస్ వీర విజృంభణ కొనసాగుతున్నది. దేశంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కర్ఫ్యూలు, పాక్షిక లాక్‌డౌన్‌లు, మైక్రో కంటైన్మెంట్ జోన్లు, ఆంక్షలు విధించినా వైరస్ మాత్రం ‘తగ్గేదే లే..’ అంటూ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,68,912 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభించినప్పటి నుంచి రోజూవారీ కేసులు ఈ స్థాయిలో నమోదవడం […]
దిశ, వెబ్‌డెస్క్: రెండో దశలో కరోనా వైరస్ వీర విజృంభణ కొనసాగుతున్నది. దేశంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కర్ఫ్యూలు, పాక్షిక లాక్‌డౌన్‌లు, మైక్రో కంటైన్మెంట్ జోన్లు, ఆంక్షలు విధించినా వైరస్ మాత్రం ‘తగ్గేదే లే..’ అంటూ విజృంభిస్తున్నది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,68,912 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభించినప్పటి నుంచి రోజూవారీ కేసులు ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా నానాటికీ ఎక్కువవుతున్నది. నిన్న కరోనా బారిన పడి 904 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,70,179 కు చేరింది.
ఇక కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1,35,27,717 కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 12 లక్షలు (12,01,009) దాటాయి. ఆదివారం 75,086 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు దేశంలో 10,45,28,565 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రపంచంలో రెండో స్థానంలోకి భారత్
దేశంలో నమోదైన కొత్త కేసులతో ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో నేటి (సోమవారం) ఉదయం వరకు యూఎస్ (3.1 కోట్ల కేసులు) తొలిస్థానంలో ఉండగా.. బ్రెజిల్ (1.34 కోట్ల కేసులు) రెండో స్థానంలో ఉండేది. కానీ తాజాగా భారత్ లో నమోదైన కొత్త కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి 35 లక్షలకు చేరింది. దీంతో బ్రెజిల్‌ను వెనక్కి నెట్టి భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించింది.