ఉద్రిక్తతల పరిష్కారానికి ఐదు అంశాలు

దిశ, వెబ్ డెస్క్: వాస్తవాధీన రేఖలో నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారానికి భారత్, చైనాల మధ్య గురువారం కీలక ముందడుగు పడింది. మాస్కోలో గురువారం రాత్రి సుమారు రెండున్నర గంటపాటు జరిగిన సమావేశంలో భారత్, చైనా విదేశాంగ మంత్రులు ఎస్ జైశంకర్, వాంగ్ యీ లు సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించడానికి, సైనిక దళాలను ఉపసంహరించి శాంతి నెలకొల్పడానికి ఐదు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఉభయ దేశాల మధ్య సంబంధాలు, సరిహద్దులో పరిస్థితులపై ఇరుదేశాల మంత్రులు చర్చించారు. అనంతరం సంయుక్త […]

Update: 2020-09-11 03:55 GMT

దిశ, వెబ్ డెస్క్: వాస్తవాధీన రేఖలో నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారానికి భారత్, చైనాల మధ్య గురువారం కీలక ముందడుగు పడింది. మాస్కోలో గురువారం రాత్రి సుమారు రెండున్నర గంటపాటు జరిగిన సమావేశంలో భారత్, చైనా విదేశాంగ మంత్రులు ఎస్ జైశంకర్, వాంగ్ యీ లు సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించడానికి, సైనిక దళాలను ఉపసంహరించి శాంతి నెలకొల్పడానికి ఐదు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు.

ఉభయ దేశాల మధ్య సంబంధాలు, సరిహద్దులో పరిస్థితులపై ఇరుదేశాల మంత్రులు చర్చించారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో పేర్కొన్న ఐదు అంశాలు ఇలా ఉన్నాయి.

1. భారత్, చైనా దేశాధినేతల మధ్య కుదిరిన అంగీకారాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. విభేదాలు వివాదాలు కాకుండా చూసుకోవాలన్న సూచన అనుసరించాలి.

2. సరిహద్దులోని ప్రస్తుత పరిస్థితులు ఉభయ దేశాలకు నిష్ప్రయోజనమే. కాబట్టి, సైన్యం చర్చలు కొనసాగించాలి. ఆర్మీ వెంటనే ఉపసంహరణ అమలు చేయాలి. సరిహద్దు నుంచి సరైన దూరాన్ని చేరి ఉద్రిక్తతలు తొలగించాలి.

3. భారత్, చైనా సరిహద్దు విషయమై ఇదివరకే ఏర్పడ్డ అంగీకారాలు, నిబంధనలను ఇరుదేశాలు తప్పక పాటించాలి. సరిహద్దులో శాంతియుత వాతావరణానికి దోహదపడాలి. ఉద్రిక్తతలు కల్పించే చర్యలకు పూనుకోరాదు.

4. ఇరుదేశాల మధ్య ప్రత్యేక ప్రతినిధుల మెకానిజం ద్వారా చర్చలు కొనసాగించాలి. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూఎంసీసీ సంప్రదింపులూ కొనసాగాలి.

5. బార్డర్‌లో పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఇరుదేశాల మధ్య విశ్వాసాన్ని ఏర్పరిచే చర్యలు తీసుకోవాలి. సరిహద్దులో శాంతి కొనసాగేందుకు కృషి చేయాలి.

సంబంధాలు సరైన దిశలో ఉంటే సమస్యలుండవ్: చైనా

మాస్కోలో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై లోతుగా చర్చించిన అనంతరం భారత్, చైనాలు ఐదు అంశాలపై అంగీకారానికి వచ్చాయని చైనా ఎంబసీ పేర్కొంది. భారత్, చైనా సంబంధాలు మరోసారి గందరగోళంలో పడ్డాయని, అయితే, ఇరుదేశాల మధ్య సంబంధాలు సరైన దిశలో ఉన్నన్నాళ్లు ఎలాంటి సవాలు, సమస్యనైనా అధిగమించవచ్చునని విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నట్టు వివరించింది.

సరిహద్దులో మే నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాలో నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి హాజరైన ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి పూర్వం వీరిరువురు రష్యా విదేశాంగ మంత్రితోనూ సమావేశమై త్రైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు.

ప్రపంచ వృద్ధి, శాంతి, స్థిరత్వానికి ఈ మూడు దేశాల పరస్పరం సహకారం, వృద్ధి కీలకమని మూడు దేశాల మంత్రులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 23న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్న బహుళపక్ష ప్రయోజనాలపై తమ అభిప్రాయాలను పునరుద్ఘాటించారు.

Read Also…

బీరుట్ ఓడరేవులో మంటలు..

Full View

Tags:    

Similar News