దేశంలో మెరిట్ విధానం లోపభూయిష్టం
బీఆర్ అంబేద్కర్ చారిత్రాత్మక మహద్ సత్యాగ్రహా సమయంలో పేర్కొన్న అంశాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయన్నారు.

- దళితులు, ఓబీసీలు, గిరిజనులకు అన్యాయం
- ఇది ఉన్నత కులాలకు మాత్రమే అనుకూలం
- ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: భారత దేశంలో మెరిట్ వ్యవస్థ పూర్తి లోప భూయిష్టంగా ఉంది. దళితులు, గిరిజనులు, ఓబీసీ కులా వారు విద్య, పాలనలో అవకాశాలు పొందడంలో అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. నా సొంత సామర్థ్యంతో నా సామాజిక స్థితిని దాటి బయటకు రావడం చాలా కష్టతరంగా మారింది. దేశంలోని విద్యా, పాలనా వ్యవస్థలో దళితులు, ఓబీసీలు, ఆదివాసీల సరైన అవకాశాలు పొందుతున్నారని ఎవరైనా భావిస్తే.. అది పూర్తిగా తప్పుడు భావనే అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం అమలు అవుతున్న మెరిట్ విధానం అగ్ర కులాలకు అనుకూలంగా ఉందని రాహుల్ చెప్పారు. అందువల్లే రిజర్వేషన్లు ఉన్నా.. అగ్రకులాల ఆధిపత్యం ఎక్కువగా ఉందని.. ఈ మెరిట్ వ్యవస్థ పూర్తిగా అన్యాయమైనదని రాహుల్ పేర్కొన్నారు.
కుల గణన చేపడితేనే అసమానతలు, వివక్ష వంటి విషయాల్లో సత్యాలు వెలుగులోకి వస్తాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చారిత్రాత్మక మహద్ సత్యాగ్రహా సమయంలో పేర్కొన్న అంశాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయన్నారు. 1927 మార్చి 20న బాబా సాహెబ్ అంబేద్కర్ మహద్ సత్యాగ్రహం సందర్భంగా కుల వివక్షను నేరుగా సవాలు చేశారు. ఇది కేవలం నీటి కోసం పోరాటం మాత్రమే కాదని.. సమానత్వం, గౌరవం కోసం పోరాటమని ఆయన ఆనాడే చెప్పారని రాహుల్ అన్నారు. కుల గణన వల్ల తప్పకుండా అసమానతలను వెలుగులోకి తీసుకొని వచ్చే అవకాశం ఉన్నట్లు తాను నమ్ముతున్నానని రాహుల్ అన్నారు. అయితే ప్రత్యర్థులకు ఈ విషయం తెలుసు కాబట్టే అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన పోరాటం చరిత్రలో ఒక భాగం మాత్రమే కాదని.. అది నేటికీ కొనసాగుతున్న పోరాటం అని రాహుల్ చెప్పారు. బాబా సాహెబ్ కల ఇంకా నెరవేరలేదని.. దాన్ని పూర్తి శక్తితో ముందుకు తీసుకొని వెళ్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కుల సర్వేకు సంబంధించిన అధ్యయన కమిటీలో ప్రొఫెసర్ థోరట్ భాగస్వామిగా ఉన్నారు. ఆయన విద్యావేత్త, ఆర్థికవేత్త మాత్రమే కాకుండా దళిత సమస్యలపై కొన్నాళ్లుగా అధ్యయనం చేస్తున్నారు.