సర్కార్ బాటలో ప్రైవేట్ విద్యార్థులు

దిశ, తెలంగాణ బ్యూరో: థర్డ్ వేవ్, లాక్ డౌన్ భయలతో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపించేందుకు ఆసక్తి చూపడం లేదు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం క్రమంగా పెరుగుతోంది. పాఠశాలలు తెరిచిన 3వ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో 42.76 హాజరుశాతం ఉండగా.., ప్రైవేటులో 22.78 శాతం మాత్రమే నమోదైంది. మొత్తం ప్రభుత్వ, ప్రైవేటులో కలిసి 30.28శాతం విద్యార్థులు హాజరయ్యారు. థర్డ్ వేవ్ భయంతో రాష్ట్రంలో 1,182 ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మూసివేసేందుకు నిర్ణయాలు […]

Update: 2021-09-03 20:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: థర్డ్ వేవ్, లాక్ డౌన్ భయలతో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపించేందుకు ఆసక్తి చూపడం లేదు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం క్రమంగా పెరుగుతోంది. పాఠశాలలు తెరిచిన 3వ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో 42.76 హాజరుశాతం ఉండగా.., ప్రైవేటులో 22.78 శాతం మాత్రమే నమోదైంది. మొత్తం ప్రభుత్వ, ప్రైవేటులో కలిసి 30.28శాతం విద్యార్థులు హాజరయ్యారు. థర్డ్ వేవ్ భయంతో రాష్ట్రంలో 1,182 ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మూసివేసేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

సర్కారు పాఠశాలకే మొగ్గు

ప్రభుత్వ పాఠశాలలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. సెకండ్ వేవ్ ప్రబలిన సమయంలో ఎదురైన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఫీజులు చెల్లించడం ఇష్టం లేక ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపడం లేదు. ఫీజులు చెల్లించిన తరువాత థర్డ్ వేవ్ ప్రబలి మళ్లీ విద్యాసంస్థలు మూసివేయాల్సి వస్తే నష్టపోతామని పేరెంట్స్ భావిస్తున్నారు. కొంత కాలం పాటు పరిస్థితులను గమనించిన తరువాత నిర్ణయం తీసుకుందామనుకుంటున్నారు. ఈ లోపు అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. చాల వరకు గ్రామీణ, మండల కేంద్రాల్లో పలు ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోకపోవడంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు చూస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 42.76శాతం హాజరు

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 52.73లక్షల మంది విద్యార్థులకుగాను 15.96లక్షల మంది ( 30.28శాతం) హాజరయ్యారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలలో 20.05లక్షల మంది విద్యార్థులకు 8.57లక్షల మంది (42.76శాతం) హాజరయ్యారు. ఎయిడెడ్ పాఠశాలల్లో 82.4వేల మందికి 13.1వేల మంది (16.01శాతం), ప్రైవేటులో 31.84లక్షల మందికి 7.25లక్షల మంది (22.78శాతం) విద్యార్థులు హాజరయ్యారు. అత్యధికంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో 53.08శాతం మంది హాజరు కాగా, అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 17.78శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

మూసివేత దిశగా 1,182 ప్రైవేటు పాఠశాలలు

పాఠశాలలు ప్రారంభించి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ పలు ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. రాష్ట్రంలో మొత్తం 10,818 ప్రైవేటు పాఠశాలలు ఉండగా 3వ రోజు వరకు 9,636 పాఠశాలలు మాత్రమే తెరుచుకున్నాయి. మరో 1,182 పాఠశాలు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. ఈ పాఠశాలలన్ని చిన్న, మధ్యతరహాకు చెందిన బడ్జెట్ స్కూళ్లుగా తెలుస్తోంది. కరోనా పరిస్థితులతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, తరగతుల ప్రారంభానికి పెట్టుబడులు లేకపోవడం వంటి కారణాతో ఈ స్కూళ్లు తెరుచుకోలేదు. పెట్టుబడులు పెట్టి ప్రారంభించిన తరువాత థర్డ్ వేవ్ ప్రబలితే తమ పరిస్థితి ఏమిటని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. మళ్లీ స్కూళ్లు మూసివేయాల్సి వప్తే నష్టాలు భరించలేమని పాఠశాలలు తెరిచేందుకు సాహాసం చేయడం లేదు. సెకండ్ వేవ్ ప్రభావానికి పూర్తిగా నష్టపోయిన పాఠశాలల యాజమాన్యాలు ఇతర స్కూళ్లలో తమ స్కూళ్లను విలీనం చేయడం లేదా మూసివేసే ఆలోచనలో ఉన్నారు.

Tags:    

Similar News