భైంసా ఘటన.. నా కొడుకు, భర్తను చూపించకపోతే ఆత్మహత్య చేసుకుంటాం..
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: భైంసా అల్లర్లలో తన కొడుకుపై అక్రమ కేసులు బనాయించారని.. అరెస్టు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూపించలేదని ఘటనలో అరెస్టయిన గోకుల్ తల్లి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులు గురువారం మీడియా సమావేశంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. తన కొడుకు గోకుల్ తమపై దాడి చేస్తున్న వారిని అడ్డుకుంటుంటే కేవలం సీసీ పుటేజీలో కనిపించాడని చెప్పి అరెస్టు […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: భైంసా అల్లర్లలో తన కొడుకుపై అక్రమ కేసులు బనాయించారని.. అరెస్టు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూపించలేదని ఘటనలో అరెస్టయిన గోకుల్ తల్లి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులు గురువారం మీడియా సమావేశంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. తన కొడుకు గోకుల్ తమపై దాడి చేస్తున్న వారిని అడ్డుకుంటుంటే కేవలం సీసీ పుటేజీలో కనిపించాడని చెప్పి అరెస్టు చేశారని సురేఖ వాపోయారు. వెంటనే అతనిని చూపించకుంటే ఆత్మహత్య చేసుకుంటానన్నారు. ఇప్పటి వరకు తన కొడుకుకు ఏమైందో కూడా పోలీసులు చెప్పడం లేదని, ఏం జరిగినా వారిదే బాధ్యత అన్నారు. తమ ఇండ్లపైకి కత్తులు పట్టుకొని వచ్చిన వారిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదన్నారు.
నా భర్తను చూపించండి..
తన భర్త బాలాజీని చూపించడం లేదంటూ అతడి భార్య సుజాత సైతం విలేకరుల సమావేశంలో కంటతడి పెట్టుకుంది. రూ. 5 వేలకు పెట్రోల్ అమ్మావంటూ తన భర్తను అరెస్టు చేసిన పోలీసులు ఇంత వరకూ చూపించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘర్షణల్లో కేవలం హిందువులనే అరెస్టు చేసి తీవ్రంగా కొడుతున్నారని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
భైంసా అల్లర్లలో అరెస్టు చేసిన 25 మందిని వారి తల్లిదండ్రులకు చూపించపోవడంతో తిండీతిప్పల్లేక ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఓ తల్లి తన కొడుకుకోసం ఆత్మహత్య చేసుకుంటానంటే సర్దిచెప్పి ఇక్కడికి తీసుకొచ్చామని, అరెస్టు చేసిన వారిని వెంటనే చూపించాలని డిమాండ్ చేశారు. వారి వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెమ రాజు, రాజేశ్వర్‍రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాదం అరవింద్ పాల్గొన్నారు.