లాక్‌డౌన్ వేళ.. అంపైర్లు ఏం చేస్తున్నారు?

దిశ, స్పోర్ట్స్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా క్రికెట్ ఆటతో పాటు సంబంధిత కార్యాకలాపాలన్నీ స్తంభించిపోయాయి. అకస్మాత్తుగా వచ్చి పడ్డ ఈ విరామాన్ని ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు వాడుకుంటున్నారు. ఇండియాలో లాక్‌డౌన్ ప్రకటించడంతో క్రీడాకారులు అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. కానీ ఐసీసీ ప్యానెల్‌లో ఉన్న భారత అంపైర్లు ఏం చేస్తున్నారో తెలుసా..? క్రీడాకారులే ప్రాక్టీస్ మానేసి ఇంట్లో కూర్చున్న తర్వాత, అంపైర్లు మాత్రం ఏం చేస్తుంటారు.. హాయిగా ఎంజాయ్ చేస్తుంటారనే అనుకుంటున్నారా..? వాళ్లేం చేస్తున్నారో బీసీసీఐ తమ […]

Update: 2020-04-26 05:21 GMT

దిశ, స్పోర్ట్స్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా క్రికెట్ ఆటతో పాటు సంబంధిత కార్యాకలాపాలన్నీ స్తంభించిపోయాయి. అకస్మాత్తుగా వచ్చి పడ్డ ఈ విరామాన్ని ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు వాడుకుంటున్నారు. ఇండియాలో లాక్‌డౌన్ ప్రకటించడంతో క్రీడాకారులు అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. కానీ ఐసీసీ ప్యానెల్‌లో ఉన్న భారత అంపైర్లు ఏం చేస్తున్నారో తెలుసా..? క్రీడాకారులే ప్రాక్టీస్ మానేసి ఇంట్లో కూర్చున్న తర్వాత, అంపైర్లు మాత్రం ఏం చేస్తుంటారు.. హాయిగా ఎంజాయ్ చేస్తుంటారనే అనుకుంటున్నారా..? వాళ్లేం చేస్తున్నారో బీసీసీఐ తమ వెబ్‌సైట్‌లో వివరించింది. ఐసీసీ అంపైర్లయిన నితిన్ మీనన్, అనిల్ చౌదరి, సి. శంషుద్దీన్, వీరేంద్ర శర్మలు సామాజిక సేవతో పాటు ఆన్‌లైన్‌లో అంపైరింగ్ పాఠాలు చెప్పడమే కాకుండా తమ అంపైరింగ్ స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఖాళీ సమయంలో ఐసీసీ నిబంధనలు అధ్యయనం చేయడం, అంపైరింగ్ కోచ్‌లతో బృంద చర్చలు, థర్డ్ అంపైరింగ్‌కు సంబంధించిన వీడియోలు చూస్తూ మరిన్ని మెళకువలు తెలుసుకుంటున్నామని వీరేంద్ర శర్మ చెబుతున్నారు.

‘క్రికెట్‌లో టెక్నాలజీ వాడకం పెరిగిపోయింది. అంపైర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) వచ్చిన తర్వాత అంపైర్లు తమ నిర్ణయంపై మరింత కచ్చితత్వం పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మ్యాచ్‌ల రియల్ టైం ఫుటేజీలు చూస్తూ అంపైరింగ్ నిర్ణయాలపై విశ్లేషణ చేసుకుంటున్నాం. ముఖ్యంగా డీఆర్ఎస్‌తో పోటీపడి నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నామని’ శంషుద్దీన్ చెబుతున్నారు. ఇక లాక్‌డౌన్‌కు ముందు ‘నితిన్ మీనన్’ ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్, శ్రీలంక-జింబాబ్వే టెస్టు మ్యాచ్‌కు అంపైరింగ్ చేసి చాలా బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు 62 టెస్టు మ్యాచ్‌‌లకు అంపైరింగ్ చేసిన మీనన్.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో జూనియర్లకు అంపైరింగ్ పాఠాలు చెబుతున్నారు. ‘టెస్టు మ్యాచ్‌కు అంపైరింగ్ చేయడం ఒక గౌరవమే కాకుండా, చాలా బాధ్యతతో కూడుకున్నదని’ ఆయన చెబుతున్నారు. ఇక ఐపీఎల్ వల్ల కేవలం ఆటగాళ్ల స్కిల్స్ మాత్రమే కాదు మాకు అంపైరింగ్‌లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంపై అవగాహన ఏర్పడిందని మీనన్ అంటున్నారు.

లాక్‌డౌన్‌కు ఒక రోజు ముందు ఉత్తరప్రదేశ్‌లోని తన సొంతూరుకి వెళ్లి చిక్కుకొని పోయిన అంపైర్ అనిల్ చౌదరి.. ఆ తర్వాత ప్రభుత్వ సహాయంతో ఢిల్లీ చేరుకున్నారు. కాగా, రద్దయిన ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్‌లకు అనిల్ చౌదరి అంపైర్‌గా వ్యవహరించాల్సి ఉంది. లక్నో వెళ్లాక మ్యాచ్ రద్దు విషయాన్ని ప్రకటించడంతో తన సొంతూరుకి వెళ్లారు. అక్కడకు వెళ్లాక కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తన ఊరి చివరన చెట్టు ఎక్కి ఫోన్ సిగ్నల్ అందిన తర్వాత సన్నిహితులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ‘లాక్‌డౌన్ వేళ.. మా స్వగ్రామంలో చాలా సంతోషంగా గడిపానని.. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనాను కట్టడి చేశారని’ చెబుతున్నారు. ఐసీసీ ఆటో నోబాల్ నిబంధన ప్రకటించిన తర్వాత హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆటో నోబాల్ ఇచ్చిన తొలి ఇండియన్ అంపైర్‌గా అనిల్ చౌదరి రికార్డు సృష్టించారు.

ప్రస్తుతం అందరు అంపైర్లు ఆన్‌లైన్‌లో ఇతరులకు పాఠాలు చెబుతున్నారు. అంతే కాకుండా ఐసీసీ నిర్వహిస్తున్న అంపైరింగ్ పాఠాల్లో పాలుపంచుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన శంషుద్దీన్ హెచ్‌సీఏ ఆధ్వర్యంలో లోకల్ అంపైర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఫీల్డ్‌లో ఎదురయ్యే అనుభవాలు, ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా ఎలా నడుచుకుకోవాలో తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచుల్లో ఉండే ఒత్తిడిని ఎలా జయించాలనే విషయాలపైనా అంపైర్లకు శిక్షణ ఇస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా లాక్‌డౌన్ ముగిసి తిరిగి ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాలని ఈ నలుగురు అంపైర్లు కోరుకుంటున్నారు.

Tags : BCCI, ICC Panel, Umpires, Lockdown, Corona, Cricket

Tags:    

Similar News