జనాలున్నారు… కానీ కొనేవాళ్లేరి?

         హైదరాబాద్‌లో ప్రతి ఏడాది జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. దుస్తులు, ఇంటి సామాను, అలంకరణ వస్తువులు, అవసరాలు తీర్చే వస్తువులు ఇలా అక్కడ దొరకనిది ఏదీ ఉండదు అంటే అతిశయోక్తి కాదు… ఇక సందర్శకుల గురించి చెప్పనక్కర్లేదు. ఇసుక వేస్తే రాలనంత మంది జనం వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. గత 80 ఏళ్లు నడుస్తున్న ఈ ఎగ్జిబిషన్‌లో దుకాణాలు పెట్టుకోవడానికి వివిధ రాష్ట్రాల […]

Update: 2020-02-02 01:55 GMT

హైదరాబాద్‌లో ప్రతి ఏడాది జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. దుస్తులు, ఇంటి సామాను, అలంకరణ వస్తువులు, అవసరాలు తీర్చే వస్తువులు ఇలా అక్కడ దొరకనిది ఏదీ ఉండదు అంటే అతిశయోక్తి కాదు… ఇక సందర్శకుల గురించి చెప్పనక్కర్లేదు. ఇసుక వేస్తే రాలనంత మంది జనం వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. గత 80 ఏళ్లు నడుస్తున్న ఈ ఎగ్జిబిషన్‌లో దుకాణాలు పెట్టుకోవడానికి వివిధ రాష్ట్రాల వ్యాపారస్తులు పోటీపడతారు. లాభాలు పొంది ఆనందపడతారు. కానీ ఈసారి దుకాణాలు పెట్టుకున్న వారు మాత్రం నిరాశలో మునిగి తేలుతున్నారు. అలాగని సందర్శకులు తక్కువయ్యారని కాదు, కొనేవాళ్లు లేరని.

అవును, సందర్శకులు విపరీతంగా ఉన్నప్పటికీ అందరూ చూసి, బేరమాడి వెళ్తున్నారే తప్ప కొనేవారే కరవయ్యారని అక్కడి దుకాణదారులు వాపోతున్నారు. జనవరి 1, 2020న ప్రారంభమై 46 రోజుల పాటు సాగనున్న ఈ ఎగ్జిబిషన్‌లో ఉన్న మొత్తం 2900ల దుకాణాల్లో కనీసం 50 శాతం దుకాణాలకు కూడా ఈ ఏడాది లాభాలు రాలేదట. పైగా వినియోగదారుల బేరమాడే ధోరణి కారణంగా నష్టాల పాలయ్యామంటూ వారు గోడు వెళ్లబోసుకుంటున్నారు.

నిజంగా కొనట్లేదా? లేక సందర్శకులు లేరా?

ఈ విషయం మీద దుకాణాదారులు, నిర్వాహకుల వాదనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సందర్శకులు నుమాయిష్ ను సందర్శించారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇందుకు టికెట్ల అమ్మకాన్ని కూడా వారు రుజువుగా చూపిస్తున్నారు. అయితే దుకాణాదారులు మాత్రం గతేడాది వచ్చిన వాళ్లలో యాభై శాతం మంది కూడా రాలేదంటున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులను, వారి అమ్మకాల్లో నష్టాన్ని చూపిస్తున్నారు.

కశ్మీరీల పరిస్థితి మరీ దారుణం

ప్రతి ఏడాది నుమాయిష్‌లో కశ్మీరీ శాలువలు, తోలు ఉత్పత్తులు, డ్రైఫ్రూట్స్ అమ్మడానికి 1000కి పైగా దుకాణాలు వెలుస్తాయి. ఇక ఈ దుకాణాలకు కూడా సందర్శకుల తాకిడి కూడా బాగానే ఉంటుంది. అయితే గతేడాది జరిగిన అగ్నిప్రమాదం, ఆర్టికల్ 370కి సంబంధించిన గొడవల వంటి కారణాలతో కశ్మీరీ దుకాణాల సంఖ్య తగ్గింది. అతి కష్టం మీద దుకాణం పెట్టుకున్నవారి పరిస్థితి కూడా కొనేవాళ్లు లేకపోవడంతో దారుణంగా మారింది.

పొడిగించే ఉద్దేశం లేదు: నిర్వాహకులు

సందర్శకుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యం కోసం నుమాయిష్‌ని పొడిగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం పొడిగించే ఉద్దేశం లేదని నుమాయిష్ సెక్రటరీ ప్రభ శంకర్ తెలియజేశారు. కాగా, ఫిబ్రవరి 15తో నుమాయిష్ ముగియనుంది.

Tags:    

Similar News