కరోనా ఎఫెక్ట్.. తెలంగాణ సర్కారుకు మళ్లీ కష్టాలు..

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్​ వేవ్‌కు పగ్గాలు లేకుండా పోతోంది. పాజిటివ్​ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతి పది మందిలో ఐదుగురు కరోనా బాధితులున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయం మళ్లీ తగ్గిపోతోంది. గత ఏడాది మొత్తం రూపాయి ఆదాయం లేకపోవడంతో చాలా వ్యాపారాలకు తాళాలు వేసుకున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో సెకండ్​ వేవ్​ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. బార్లకు తగ్గించారు.. రాష్ట్రానికి ఆదాయం వచ్చే లిక్కర్​ వ్యాపారం మందగించింది. బార్ల నుంచి వచ్చే […]

Update: 2021-04-19 07:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్​ వేవ్‌కు పగ్గాలు లేకుండా పోతోంది. పాజిటివ్​ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతి పది మందిలో ఐదుగురు కరోనా బాధితులున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయం మళ్లీ తగ్గిపోతోంది. గత ఏడాది మొత్తం రూపాయి ఆదాయం లేకపోవడంతో చాలా వ్యాపారాలకు తాళాలు వేసుకున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో సెకండ్​ వేవ్​ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

బార్లకు తగ్గించారు..

రాష్ట్రానికి ఆదాయం వచ్చే లిక్కర్​ వ్యాపారం మందగించింది. బార్ల నుంచి వచ్చే ఆదాయం 30 శాతానికిపైగా తగ్గిపోయింది. దీంతో బార్లకు తాళాలు వేస్తున్నారు. కనీసం రెన్యూవల్​ ఫీజులను చెల్లించేందుకు కూడా నిర్వాహకులు సాహసించడం లేదు. రాష్ట్రంలో ప్రతిరోజూ బార్లలో రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల వ్యాపారం సాగుతుండేది. కానీ ఇప్పుడు సగం కూడా రావడం లేదు. ఇక మద్యం దుకాణాల్లో లిక్కర్ సేల్​కూడా తగ్గింది. ప్రధానంగా హైదరాబాద్​వంటి ప్రాంతాల్లో ఇది చాలా ప్రభావం చూపిస్తోంది. హైదరాబాద్​శివారు ప్రాంతాలను కలుపుకుని ఎక్కువగా అమ్ముడుపోయే చీఫ్​లిక్కర్​ఇప్పుడు 50 శాతం కూడా అమ్ముడు కావడం లేదంటున్నారు. ఎందుకంటే దీన్ని ఎక్కువగా కొనుగోలు చేసే రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు హైదరాబాద్‌ను ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లడంతో అమ్మకాలు తగ్గిపోయాయని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు.

‘వాణిజ్యం’ నిల్..​

ఈ నెల కమర్షియల్​ట్యాక్స్​వసూళ్లు కూడా తగ్గిపోతున్నట్లు అధికారులు వెల్లడించారు. రోజువారీగా దాదాపు 20 నుంచి 40 శాతం వసూళ్లు తగ్గిపోయాయని చెప్పుతున్నారు. కరోనా పాజిటివ్​కేసులు పెరుగుతుండటంతో షాపింగ్​మాల్స్‌కు వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. దీంతో కొనుగోళ్లు సగానికి పడిపోయాయి. ప్రస్తుతం రోజువారీ ఆదాయంలో సగటున 20 శాతం ఆగిపోయిందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వివరించారు.

రవాణా అస్తవ్యస్థం

కరోనా వల్ల క్యాబ్, ఆటో డ్రైవర్ల ఉపాధికి దెబ్బపడింది. ఇప్పుడిప్పుడే కాస్త గాడిలో పడుతుండగా.. ఇంతలోనే కరోనా సెకండ్‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌ రూపంలో వారిపై ఎఫెక్ట్‌ పడింది. ఓలా, ఊబెర్‌ డ్రైవర్లు రోజూ 16 నుంచి 18 గంటల పాటు ఉంటున్నా ఆశించిన స్థాయిలో బుకింగ్‌‌‌‌‌‌‌‌లు రావడం లేదు. రాష్ట్రంలో లక్షకుపైగా క్యాబ్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్లు, 80 వేల మంది దాకా ఆటో డ్రైవర్లు ఉన్నారు. కరోనా కంటే ముందు ఒక్కో క్యాబ్​డ్రైవర్​రోజుకు రూ.1,500 నుంచి 2,000 వరకు సంపాదించేవారు. ప్రస్తుతం రూ. 500 కూడా దాటడంలేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల తిరిగేసరికి బ్యాంకులు, ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ సంస్థలకు కిస్తీలు కట్టాల్సిందేనని, గిరాకీ తగ్గిపోయిందని, ఎక్కడి నుంచి కట్టాలని వారు వాపోతున్నారు. గతేడాది కరోనా విజృంభణతో అనేక మంది కార్లు అమ్ముకున్నారు.

తగ్గిన ఆర్టీసీ కలెక్షన్స్..

ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో కూడా బాగా తగ్గింది. ఇటీవల 65 శాతం నుంచి 67 శాతం వరకు ఓఆర్‌‌ నమోదుకాగా, ఇప్పుడు ఏకంగా 43 శాతానికి పడిపోయింది. లాక్‌‌డౌన్‌‌ తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆర్టీసీ గాడిన పడే పరిస్థితులు కనిపించాయి. అప్పుడు ఏకంగా సగటున రోజుకు రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల కలెక్షన్స్​వచ్చాయి. ప్రస్తుతం బస్సులు, ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఆటోమెటిక్‌‌గా సంస్థకు కలెక్షన్స్​కూడా తగ్గిపోయాయి. దీంతో రోజువారీ కలెక్షన్​రూ.7 కోట్లకు పడిపోయింది. ఈ రెండు రోజుల నుంచి పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారిందని ఆర్టీసీ కార్మికులు చెప్పుతున్నారు.

ఆర్టీసీకి కరోనా నష్టం రూ. 2,400 కోట్లు

2020లో కరోనాతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత రోడ్డెక్కినా ప్రయాణికులు ఆదరించలేదు. 2019 డిసెంబర్‌‌లో 85.27 శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉండగా, 2020 డిసెంబర్‌‌లో 23.76 శాతానికి పడిపోయింది. మొత్తంగా 2020లో కరోనాతో ఆర్టీసీకి రూ. 2,400 కోట్ల నష్టం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు నివేదికల్లో తేల్చారు.

ఖాళీ చేస్తున్నారు..

హైదరాబాదులో తాజాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు గణనీయంగా పెరిగిపోగా రాబోయే రెండు నెలల్లో కరోనా విశ్వరూపం ప్రదరిస్తుందన్న ప్రచారంతో చాలా మంది ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. కోటికి పైగా జనాభా ఉన్న భాగ్యనగరంలో సగానికి పైగా ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే. లాక్‌డౌన్ ఉంటుందనే భయంతో జనం పల్లెబాట పడుతున్నారు. చాలా మంది సొంతూళ్ల బాట పడుతున్నారు. చిరు వ్యాపారులు, దినసరి కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు అద్దె ఇల్లు ఖాళీ చేసి ఊళ్లకు వెళ్లిపోతున్నారు. పేద, మధ్య తరగతి వారి సాధారణ గృహలకే కాదు అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లలో ఇదే పరిస్ధితి కొనసాగుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అద్దెలపై వచ్చే ఆదాయం రాకుండా పోయే ప్రమాదం ఉందని హౌస్ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రస్తుతం ఇంటి అద్దెలు 30 నుంచి 40 శాతానికి తగ్గించారు. గతంలో టు లెట్ బోర్డు ఉదయం పెడితే మధ్యాహ్నానికి బుక్ అయ్యిపోయేది. ఇప్పుడు రోజులు గడుస్తున్నా గేటు ముందు బోర్డు వేలాడుతూనే కనిపిస్తోంది. తక్కువ అద్దెకు ఇస్తామన్నా ఎవరూ రావడం లేదని ఇంటి యజమానులు వాపోతున్నారు.

బార్లలో నిబంధనలు పాటిస్తున్నా రావడం లేదు : పవన్​ కుమార్​ గౌడ్​, బార్​ యజమాని
బార్ల ఆదాయం చాలా అధ్వాన్నంగా మారింది. వేలాది మంది ఆధారపడి బతుకుతున్నారు. కరోనా సెకండ్​ వేవ్‌తో ఇప్పుడు మొత్తంగా మూసుకునే పరిస్థితులే ఎదురవుతున్నాయి. గత ఏడాది చాలా నష్టపోయాం. ఇప్పుడు తెరిచినా ఆదాయం లేదు. చాలా బార్లు అమ్ముకునేందుకు సిద్దంగా ఉన్నారు. వాస్తవానికి బార్లలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. అయినా గిరాకీ రావడం లేదు.

Tags:    

Similar News