కొత్త వైద్యారోగ్య శాఖ కార్యదర్శికి భారీ టాస్క్

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడిలో తొలిరోజుల్లో దేశానికే ఆదర్శంగా ఉందంటూ ప్రశంసలు పొందిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వరుస విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నా పరిస్థితి అదుపులోకి రావడానికి బదులుగా మరింత ఆందోళనకరంగా మారిపోవడం, ప్రజల్లో చర్చనీయాంశం కావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒకవైపు హైకోర్టు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కామెంట్లు కూడా ప్రజల్లో మరింత భయాందోళనలు పెరగడానికి, హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్ళకు వెళ్ళడానికి కారణమవుతోంది. నష్ట నివారణ చర్యలు […]

Update: 2020-07-16 10:03 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడిలో తొలిరోజుల్లో దేశానికే ఆదర్శంగా ఉందంటూ ప్రశంసలు పొందిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వరుస విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నా పరిస్థితి అదుపులోకి రావడానికి బదులుగా మరింత ఆందోళనకరంగా మారిపోవడం, ప్రజల్లో చర్చనీయాంశం కావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒకవైపు హైకోర్టు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కామెంట్లు కూడా ప్రజల్లో మరింత భయాందోళనలు పెరగడానికి, హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్ళకు వెళ్ళడానికి కారణమవుతోంది. నష్ట నివారణ చర్యలు తప్పవని భావించి వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ కమిషనర్‌ను బదిలీ చేసింది.

కొత్తగా వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న సయ్యద్ ఆలీ ముర్తతా రిజ్వీ ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన గంటల వ్యవధిలోనే వైద్యారోగ్య మంత్రితో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో సైతం మాట్లాడారు. రెండు మూడు రోజుల్లోనే నిర్దిష్ట ప్రతిపాదనలతో నివేదిక సమర్పిస్తే దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పరిస్థితిని చక్కదిద్దడానికి చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వం ఆయనకు టాస్క్ అప్పగించినట్లు తెలిసింది. తాజా పరిస్థితులను అధ్యయనం చేసి మళ్ళీ అదుపులోకి తీసుకురావడానికి ఉన్న మార్గాలపై రెండు రోజుల పాటు కసరత్తు చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళనున్నారు.

కరోనా వచ్చిన తొలి రోజుల్లో పూర్తిస్థాయిలో కట్టడి చేయగలిగిన ప్రభుత్వం ఇప్పుడు వేల సంఖ్యలో కేసులు వస్తున్నా దాన్ని ఎందుకు తగ్గించలేకపోతోందనే చర్చ అధికారుల స్థాయిలో మొదలైంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పటిష్టంగా అమలుచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా ఆ స్థాయిలో ఫలితాలను సాధించకపోవడం ఇప్పుడు బదిలీలకు దారితీసిందనే అభిప్రాయం ఆ శాఖ సిబ్బందిలో వ్యక్తమవుతోంది. మొదట్లో ప్రతీరోజు కరోనా కట్టడిపై సమీక్ష చేసే ముఖ్యమంత్రి ఆ తర్వాత దానిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదని, ఫలితంగా అధికారుల్లో సైతం ఆ మేరకు చిత్తశుద్ధి లోపించిందనే అభిప్రాయాన్నీ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌తో పాటు తెలంగాణకే కరోనా కట్టడి సవాలుగా మారిందని భావించిన ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే జరిగే నష్టాన్ని అంచనా వేసి దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. కరోనా కాలంలో సమర్ధవంతంగా వ్యవహరించి ఉన్నట్లయితే అధికారులకు వ్యక్తిగతంగా సమర్ధులనే గుర్తింపుతో పాటు ప్రజల్లో భయాందోళనలను నివారించడానికి ఆస్కారం ఉండేదని, కానీ నెల రోజులుగా ఫలితాలు దీనికి భిన్నంగా వచ్చాయన్నది ప్రభుత్వ అభిప్రాయం. అటు ముఖ్యమంత్రిగానీ, ఇటు వైద్యారోగ్య మంత్రిగానీ తాజా కరోనా పరిస్థితులపై మీడియా ముందుకు రాకపోవడం, ప్రతీరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తుండడం తాజా మార్పులకు కారణమైంది.

కొత్త కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న రిజ్వి తాజా పరిస్థితిని అధ్యయనం చేయడంతో పాటు ప్రభుత్వానికి ప్రతిపాదనలు, యాక్షన్ ప్లాన్ సూచనలు చేసిన తర్వాత తీసుకోబోయే నిర్ణయాలు, దానికి తగిన కార్యాచరణ ప్రధానాంశాలుగా మారాయి. రానున్న కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి ప్రజల్లో భయాందోళలను తొలగించడమే ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమని వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News