‘గులాబ్’తో పంటలు కరాబ్.. అన్నదాతను ఆదుకునేవారెవరు..?
దిశ, భూపాలపల్లి : గులాబ్ తుఫాన్ ప్రభావం వలన కురిసిన భారీ వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అతలాకుతలమైంది. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు తుఫాను ప్రభావం వలన వాగులు, చెరువులు పొంగిపొర్లడంతో పరిసర ప్రాంతాల్లోని పంటలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. సోమవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో కాటారం మలహర్, మహదేవపూర్, రేగొండ, ఘనపూర్ మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహించాయి. కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వచ్చిన […]
దిశ, భూపాలపల్లి : గులాబ్ తుఫాన్ ప్రభావం వలన కురిసిన భారీ వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అతలాకుతలమైంది. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు తుఫాను ప్రభావం వలన వాగులు, చెరువులు పొంగిపొర్లడంతో పరిసర ప్రాంతాల్లోని పంటలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. సోమవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో కాటారం మలహర్, మహదేవపూర్, రేగొండ, ఘనపూర్ మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహించాయి.
కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రవాహం, బ్యాక్‌వాటర్ వలన మలహర్ మండలంలోని మల్లారం గ్రామం వద్ద వంతెన పై నుండి నీరు ప్రవహిస్తుండటంతో తాడిచర్ల, కొయ్యూరు ప్రధాన రహదారిని మూసివేశారు. ఫలితంగా వందలాది ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పత్తిపంట పూత, కాయ చేతికొచ్చిన దశలో కురిసిన భారీ వర్షంతో మొత్తం నేలమట్టమైంది. ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒకే నెలలో రెండు సార్లు కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతినగా రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.