తాలిబన్స్ VS సోషల్ మీడియా
దిశ, ఫీచర్స్ : ఆఫ్ఘానిస్తాన్‌లో చివరిసారిగా తాలిబన్ అధికారంలో ఉన్నప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఉనికిలో లేవు. ప్రపంచ బ్యాంకు ప్రకారం దేశంలో ఇంటర్నెట్ వినియోగం దాదాపు 0.01% మాత్రమే. అయితే 2001లో తాలిబన్ పాలన నుంచి విముక్తి పొందిన అనంతరం దేశంలో డిజిటల్ టెలికమ్యూనికేషన్ సేవలకు యాక్సెస్ లభించింది. దీంతో మిలియన్ల మంది ఆఫ్ఘాన్‌ల జీవితాల్లో మార్పులొచ్చాయి. ఈ మేరకు దేశాన్ని మరింత వైవిధ్యమైన, ప్రజాస్వామ్య సమాజంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియా.. […]
దిశ, ఫీచర్స్ : ఆఫ్ఘానిస్తాన్‌లో చివరిసారిగా తాలిబన్ అధికారంలో ఉన్నప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఉనికిలో లేవు. ప్రపంచ బ్యాంకు ప్రకారం దేశంలో ఇంటర్నెట్ వినియోగం దాదాపు 0.01% మాత్రమే. అయితే 2001లో తాలిబన్ పాలన నుంచి విముక్తి పొందిన అనంతరం దేశంలో డిజిటల్ టెలికమ్యూనికేషన్ సేవలకు యాక్సెస్ లభించింది. దీంతో మిలియన్ల మంది ఆఫ్ఘాన్‌ల జీవితాల్లో మార్పులొచ్చాయి. ఈ మేరకు దేశాన్ని మరింత వైవిధ్యమైన, ప్రజాస్వామ్య సమాజంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియా.. తాలిబన్లకు కూడా ఉపయోగపడింది. అయితే మళ్లీ ఆఫ్ఘానిస్తాన్‌ను స్వాధీనం చేసుకుని ఆధికారంలోకి వచ్చిన తాలిబన్లతో ఆయా ప్లాట్‌ఫామ్స్ ఎలా వ్యవహరిస్తాయి? వారి అకౌంట్స్ కొనసాగిస్తాయా? లేదా?
20ఏళ్లపాటు పోరాడి ఆఫ్ఘాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు.. తమ ఉనికిని చాటేందుకు కేవలం పోరాటాలే కాదు ఇంటర్నెట్‌ను కూడా ఉపయోగించుకున్నారు. వారి కార్యక్రమాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు ఆన్‌లైన్ వేదికగా విడుదల చేయడానికి యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో అధికారిక ఖాతాలను వినియోగిస్తున్నారు. 2020లో తమ వాట్సాప్ గ్రూపుల్లో వైద్యాధికారుల చిత్రాలు పంచుకోగా.. తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అంతర్జాతీయ మీడియాతో సహా 3లక్షల మంది ఫాలోవర్లకు రెగ్యులర్ అప్‌డేట్‌లను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తున్నాడు. అయితే @AfghPresident అనే ట్విట్టర్ అకౌంట్ హోల్డర్ ఐడెంటిటీ పెండింగ్‌లో ఉండటంతో ట్విట్టర్ దాన్ని రద్దు చేసింది. ఇక యుద్ధంలో విజయం సాధించాలంటే తుపాకులు, బాంబులు, తలలు నరకడమే కాదు.. ప్రజల హృదయాలు గెలుచుకునేందుకు సోషల్ మీడియా ఒక పదునైన ఆయుధంగా తాలిబన్‌లు గ్రహించారని నిపుణులు చెబుతున్నారు.
ఆ ప్లాట్‌ఫామ్స్ ఏమంటున్నాయి?
సోషల్ మీడియా దిగ్గజ సంస్థలైన ఫేస్‌బుక్, యూట్యూబ్.. తాలిబన్లను తీవ్రవాద సంస్థగా పరిగణించి, వారి ఖాతాలను ఆపరేట్ చేయడాన్ని నిషేధించాయి. ట్విట్టర్ మాత్రం స్పష్టంగా ఆ గ్రూప్‌ను బ్యాన్ చేయలేదు. కానీ, కంపెనీ నియమనిబంధనలు అమలు చేస్తూ.. హింసను గ్లొరిఫై చేయడం, ప్లాట్‌ఫామ్ మ్యానిప్యులేషన్, స్పామ్ చేయడం వంటి రూల్స్ ఉల్లంఘించనంత వరకు ఖాతాలు కొనసాగుతాయని పేర్కొంది. అలాగే ‘ప్రజలను సురక్షితంగా ఉంచడం’ తమ ప్రధాన కర్తవ్యమని ట్విట్టర్ స్పష్టం చేసింది. ‘2019లో ట్విట్టర్ చట్టాలను ఉల్లంఘించినందుకు @HamasInfo, @HamasInfoEn (హమాస్ గ్రూప్ : గణనీయమైన రాజకీయ అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ హింసాత్మకమైన ఉగ్రవాద చర్యలకు పాల్పడింది) అనే అధికారిక ఖాతాలను తొలగించి, చట్టవిరుద్ధ తీవ్రవాద సంస్థలు, హింసాత్మక సమూహాలకు ట్విట్టర్‌లో చోటు లేదు’ అని స్పష్టం చేసింది.
అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థల జాబితాలో తాలిబన్ లేకపోయినా వారిపై ఆంక్షలు విధించింది. ఇక ఫేస్‌బుక్ తన ‘డేంజరస్ ఆర్గనైజేషన్’ పాలసీ కింద తాలిబన్లను వారి గ్రూప్‌కు మద్ధతిస్తున్న, ప్రాతినిధ్యం వహిస్తున్న ఖాతాలు, దాని తరఫున నడుస్తున్న అకౌంట్స్ హోల్డర్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఎమర్జింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే ప్రజలను అప్రమత్తం చేయడానికి ఆప్ఘాన్స్ (డారి, పాష్టో భాషలు తెలిసిన) నిపుణుల ప్రత్యేక బృందాన్ని కలిగి ఉన్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే ఫేస్‌బుక్ తన నియమాలను అమలు చేయడంలో ఇతర ఫ్లాట్‌ఫామ్స్ కన్నా కఠినంగా వ్యవహరిస్తోంది.
ఆఫ్ఘానిస్తాన్ గత అధికారిక ప్రభుత్వ ఖాతాలను, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తాలిబన్లు కొనసాగిస్తే సోషల్ మీడియా సంస్థలు ఎలా ఎదుర్కొంటాయన్నదే అసలైన ప్రశ్న. అయితే ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోగా.. యూట్యూబ్ మాత్రం అన్ని ఆంక్షలు, వాణిజ్య సమ్మతి చట్టాలకు సంస్థ కట్టుబడి ఉందని, హింసను ప్రేరేపించడాన్ని నిషేధిస్తుందని పేర్కొంది. ఇక మయన్మార్‌లో మారణహోమాన్ని ప్రేరేపించడానికి సోషల్ మీడియా ఎలా ఉపయోగపడిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఫేస్‌బుక్ ఆ ఘటనతో గొప్ప అనుభవాన్ని నేర్చుకుంది. అలాంటి ఘోరాలు పునరావృతం కావాలని ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కోరుకోదు. కానీ తాలిబన్లు సోషల్ మీడియాను ఎలా వాడతారు? వారికి ఆయా సంస్థలు చెక్ పెడతాయా? లేదా? అనే విషయం కొద్దిరోజుల్లోనే తెలుస్తుంది.