గూడు చెదిరి.. గుండెలు అలసి

దిశ, తెలంగాణ బ్యూరో : లోతట్టు ప్రాంతమైన ఇందిరానగర్​లో శనివారం సాయంత్రం కూడా వీధుల్లో బురదతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఇందిరానగర్​లో నివాసముండే సుల్తానా దంపతులు కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. సుల్తానా ఇంటి వద్దే కూరగాయలు అమ్ముతుండగా.. భర్త కూరగాయల బండితో వీధుల్లో తిరుగుతూ అమ్ముతుంటాడు. వీరిద్దరి సంపాదన కలిసి రోజుకు రూ. 2వేల నుంచి 3వేల దాకా ఉంటుంది.. వానల కారణంగా మూడు రోజులుగా వ్యాపారం సాగడం లేదు. […]

Update: 2020-10-17 23:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో :

లోతట్టు ప్రాంతమైన ఇందిరానగర్​లో శనివారం సాయంత్రం కూడా వీధుల్లో బురదతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఇందిరానగర్​లో నివాసముండే సుల్తానా దంపతులు కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. సుల్తానా ఇంటి వద్దే కూరగాయలు అమ్ముతుండగా.. భర్త కూరగాయల బండితో వీధుల్లో తిరుగుతూ అమ్ముతుంటాడు. వీరిద్దరి సంపాదన కలిసి రోజుకు రూ. 2వేల నుంచి 3వేల దాకా ఉంటుంది.. వానల కారణంగా మూడు రోజులుగా వ్యాపారం సాగడం లేదు. అమ్ముకోవడానికి తెచ్చిన కూరగాయలు సైతం నీటిలో మునిగిపోయాయి. రెండు రోజుల పాటు వరద, బురదతో ఇల్లు నిండిపోయింది. ఇంట్లోని వరద నీటిని తొలగించేందుకు శుక్రవారం ఉదయం 5 గంటలకు పని మొదలు పెడితే రాత్రి 9 గంటలయింది. ఇంట్లోని సోఫాలు, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, కూలర్, సోఫా అన్ని నీటిలోనే ఉండిపోయాయి. వరద నీటిలో నిత్యవసరాలు కూడా మునిగిపోయాయి.. చేతులో డబ్బులు లేవు.. ఇది సుల్తానా బాధ.. ‘మనిషి మునిగిపోయేంత వరదలు వచ్చినపుడు ఇక్కడ ఒక్కరు కూడా కనిపించలేదని, తాము ఎలా ఉన్నామో చూసే వారు కూడా లేరని’ స్థానిక మహిళ షబానా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క సుల్తానా, షబానానే కాదు.. ముంపు ప్రాంతల ప్రజలు ఎవ్వరిని కదిలించినా వారి కుటుంబ పరిస్థితి చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఆనవాళ్లు లేకుండా పోయిన మూసారాంబాగ్ గుడిసెలు..

బతుకు దెరువు కోసం ఏండ్ల కింద నగరానికి వచ్చి ఇంటి కిరాయిలు చెల్లించలేక మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర కాల్వ పక్కన గుడిసెలు వేసుకున్న జీవితాలు మొత్తం వరద కాల్వల్లో కొట్టుకుపోయాయి. వర్షం భారీగా కురుస్తోందని రోడ్డుకు అవతల వైపు వెళ్లి నిలబడ్డారు. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ఇంట్లోని బియ్యం, చీరలు, దుప్పట్లు, గిన్నెలు అన్నీ కొట్టుకుపోయాయి. మొదట్లో ఎలా వచ్చామో ఇప్పుడు అలాగే కట్టుబట్టలతో మిగిలిపోయామని గుడిసెల్లో ఉండే కె.నర్సింహా (60) చెబుతున్నారు.

పదేండ్ల వయసులో సిటీకి వచ్చిన ఈయనకు ఆధార్​ కార్డు, ఓటర్​ ఐడీ అన్ని ఇక్కడే ఉన్నాయి. అయినా పేదలు కావడంతో ఇల్లు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నాడు. కాల్వ పక్కన ఉండే 50 కుటుంబాలకు సంబంధించిన గుడిసెల కుటుంబాలు ఆనవాళ్లు లేకుండా వరదలు ఊడ్చేశాయి. ఆ స్థలంలో ఉన్న బురద మట్టిని తొలగించేందుకు మూడు రోజులుగా కష్టపడుతున్నారు. వర్షం వచ్చేటపుడు గతంలో పోలీసులు ముందుగానే చెప్పేవారని, ఈ సారి అలాంటివేమీ చెప్పకపోవడం ముందుగా జాగ్రత పడలేకపోయామని గోవిందమ్మ చెబుతున్నారు.

కరోనాతో పాటు వానలు కూడా మా గండానికే..

కరోనా వచ్చిందని ఇండ్లళ్ల పనులకు రానిస్తలేరని, ఎప్పుడో 30 ఏండ్ల కింద వచ్చి ఇక్కడే ఉంటుమని, ఊర్లకు పోయిన మాకు ఇల్లు, భూమి లేదని మూసారాంబాగ్ గుడిసెల వాసి ఇందిరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వానలు కూడా మా గండానే పడినట్టున్నయి. అన్నం వండుకునే గిన్నెలు, చీరలు అన్ని కొట్టుకుపోయినయి. మొత్తం కొట్టుకుపోయిన పాణమన్న మిగిలింది. గుడిసెలు కూలిపోతాయేమోనని బడిలోకి వెళ్లినం. లేకుంటే మేము కూడా సచ్చిపోతుండే.. మూడు రోజుల నుంచి గుడిసెల్లో బురద తీసుడే సరిపోతుంది. అని ఇందిరమ్మ కన్నీటి పర్యంతమాయె..

గుడిసెలు బాగు చేసుకుంటున్నా..

వరదల్లో అన్ని కొట్టుకుపోయినయి. కట్టుబట్టలతో మళ్లీ పట్నం వచ్చినట్టుంది ఇప్పుడు మా పరిస్థితి. ఏదో పని దొరికితే తినుడు, లేకుంటే పస్తులుండుడు.. అందులో ఈ వానలు వచ్చినంక చానా కష్టమయితుందని మూసారాంబాగ్ వాసి నర్సింహా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.. బియ్యం, చెద్దర్లు అన్ని కొట్టుకుపోయినయి. ఇప్పుడు తింటానికి కూడా దిక్కు లేదు. పదేండ్లునప్పుడు పట్నం వచ్చిన. ఇల్లు ఇయ్యమని ఎందరినీ కలిసినా ఇవ్వడం లేదు. దిక్కు లేక ఈ గుడిసెల్లోనే బతుకుతున్నం. ఇప్పుడు అన్ని కోల్పోయి మళ్లీ రోడ్డు మీద పడ్డాం.. అని కండ్లళ్ల నీళ్లు తీసుకున్నడు.

Tags:    

Similar News