వైద్యసిబ్బందికి 'అద్దె ఇళ్ళ' కష్టాలు
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నానా కష్టాలు పడుతుంటే వైద్య సిబ్బందికి మరొక కష్టం వచ్చిపడింది. కరోనా పాజిటివ్ పేషెంట్లకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బందికి ‘ఇంటి కష్టాలు’ మొదలయ్యాయి. చికిత్స చేసే క్రమంలో వారి ద్వారా మరొకరికి అంటుకునే ప్రమాదం ఉందన్న భయంతో అద్దెకు ఇళ్ళను ఇచ్చిన యజమానులు ఖాళీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఒక డాక్టర్‌కు ఈ పరిస్థితి […]
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నానా కష్టాలు పడుతుంటే వైద్య సిబ్బందికి మరొక కష్టం వచ్చిపడింది. కరోనా పాజిటివ్ పేషెంట్లకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బందికి ‘ఇంటి కష్టాలు’ మొదలయ్యాయి. చికిత్స చేసే క్రమంలో వారి ద్వారా మరొకరికి అంటుకునే ప్రమాదం ఉందన్న భయంతో అద్దెకు ఇళ్ళను ఇచ్చిన యజమానులు ఖాళీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఒక డాక్టర్‌కు ఈ పరిస్థితి ఎదురైన కొన్ని గంటల వ్యవధిలోనే నర్సులకు ఇలాంటి కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనాను చూసి దేశమంతా భయపడుతుంటే, కరోనా బాధితులు, అనుమానితులను అక్కున చేర్చుకుని చికిత్స చేస్తున్న వైద్యులకు మాత్రం ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతోంది. ఇది ఒక డాక్టర్ లేదా మరో నర్సుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. స్వంత కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయక కరోనా పాజిటివ్ పేషెంట్లకు చికిత్స చేస్తున్నందుకు లభించే ప్రతిఫలం ఇదేనా అనే నిరుత్సాహమూ వారిని వెంటాడుతోంది.
ఇక దేశంలోనే పేరెన్నికగన్న ఎయిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులకు కూడా ఈ బాధ తప్పలేదు. చికిత్స చేసే క్రమంలో ఆ వైరస్‌ను అంటించుకుని వస్తే తమ కుటుంబమంతా బాధలు పడాల్సి ఉంటుందంటూ ముఖం మీదనే మాట్లాడుతూ తక్షణం ఇళ్ళను ఖాళీ చేయాల్సిందిగా యజమానులు హుకుం జారీ చేస్తున్నారు. కొద్దిమంది పారామెడికల్ సిబ్బంది ఇండ్లలోని సామాన్లను యజమానులే రోడ్డుమీదకు వేసి వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని హెచ్చరించారు. ఒకవైపు ఢిల్లీ నగరమంతా లాక్‌డౌన్ నెలకొన్న సమయంలో ఆ సామాన్లను ఎక్కడికి తీసుకెళ్ళలేక అక్కడే ఉండి కాపలా కాయలేక నడిరోడ్డు మీదనే కాలం వెళ్ళబుచ్చుతున్న విషయాన్ని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా పరిగణించింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆ శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఆదర్శ్ ప్రతాప్ సింగ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ రాజ్‌కుమార్ ఓ లేఖ రాశారు. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని, నివాసానికి తగిన భరోసా ఇవ్వాలని అందులో కోరారు. దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్రతీరోజు ఇంటికి, ఆసుపత్రికి తిరుగుతున్న సమయంలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొన్ని సందర్భాల్లో గుర్తింపుకార్డును కూడా పోలీసులు లెక్కచేయడం లేదని ఆ లేఖలో వారిరువురూ వివరించారు. వెంటనే ఇంటి యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, రాకపోకల సమయంలో పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అమిత్ షాను కోరారు.
Tags: Corona, AIIMS, Warangal, MGM, Hospital, Delhi, Police, Amit Shah, Home Minister